పేదల పక్షపాతి కాకా వెంకటస్వామి: సీఎం రేవంత్ రెడ్డి

దివంగత నేత, మాజీ మంత్రి కాకా వెంకటస్వామి పేదల పక్షపాతిగా, తెలంగాణ వాదిగా తన జీవితకాలం చిత్తశుద్ధితో పనిచేశారని పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడరు

  • By: Somu    latest    Dec 22, 2023 11:37 AM IST
పేదల పక్షపాతి కాకా వెంకటస్వామి: సీఎం రేవంత్ రెడ్డి

విధాత : దివంగత నేత, మాజీ మంత్రి కాకా వెంకటస్వామి పేదల పక్షపాతిగా, తెలంగాణ వాదిగా తన జీవితకాలం చిత్తశుద్ధితో పనిచేశారని పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడరు. శుక్రవారం బాగ్‌బాగ్ లింగంపల్లిలోని డా.బీ.ఆర్. అంబేద్కర్ కళాశాలలో నిర్వహించిన వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు.


తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎంత సంపాదించామనేది కాదు.. సమాజానికి ఎంత పంచామనే సామాజిక బాధ్యత కాకా విధానమన్నారు. పేదల పక్షాన వెంకటస్వామి సాగించిన పోరాటం ఆయన ఇంటిపేరుగా, ప్రజలకు కాకాగా నిలిపిందన్నారు. గత 50 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చి దిద్దిన ఘనత కాకా సొంతమన్నారు. దేశ నిర్మాణంలో ఆయన వారి సామాజిక బాధ్యతను నిర్వర్తించారన్నారు.


తెలంగాణ సాధన కలను చూసే వరకు విశ్రమించన యోధుడన్నారు. కాక స్ఫూర్తితో కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలన్నారు. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారని, ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారన్నారు.


దేశంలో గాంధీ కుటుంబంలా.. రాష్ట్రంలో కాకా కుటుంబం కాంగ్రెస్ కు అండగా ఉంటుందన్నారు. వివేక్, వినోద్ లను చూసినపుడు నాకు రామాయణంలో లవ కుశులు గుర్తొస్తారన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిదన్నారు. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే ఖచ్చితంగా గమ్యాన్ని చేరొచ్చన్నారు.


విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కు మేం అండగా ఉంటామన్నారు. అంతకుముందు జి. వెంకటస్వామి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌ దగ్గర ఉన్న వారి విగ్రహానికి పీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జీ ఎలుగొండ మధుసూదన్ రెడ్డి ప్రభృతులు నివాళులర్పించారు.