CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా!

టీపీసీసీ పోస్టుల భర్తీ..కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం !!
ఎంతకాలం నిరీక్షణ అంటున్న ఆశావహులు
అసంతృప్తిని రగిలిస్తున్న అధిష్ణానం తీరు
సొంత పార్టీనే బలహీనం చేస్తున్న హైకమాండ్ తీరు

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. రేవంత్ పర్యటన వాయిదాతో మరోసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌, టీ పీసీసీ పోస్టుల భ‌ర్తీ వ్యవహారం మరింత ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావ‌హులకు మరికొంత కాలం నిరీక్షణ తప్పని పరిస్థితి నెలకొంది. శుక్రవారం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లను శుక్రవారం ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నందునా..ఇప్పటికే తెలంగాణ పీసీసీలో 5 కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ శుక్రవారం నాటి సమావేశంలో కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గం వ్యవహారాన్ని కూడా తేల్చేస్తారని అంతా అంచనా వేశారు. కానీ రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా వాయిదా ప‌డ‌డంతో ఆశావ‌హులు తీవ్ర అసంతృప్తిలో పడిపోయారు. రేవంత్ ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డ‌డంతో అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అసంతృప్తిని రగిలిస్తున్న అధిష్ణానం తీరు

గత ఆది, సోమవారాల్లో సైతం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పటికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ మినహా రాహల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేల అపాయింట్మెంట్ లభించలేదు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన రాహుల్ గాంధీ ఎందుకోగాని రేవంత్ రెడ్డిని మాత్రం కలవలేదు. దీంతో మంత్రి వర్గ విస్తరణ..పీసీసీ కార్యవర్గం కూర్పుపై చర్చించాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నాలు వాయిదా పడ్డాయి. అయితే ఖర్గే స్థానికంగా లేరని..శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డిలు ఇద్దరు ఢిల్లీకి వస్తే అన్ని విషయాలు చర్చిద్దామని ఏఐసీసీ నుంచి సమాచారం అందించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాలేదంటూ రేవంత్ రెడ్డి పర్యటన రద్దవ్వడం చర్చనీయాంశమైంది. . మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ హైదరాబాద్‌లోనే పార్లమెంటు సెగ్మెంట్ కార్యకర్తల సమావేశాల్లో బిజీగా ఉండటం గమనార్హం. తన ఢిల్లీ పర్యటన రద్దవ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉండి ఆర్ఆర్ఆర్‌పై సమీక్ష చేశారు. రేవంత్ ఢిల్లీ పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై నెలాఖరుకు క్లారిటీ వస్తుందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. దీంతో ఆశావహులు మరికొన్నాళ్లు పదవుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వారిలో మరింత అసంతృప్తిని రగిలిస్తుంది. టీపీసీసీకి నూతన చీఫ్‌ నియామకమై ఏడాది కావస్తున్నా కార్యవర్గం ఏర్పాటు చేయకపోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్నా మంత్రి వర్గ విస్తరణ లేకపోవడంతో ఆశావహులు..అసంతృప్తులు రగిలిపోతున్నారు.

 

మూడు రాష్ఱ్రాల పార్టీ వ్యవహారాలకే ఇంత తాత్సర్యమా..?

భారతదేశంలోని 28 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూడు రాష్ట్రాలలో మాత్రమే అధికారంలో ఉంది. కర్ణాటక, తెలంగాణ,హిమాచల్ ప్రదేశ్ లలో ఆ పార్టీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఇందులో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లు పెద్ద రాష్ట్రాలైతే కావు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ కు మాత్రం మూడు రాష్ట్రాలలో పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడమే పెద్ద సవాల్ గా మారినట్లుగా ఉందని..లేకపోతే తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణను, ఏడాదిగా పీసీసీ కార్యవర్గం భర్తీని చేయలేకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. కారణాలేమైనప్పటికి సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత అపాయింట్మెంట్ నెలల తరబడి దొరకకపోవడం కూడా సరైన పద్దతి కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాలలోని ఓ రాష్ట్ర సీఎంకే రాహుల్ గాంధీ అందుబాటులో లేకపోతే ఎట్లా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ గాంధీ, ఖర్గేల అపాయింట్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి పడిగాపులు పడే పరిణామాలు సహజంగానే సొంత పార్టీల్లోని సీనియర్ల ముందే కాకుండా.. ప్రతిపక్షాలలోనూ ఆయనను బలహీనం చేసేదిగా ఉంటుంది. ఇందుకు హైకమాండ్ బాధ్యత వహించాల్సిందే. ఇప్పటికే సీఎం ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లుగా ఢిల్లీ ప్రదక్షిణలు చేస్తున్నాడని..ఢిల్లీ బాస్ ల పార్టీలతో తెలంగాణకు నష్టమని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. మరోవైపు సొంత పార్టీలో తనకంటే సీనియర్లుగా ఉన్న మంత్రులు తనను లెక్కచేయని తత్వం పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే పార్టీలో లుకలుకలతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు దాడికి పదును పెరుగుతుందని..అంతిమంగా పార్టీని హైకమాండ్ వైఖరినే బలహీనం చేసినట్లవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.