Congress | దశాబ్ది పేరుతో కేసిఆర్ దగా.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దగ్దం
Congress అడ్డుకున్న పోలీసులు హనుమకొండలో వంటావార్పు ములుగులో రాస్తారోకో విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టడాన్ని నిరసిస్తూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సెంటర్లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వంటా వార్పూ కార్యక్రమం నిర్వహించారు. పదితలల కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయగా […]

Congress
- అడ్డుకున్న పోలీసులు
- హనుమకొండలో వంటావార్పు
- ములుగులో రాస్తారోకో
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమం చేపట్టడాన్ని నిరసిస్తూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో దశాబ్ది దగా పేరుతో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సెంటర్లో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా వంటా వార్పూ కార్యక్రమం నిర్వహించారు. పదితలల కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మహిళల బోనాలతో ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లి హన్మకొండ RDOకు వినతిపత్రం సమర్పించారు.
హామీలన్నీ చెత్తబుట్టలో వేసిన కేసీఆర్
బిఆర్ఎస్ పాలనలో కేసిఆర్ చెప్పిన మాటలు చెత్తబుట్టలో పడేశారని, నీళ్ళు, నిధులు, నియామకాలు పక్కకు పోయాయని టిపిసిసి ఉపాధ్యక్షురాలు బి.శోభారాణి మాట్లాడుతూ విమర్శించారు.
పునర్నిర్మాణం అంటే దొరల గడీలు పునర్నిర్మాణం అవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఏమి ఉపయోగం జరగలేదు. ధరణి వెబ్ సైట్ తో పేదల ప్రజల భూములను కొల్లగొడుతున్నారని విమర్శించారు.
దశాబ్ది ఉత్సవాల పేరుతో దగా: నాయిని రాజేందర్ రెడ్డి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు. కేసిఆర్ హామీలను అటకెక్కించాడన్నారు.
సి.ఎం. కే.సి.ఆర్ కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య, ఫీజ్ రీయంబర్స్ మెంట్, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు, రైతు రుణ మాఫీ, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, 12 శాతం గిరిజన రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన పది హామీలల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన: ప్రొఫెసర్ వెంకట్ నారాయణ
ఆత్మగౌరవం, స్వాభిమానం, స్వయం పాలన కోసం సాధించుకున్న తెలంగాణలో రాచరికం, నియంత పాలనా సాగుతుందని ప్రొఫెసర్ వెంకట్ నారాయణ విమర్శించారు. ఉద్యమం ఉదృత సమయంలో కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కుటుంబ పార్టీగా మార్చిండన్నారు.
భూపతి కృష్ణమూర్తి, ఆచార్య జయశంకర్, కేశవ్ రావ్ జాదవ్, కేసిఆర్ కు గుర్తు రాలేదన్నారు. తెలంగాణ ద్రోహులు మంత్రులు అయ్యారు. తెలంగాణలో కే.సి.ఆర్, కేసిఆర్ కుటుంబం, మంత్రులు, MLA లు బాగుపడ్డారన్నారు. కేసిఆర్ ఆయన కటుంబ సభ్యులు వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు.
నియంతృత్వ పాలన: ప్రొఫెసర్ పాపిరెడ్డి
రాష్ట్రంలో నియంతృత్వ పాలనా సాగుతోందని ప్రొఫెసర్ పాపి రెడ్డి విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు బిఆర్ఎస్ పార్టీ ఒక వ్యక్తిగత రాజకీయ పార్టీగా అన్నారు. బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వెంట తెలంగాణ వాదులందరూ కలిసి పోరాడాలన్నారు.
కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు విజయ్ ఖన్న, దేవోజి నాయక్, అలువల కార్తిక్, వేముల రమేష్, కాంగ్రెస్ నాయకులు ఇనగాల వెంకట్రాం రెడ్డి, అశోక్ రావు, బత్తిని శ్రీనివాస్ రావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండలో దిష్టిబొమ్మ దగ్ధం
హనుమకొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఎమ్మార్వో కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు జంగా రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ములుగులో రాస్తారోకో అరెస్టు
దశాబ్ది ఉత్సవాలను నిరసిస్తూ ములుగు జాతీయ రహదారి పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూం ఇస్తాడని వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్న ప్రజలకు దశాబ్ది కాలములో నిరాశే మిగిలిందని అన్నారు. పోడు భూములకు పట్టాలిస్తానని చెప్పి దశాబ్ది కాలం అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్ తదితరులు పాల్గొన్నారు.