Congress | కాంగి‘రేసు గుర్రాలు’ వీరేనా? కర్ణాటక తరహాలో ముందే అభ్యర్థుల ప్రకటన?

Congress తొలి విడతలో 60 మంది పేర్లతో జాబితా సమాలోచనలలో కాంగ్రెస్‌ అధిష్ఠాన పెద్దలు! ఇప్పటికే సిట్టింగ్‌లకే మళ్లీ చాన్సన్న బీఆర్‌ఎస్‌ పోటీగా 60 పేర్ల ప్రకటనకు కాంగ్రెస్‌ యోచన? ప్రచారం చేసుకునేందుకు అనువుగా ప్రయత్నం! టికెట్‌ ఎవరికో క్షేత్రస్థాయిలో విధాత పరిశీలన కర్ణాటక తరహాలో ముందుగానే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్‌(Congress) అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తున్నది. కనీసం 60 స్థానాలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే క్యాడర్‌లో జోష్‌ వస్తుందని నాయకులు […]

  • Publish Date - April 23, 2023 / 05:50 AM IST

Congress

  • తొలి విడతలో 60 మంది పేర్లతో జాబితా
  • సమాలోచనలలో కాంగ్రెస్‌ అధిష్ఠాన పెద్దలు!
  • ఇప్పటికే సిట్టింగ్‌లకే మళ్లీ చాన్సన్న బీఆర్‌ఎస్‌
  • పోటీగా 60 పేర్ల ప్రకటనకు కాంగ్రెస్‌ యోచన?
  • ప్రచారం చేసుకునేందుకు అనువుగా ప్రయత్నం!
  • టికెట్‌ ఎవరికో క్షేత్రస్థాయిలో విధాత పరిశీలన

కర్ణాటక తరహాలో ముందుగానే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో కాంగ్రెస్‌(Congress) అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తున్నది. కనీసం 60 స్థానాలకు ముందే అభ్యర్థులను ప్రకటిస్తే క్యాడర్‌లో జోష్‌ వస్తుందని నాయకులు భావిస్తున్నారని సమాచారం. జూన్‌ నెలలోనే తొలి జాబితా వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మిగిలిన జాబితాలు విడుదల చేయాలనే ఆలోచన ఉన్నట్టు చెబుతున్నారు. ముందుగానే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను నిర్ణయిస్తే.. వారు ఇప్పటినుంచే ప్రచారం చేసుకునేందుకు వీలుగా ఉంటుందని పలువురు నాయకులు చెబుతున్నారు. తద్వారా పార్టీ యంత్రాంగం మొత్తం ప్రజల్లో ఉండేందుకు అవకాశం కలుగుతుందనే ఉద్దేశం పార్టీ పెద్దల్లో ఉన్నదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో ఉండే ఆ 60 మంది ఎవరనే విషయంలో విధాత నెట్‌వర్క్‌ సర్వే నిర్వహించింది. వివిధ నియోజకవర్గాల్లో ఎవరికి టికెట్‌ వచ్చే అవకాశం ఉన్నదో క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ వర్గాలను ఆరా తీసి, అందిస్తున్న ప్రత్యేక కథనం.

న్యూస్‌ నెట్‌వర్క్, విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం ఉన్నప్పటికీ రాజకీయంగా వేడి మాత్రం వేసవితో పోటీ పడుతున్నది. ఎన్నికల సమయంలో చేసుకునేంత స్థాయిలో విమర్శలు, ప్రతివిమర్శలలో అధికార, ప్రతిపక్ష పార్టీలు తలమునకలై పోయి ఉన్నాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ సిట్టింగ్‌లకే సీట్లని ప్రాథమికంగా ప్రకటించడంతో ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేలు, తమకు టికెట్‌ గ్యారెంటీగా వస్తుందనే నమ్మకంతో ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జిలు ప్రచారం రేంజ్‌లో ప్రజల్లో తిరుగుతున్నారు. ఆత్మీయ సమ్మేళ్లనాల పేరుతో అందరినీ కలుస్తున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్‌(Congress) కూడా ప్రజలకు చేరువయ్యేందుకు తన ప్రయత్నాల్లో తాను ఉన్నది. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక తరహాలో జూన్‌ నెలలో 60 మంది అభ్యర్థులను ముందుగా ప్రకటిస్తుందన్న చర్చ నడుస్తున్నది. అయితే.. కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఆఖరి నిమిషం మార్పులు ఉండే అవకాశం ఉన్నదని స్థానిక నేతలు చెబుతున్నారు. ఉదాహరణకు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు వంటివారు తీసుకోబోయే నిర్ణయాల ఆధారంగా ఈ జాబితాలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని విధాతతో మాట్లాడిన ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు చెప్పారు.

