BJP VS BRS: వరంగల్ కేంద్రంగా గులాబీతో ఢీకొంటున్న కమలం.. రెండు అధికార పార్టీల మధ్య పోటాపోటీ

పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎన్నికల కోసం ఎత్తులు పై ఎత్తులు నిరుద్యోగ మార్చ్‌తో బీజేపీ సవాల్ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కేంద్రంగా గులాబీలతో కమలం ఢీకొంటుంది. వరంగల్ గడ్డ అంటేనే ఏ ఉద్యమానికైనా కేంద్రకంగా ఉంటుంది. విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు కీలక కేంద్రంగా పనిచేసింది. ఇప్పుడు ఇదే వరంగల్ కేంద్రంగా రెండు అధికార పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో […]

BJP VS BRS: వరంగల్ కేంద్రంగా గులాబీతో ఢీకొంటున్న కమలం.. రెండు అధికార పార్టీల మధ్య పోటాపోటీ
  • పరస్పరం తీవ్ర విమర్శలు, ఆరోపణలు
  • ఎన్నికల కోసం ఎత్తులు పై ఎత్తులు
  • నిరుద్యోగ మార్చ్‌తో బీజేపీ సవాల్

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ కేంద్రంగా గులాబీలతో కమలం ఢీకొంటుంది. వరంగల్ గడ్డ అంటేనే ఏ ఉద్యమానికైనా కేంద్రకంగా ఉంటుంది. విప్లవ ప్రజాస్వామిక ఉద్యమాలతో పాటు మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు కీలక కేంద్రంగా పనిచేసింది. ఇప్పుడు ఇదే వరంగల్ కేంద్రంగా రెండు అధికార పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ పోటీపడుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్‌, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు పతాక స్థాయికి చేరగా, గత నెల రోజులుగా ఇరు పార్టీల మధ్య వరంగల్ చుట్టూ రాజకీయ వేడి సెగలు పొగలు కక్కుతుంది.

ఎన్నికల్లో పట్టుకు ఎత్తులు పై ఎత్తులు

ఇదంతా వచ్చే ఎన్నికల్లో పట్టు సంపాదించేందుకు బిజెపి ప్రయత్నిస్తుండగా, జిల్లా మీద బలమైన పట్టు కలిగిన బీఆర్ఎస్ అంత సులభంగా అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో 11 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. మానుకోట, వరంగల్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మెజారిటీ ఆ పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఒక విధంగా వరంగల్ పై బీఆర్ఎస్ ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఈ దశలో బిజెపి వరంగల్ పై పట్టు సాధించాలని సర్వశక్తులు ఒడ్డుతునన్నప్పటికీ బీఆర్ఎస్ ఎలాంటి అవకాశం లభించకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది. దీని ఫలితంగానే రెండు పార్టీల మధ్య పోటాపోటీ విమర్శ సాగుతోంది.

పతాక స్థాయికి చేరిన విమర్శలు

టిఎస్పిఎస్సి ప్రశ్న పత్రాల లీకేజీతో ప్రారంభమైన ఈ వేడి, టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీతో పతాక స్థాయికి చేరింది. హిందీ ప్రశ్న పత్రం లీకేజీలో మొదటి ముద్దాయిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని చేర్చి అరెస్టు చేయడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. పరస్పర రాజకీయ విమర్శలే కాకుండా బండి సంజయ్ వర్సెస్ వరంగల్ సిపిగా కూడా విమర్శలు, ఆరోపణలు కొనసాగాయి.

వరంగల్ నుంచి నిరుద్యోగ మార్చ్‌కు శ్రీకారం

వరంగల్‌లో పరిస్థితి కాక మీద ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాన్ని మొదట వరంగల్ నుంచే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ స్థాయిలో శ్రేణులను తరలించేందుకు బిజెపీ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ విషయంలో ఒక మేరకు సక్సెస్ కూడా అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, బీజేపీ సీనియర్ నాయకులు మార్చ్‌లో పాల్గొన్నారు. తనను అరెస్టు చేసిన ఈ గడ్డమీదనే నిరుద్యోగ మార్చ్ చేపట్టి బిజెపి సత్తా చాటింది అన్నట్లు బండి సంజయ్ మాటల్లో వ్యక్తం అయింది.

ర్యాలీ కార్యక్రమం ప్రకటించిన దగ్గరి నుండి పార్టీ నాయకత్వం వరంగల్‌లోనే మకాం వేసి ర్యాలీ సక్సెస్ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. రెండు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు కండిషన్‌తో కూడిన పర్మిషన్ ఇచ్చారు. ఈ కండిషన్స్ పట్ల కూడా బిజెపి వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార గులాబీ పార్టీకి ఒకరకంగా విపక్షాలకు మరొక రకంగా అనుమతులు మంజూరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేయూ బీఆర్ఎస్ విద్యార్థుల నిరసన

నిరుద్యోగ సమస్యపై బిజెపి శనివారం మార్చ్ చేపట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నిరసనకు దిగింది. దీంతో హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త‌త నెలకొంది. బిజెపి ర్యాలీ మరో రెండు గంటలలో ప్రారంభమవుతున్న సందర్భంలో బి ఆర్ ఎస్ వి నాయకులు చేసిన హల్‌చ‌ల్‌తో పోలీసులు అప్రమత్తమై అరెస్టు చేశారు. మార్చ్ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు యూనివర్సిటీ గేటు వద్ద నిరసన చేపట్టడం పరిస్థితిని ఉప్పూ నిప్పుగా మార్చింది. ఇదిలా ఉండగా బిజెపి ఫ్లెక్సీలను చించి వేయడం పట్ల ఆ పార్టీ వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

బీజేపీ నిరుద్యోగ మార్చ్ కు ప్రతిగా కేంద్రంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు చేయాలని బీఆర్ఎస్వి విద్యార్థులు ఆందోళన చేపట్టడం గమనార్హం. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. బిజెపి చేపట్టిన నిరుద్యోగ మార్చ్‌కి పోటీగా కేంద్రంలో మోడీ ఇచ్చిన హామీ ఏమైంది అని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.