CM Revanth Reddy | మరో మూడు పథకాలకు ఇంద్రవెల్లిలో శ్రీకారం!
హైదరాబాద్: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించడంతోపాటు.. మరో మూడు పథకాలను ప్రారంభించనున్నారు

- లోక్‌సభ ఎన్నికల శంఖారావం ఇక్కడి నుంచే
- రేవంత్‌కు కలిసొస్తున్న గిరిజన ప్రాంతం
CM Revanth Reddy | విధాత, హైదరాబాద్: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి లోక్‌సభ ఎన్నికల శంఖారావం పూరించడంతోపాటు.. ఆరు గ్యారెంటీల్లో మూడు పథకాలకు పచ్చజెండా ఊపనున్నారు. ఏర్పాట్లను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఇంద్రవెల్లిలో మకాం వేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఇక్కడి నుంచే పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
పీసీసీ అధ్యక్షుడి హోదాలో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించి విజయవంతం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ పునర్నిర్మాణ సభను నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని ఆరు గ్యారెంటీల్లో రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి స్వంత జాగా ఉంటే నిర్మించుకునేందుకు రూ.5 లక్షల సాయం, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని తెలుస్తున్నది.
అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్క పథకాన్ని దశలవారీగా ప్రారంభిస్తున్నది. వంద రోజుల్లో అమలు చేస్తామని, ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ప్రతి వేదిక పై ప్రకటిస్తున్నారు. ఆర్థిక వనరులు, లబ్ధిదారుల వివరాలను పక్కగా సేకరించిన తరువాతే పథకాలను అమలు చేస్తున్నారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ సభలో మూడేళ్ల క్రిత ఇచ్చిన హామీ ప్రకారం ఇంద్రవెల్లి అమరవీరుల స్మృతివనం పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.