అధికారం కోసం కాంగ్రెస్‌ తహతహ

కాంగ్రెస్(Congress) పార్టీ ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకోవాలని తహతహ లాడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందుగా పాదయాత్ర చేపట్టగా, తాజాగా సీఎల్‌పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. ఇది ప్రజల్లో మంచి స్పందనే కలిగించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

ఇదే సమయంలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటన ప్రతిపక్షాలకు అందివచ్చింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ సమస్యలపై దీక్షలు చేయాలని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఒక వైపు ఉద్యమాలు చేపడుతూనే.. మరోవైపు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తులను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లోకి?

బీఆర్‌ఎస్‌ నుంచి బహిష్కరణకు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను తమ వైపుకు తిప్పుకొనే ప్రయత్నాల్లో కాంగ్రెస్‌(Congress) నేతలు ఉన్నట్టు తెలుస్తున్నది. వీరి చేరికకు గట్టిగా రాయబారాలు జరుగుతున్నట్టు సమాచారం. వారిద్దరు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు దాదాపు సిద్ధ పడ్డారన్న వార్తలు వస్తున్నాయి. మే 5వ తేదీన వీరిద్దరూ కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం.

కానీ.. పొంగులేటి, జూపల్లి కానీ, కాంగ్రెస్‌ పెద్దలు కానీ ఈ విషయంలో నోరు మెదపడం లేదు. అయితే.. రాహుల్‌గాంధీ నేరుగా పొంగులేటితో మాట్లాడారని ఆయనతో సన్నిహితంగా మెలిగే నేత ఒకరు వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరితే వారికి, వారి అనుచరులకు తప్పకుండా టికెట్లు ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది.

ముందస్తు అభ్యర్థుల ప్రకటనలోనూ ఇబ్బందులు

ముందుగా కొందరు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలన్న ఆలోచనలో కాంగ్రెస్‌(Congress) ఉన్నదని చెబుతున్నా.. అందులోనూ ఇబ్బందులు తప్పేట్టు లేవని అంటున్నారు. చాలా చోట్ల ఒకరికంటే ఎక్కువ మంది టికెట్‌ను ఆశిస్తున్నారు. ఉదాహరణకు సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఈ ఎన్నికల్లో తనతో పాటు కొడుకు రఘువీరారెడ్డికి కూడా టికెట్‌ ఆశిస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో మిర్యాలగూడ టికెట్‌కు పట్టుబడుతున్నారని తెలుస్తున్నది.

ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) టికెట్‌ ఆశిస్తూ విస్తృతంగా ప్రజల్లో తిరుగుతున్నారు. స్థానికంగా అతనికే బలం ఉన్నదని చెబుతుంటారు. అయితే కుటుంబానికి ఒక్కటే టికెట్‌ అంటే తండ్రి కొడుకులలో ఒక్కరికే ఇస్తే మిర్యాలగూడ బీఎల్‌ఆర్‌కే ఖాయం అయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలా కాకుండా జానారెడ్డి ఒత్తిళ్లకు తలొగ్గి, గతంలో మాదిరిగా ఎవరికో ఒకరికి ఇస్తే ఈ సీటును కాంగ్రెస్‌ కోల్పోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.

ఖమ్మం సీన్‌ మార్చనున్న పొంగులేటి?

ఖమ్మం జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌(Congress) పార్టీలో చేరితే ఉమ్మడి ఖమ్మంతోపాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో రాజకీయ బలాబలాలు మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ కూడా ఆయన సూచించిన అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరితే కొల్లాపూర్‌ టికెట్‌ ఆయనకే ఇస్తారన్న చర్చ జరుగుతున్నది. పలుచోట్ల ఒకరి కంటే ఎక్కువగా అభ్యర్థులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఆయా అభ్యర్థుల విషయంలో అంతర్గతంగా సర్వే చేయించి, మెజార్టీ ప్రజాభిప్రాయం మేరకు అభ్యర్థిత్వాలను అధిష్ఠానం ఖరారు చేస్తుందని చెబుతున్నారు.

ఒకరికంటే ఎక్కువ ఆశావహులు..

కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది టికెట్‌ ఆశిస్తున్నారు. నిజామాబాద్ (రూరల్) స్థానంపై భూపతి రెడ్డి/ కాటిపల్లి నగేష్ రెడ్డిలో ఒకరికి టికెట్‌ దక్కొచ్చని చెబుతున్నారు. బోధన్‌లో సుదర్శన్ రెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి రేసులో ఉంటారని సమాచారం.

