SLBC tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ మృతుడి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం
Compensation of Rs. 25 lakhs for SLBC tunnel deceased

SLBC tunnel: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో మృతి చెందిన ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.25లక్షల పరిహారం మంజూరు చేసింది. మృతుడి కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తమ ప్రగాఢ సానూభూతి తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25లక్షల నష్టపరిహారం చెక్కును గురుప్రీత్ సింగ్ పనిచేసిన కంపెనీకి ఎమ్మెల్యే వంశీకృష్ణ అందచేశారు.
అంతకుముందు గురుప్రీత్ సింగ్ మృతదేహానికి నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. గురుప్రీత్ సింగ్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రంలోని తరణ్ జిల్లా చీమకలాన్ గ్రామం. రాబిన్స్ కంపెనీలో టీబీఎం ఎరక్టర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య ఉంది. గురుప్రీత్ సింగ్ సోదరుడు సత్పాల్ సింగ్ 15రోజులుగా టన్నెల్ వద్దనే తన సోదరుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తు గడిపాడు.
కాగా టన్నెల్ లో గల్లంతైన 8మంది మృతదేహాల ఆచూకీపై ఆర్ఐజీపీఆర్ స్కానర్, కడావర్ డాగ్స్ గుర్తించిన డీ1, డీ2, డీ 3ప్రాంతాల్లో త్రవ్వకాలు సాగుతున్నాయి. గత నెల 22న ప్రమాదం జరుగగా ఇప్పటివరకు 17రోజులుగా అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో ఇప్పటిదాక డీ2 ప్రాంతంతో జరిపిన తవ్వాకాల్లో ఒకరి మృతదేహం మాత్రం లభ్యమైంది. మరో ఏడుగురి మృతదేహాలు వెలికితీయాల్సి ఉంది. డీ1, డీ2 ప్రాంతాల్లో ర్యాట్ మైనర్స్ బృందం తవ్వకాలు కొనసాగిస్తుంది.