భవిష్యత్ కార్యాచరణకే శ్వేతపత్రం: సీఎం రేవంత్ రెడ్డి

- అందరితో చర్చించే చట్టాలు చేస్తాం
విధాత : రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేత పత్రం ప్రకటన లక్ష్యం వాస్తవాలను ప్రజలకు తెలియచేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ధేశించుకోవడమేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ఎంఐఎం నేత అక్బరుద్ధిన్ ఒవైసీ మాట్లాడిన అనంతరం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ గత పాలకులు తాము బ్రహ్మండంగా చేశామని అవాస్తవాలు ప్రచారం చేసుకుంటున్న నేపధ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియచేసేందుకే శ్వేత పత్రం వెల్లడించామన్నారు. విద్యుత్తు, నీటి పారుదల శాఖ రంగాలపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. శ్వేత పత్రం లక్ష్యం హామీల ఎగవేతకో..లేక గత పాలకులపై నిందలు మోపే లక్ష్యంతో కాదన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రం అప్పులు పెంచి ఆర్బీఐ వద్ధ వరుసగా ఐదేళ్ల నుంచి అప్పులు చేయాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించిందన్నారు. ఉద్యోగులను మోసగాళ్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు. కాగ్ నివేదిక, ఆర్బీఐ, రాష్ట్ర బడ్జెట్ ప్రతుల ఆధారంగా శ్వేతపత్రం విడుదల చేశామన్నారు. శ్వేత పత్రం విడుదల ద్వారా రాష్ట్ర పరపతిని దెబ్బతీయడం లేద రాజకీయ కక్ష సాధింపులకు వంటి దుందుడుకు చర్యలకు పాల్పడదలచుకోలేదన్నారు. సమర్థవంతమైన పాలన కోసమే ప్రోగ్రెస్ రిపోర్ట్‌గా శ్వేత పత్రం విడుదల చేశామని, రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీపడే విధంగా తయారు చేస్తామన్నారు.
ప్రతిపక్షాలు వాస్తవాలను మరుగున పరిచి వితండవాదాన్ని ఎదురుదాడి విధానాలను వదులుకోవాలన్నారు. వారు సహజంగానే అధికారం కోల్పోయిన బాధలో ఉంటారని, అయితే వాళ్ల కుటుంబంలో ఉండే తగాదాలను తీసుకొచ్చి సభలో ప్రస్తావించడం ద్వారా సభను తగ్గించే విధంగా వ్యవహరించవద్దన్నారు. ఇచ్చిన మాటను తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. అందుకే ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చామని, సచివాలయంను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 2015లో మన దగ్గర మిగులు బడ్జెట్ ఉందని, లక్షల కోట్ల అప్పులు తెచ్చి సాధించిన ప్రగతి ఏమిటో ప్రజలకు తెలువాల్సిన అవసరం ఉందన్నారు.
హైద్రాబాద్‌ను అభివృద్ధి చేయడంలో, ప్రపంచ నగరంగా తీర్చిదిద్ధడంలో అందరి సహకారం తీసుకుంటామని, ఇందుకోసం అన్ని పక్షాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు అందరి సహకారం తీసుకుంటామన్నారు. ఎంఐఎం హైద్రాబాద్ అభివృద్ధికి కలిసి రావాలని, రాజకీయాలు వేరు వేరైనా రాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేస్తామన్నారు. మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడుతామన్నారు.అన్ని అంశాలపై సభలో చర్చకు పెట్టి అందరి అభిప్రాయల మేరకు అందరి ఆమోదంతోనే చట్టాలు శాసనాలను రూపొందిస్తామని స్పష్టం చేశారు.