ఎల్లారెడ్డిలో మదన్ మోహన్ రావు, లేదా సుభాష్ రెడ్డి టికెట్‌ దక్కించుకుంటారని చెబుతున్నారు. బాన్సువాడలో ముగ్గురు ఆశావహులు కనిపిస్తున్నారు. కాసుల బాలరాజు, మాసాని శ్రీనివాస్ రెడ్డి, సంగెం శ్రీనివాస్ గౌడ్ లలో ఒకరికి టికెట్‌ దక్కే అవకాశం ఉన్నదని అంటున్నారు. జుక్కల్‌లో సౌదాగర్ గంగారం, లేదా తోట లక్ష్మీకాంత రావుకు టికెట్‌ ఇస్తారని అనుకుంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సైతం మార్పులు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరితే పరిస్థితులు మారిపోతాయి. ఆ నేపథ్యంలో పినపాక నుంచి సీతక్క కుమారుడు కానీ, పొంగులేటి అనుచరుడు కానీ టికెట్‌ పొందే అవకాశాలు ఉన్నాయని చర్చించు కుంటున్నారు.

అశ్వారావు పేట నుంచి జార భిక్షం(పొంగులేటి అనుచరుడు), తాటి వెంకటేశ్వర్లు మధ్య టికెట్‌ రేసు ఉంటుందని సమాచారం. సత్తుపల్లి మట్టు దయానందర్‌కు టికెట్‌ దక్కుతుందని చెబుతున్నా.. పిడమర్తి రవి కాంగ్రెస్‌లో చేరితే పరిణామాలు వేరుగాఉంటాయని భావిస్తున్నారు. పిడమర్తిని కంటోన్మెంట్‌లో పోటీ చేయిస్తే దయానంద్‌కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

మెదక్ నుంచి కంటా రెడ్డి తిరుపతి రెడ్డి, లేదా మాజీమంత్రి దామోదర్ సతీమణి పద్మిని రెడ్డికి టికెట్‌ ఇస్తారని తెలుస్తున్నది. పటాన్ చెరువులో కాటసాని శ్రీనివాస్ గౌడ్, గాలి అనిల్ కుమార్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. వనపర్తిలో చిన్నారెడ్డి లేదా శివసేన రెడ్డి టికెట్‌ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్‌లో చేరితే ఆయనకే టికెట్‌ ఇస్తారని, ఈ మేరకు మాజీ మంత్రి చిన్నారెడ్డి కూడా ఆమోదం తెలిపారన్న చర్చ జిల్లా రాజకీయ వర్గాలో జరుగుతున్నది.

ఇక మహబూబ్‌నగర్‌ నుంచి ఒబేదుల్లా కోత్వాల్ లేదా సంజీవ్ ముదిరాజ్‌లలో ఒకరికి టికెట్‌ దక్కే చాన్స్‌ ఉన్నదని చెబుతున్నారు. సూర్యాపేటను రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్‌ రమేశ్‌రెడ్డి ఆశిస్తున్నారు. నకిరేకల్ అభ్యర్థి ఎంపిక ఇబ్బందికరంగానే కనిపిస్తున్నది. ఇక్కడ కొండేటి మల్లయ్య, దైద రవీందర్, వేదాసు వెంకయ్య టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే.. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్‌ పార్టీలోకి వెళితే అతనికే టికెట్‌ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తున్నది.

తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, గుడిపాటి నరసయ్య, అన్నేపర్తి జ్ఞాన సుందర్, నాగరి గారి ప్రీతం రేసులో ఉన్నారని చర్చించుకుంటున్నారు. మునుగోడు లో పాల్వాయి స్రవంతి, చిల్లమల్ల కృష్ణారెడ్డి టికెట్ ఆశిస్తున్నారని సమాచారం.

దేవరకొండకు కూడా పోటీ ఎక్కువే ఉన్నది. ఇక్కడ నేనావత్ బాలునాయక్, బిల్యా నాయక్, రవి నాయక్, కిషన్ నాయక్, జగన్ నాయక్ లలో ఒకరు టికెట్‌ దక్కించుకునే అవకాశం కనిపిస్తున్నది. ఆసిఫాబాద్లో జాదవ్‌, పరుచుకోల సరస్వతి పోటీ పడుతున్నారు.

బెల్లం పల్లిని గడ్డం వినోద్‌, మాజీ మంత్రి వినోద్‌ ఆశిస్తున్నారు. బెల్లంపల్లి దక్కకుంటే చెన్నూర్‌ను వినోద్‌ కోరుకుంటున్నారని సమాచారం. అదిలాబాద్‌ గండ్రసుజాత/ సుజిత్‌ ఖాన్‌ మధ్య పోటీ ఉన్నదని చెబుతున్నారు. నిర్మల్‌లో ఇటీవల బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన పత్తి రాజేశ్వర్‌రెడ్డికి ఇస్తారా? అనే చర్చ ఉన్నది.

ఖానాపూర్‌ లో ఒడ్డమ బొజ్జు, చారులత రాథోడ్‌ టికెట్‌ రేసులో ఉన్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నదనే చర్చ జరుగుతున్నది.