Congress | పీపుల్స్ మార్చ్ తో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్

Congress తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా భట్టి చేరికలకు ఊపు తెచ్చిన పాదయాత్ర విధాత: బిఆర్ఎస్ కు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కరువైన నిస్తేజంతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మలుపు తిప్పారు. కేసీఆర్ ను కొట్టేదెవరూ?.. ఎదురు నిలిచేదెవరన్న రాజకీయ డైలమాకు తెరవేస్తు నేనున్నానంటూ భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు కేంద్ర బిందువుగా మారాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పీపుల్స్ […]

Congress | పీపుల్స్ మార్చ్ తో పెరిగిన కాంగ్రెస్ గ్రాఫ్

Congress

  • తెలంగాణ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా భట్టి
  • చేరికలకు ఊపు తెచ్చిన పాదయాత్ర

విధాత: బిఆర్ఎస్ కు బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం కరువైన నిస్తేజంతో సాగుతున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మలుపు తిప్పారు. కేసీఆర్ ను కొట్టేదెవరూ?.. ఎదురు నిలిచేదెవరన్న రాజకీయ డైలమాకు తెరవేస్తు నేనున్నానంటూ భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు కేంద్ర బిందువుగా మారాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతున్న కొద్దీ పెరుగుతున్న ప్రజాదరణతో రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచడంతో పాటు గేమ్ చేంజర్ గా భట్టి నిలబడ్డారు.

తెలంగాణలో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భట్టి పాదయాత్ర భరతవాక్యం పలికినట్లు అయింది. కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటినుంచే… హస్తం పార్టీ ఇంకా బలంగా ఉందనిపించడమే గాక బిఆర్ఎస్ కు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ను నిలపడంలో సఫలీకృతుడయ్యారు.

చీలికలు పేలికలుగా మారి అంతర్గత కలహాలతో బలహీనమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ కు భట్టి తన పాదయాత్రతో కొత్త జవసత్వాలను అందించగలిగారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు జనంలో వస్తున్న స్పందనతో కాంగ్రెస్ కు రానున్న ఎన్నికల్లో అధికారం సాధ్యమేనన్న నమ్మకం బలపడింది.

దీంతో ఇతర పార్టీల నుండి చేరికల ప్రక్రియ లో కదలిక రావడంతో పాటు సొంత పార్టీలో సీనియర్లు, జూనియర్లు అంతా ఐక్యతారాగం వినిపించడానికి భట్టి పాదయాత్ర బాటలు వేసింది. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు ఇతర పార్టీల నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు.

కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే… ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత.. కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యాడు. భట్టి పాదయాత్రతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికల సునామీ ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

కారు పార్టీలో సీట్లు దొరకని నేతలు, ఇతర పార్టీల్లో అసంతృప్త నాయకులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక తిరుగులేని అవకాశంగా కనిపిస్తోంది. భట్టి పాదయాత్రతో హస్తం పార్టీ అధికారంలోకి వస్తోందనే విశ్లేషకుల అభిప్రాయాలు కూడా ఇందుకు తోడయ్యాయని చెప్పవచ్చు.

కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులకు కాంగ్రెస్ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా భట్టి పాదయాత్ర నమ్మకాన్ని కలిగించింది.
భట్టి విక్రమార్క ఎఫెక్ట్ తో ఇప్పటికే కారు దిగి.. కమలంవైపు చూస్తున్న జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు సైతం కాంగ్రెస్ లో చేరాలన్న క్లారిటీకి వచ్చేశారు.

వీరే కాకుండా నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరిద్దరు బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా అధికార బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరుతారన్న టాక్‌ గట్టిగా వినిపిస్తోంది.

ఇప్పటి వరకూ కాంగ్రెస్ కు దూరంగా ఉన్న మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వంటి నేత కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఇప్పుడు పార్టిలో మళ్లీ యాక్టివ్ అయ్యారు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీనే బెటర్‌ అని, తిరిగి కాంగ్రెస్ లో యాక్టివ్ గా మారారు.

గతంలో విభిన్న కారణాలతో పార్టీని వీడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ మధ్యనే బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా మళ్లీ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమవుతున్నారన్న ప్రచారం వినిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న మాట నిజమైనప్పటికి భట్టి విక్రమార్క పాదయాత్రతో తెలంగాణ రాజకీయ సమీకరణాలు సమూలంగా మారిపోయాయి.

కాంగ్రెస్ అంటే.. ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్ కలిగిన పార్టీగా మారిందని ఆయా నేతలే చెబుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, భట్టి పాదయాత్ర నేపధ్యంలో కాంగ్రెస్ బలోపేతమైందంటూ ఈటెల, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ లాంటి వారు కూడా అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్న తీరు ఆసక్తికరం.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర కు ముందు.. వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ మంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

రాష్ట్ర ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి ఇద్దరూ సీఎల్పీ నేత బస వద్దకే వెళ్లి.. ఆయనతో పాటు చెట్టుకింద కూర్చుని సుమారు రెండున్నర గంటలపాటు.. చేరికలపై ఆయనతో చర్చించడమే ఇందుకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు.

పాదయాత్ర సభల్లో భట్టి కాంగ్రెస్ గత పథకాలు..ప్రస్తుత కెసిఆర్ ప్రభుత్వ పథకాలను పోల్చుతూ పేదలు, బడుగు బలహీన వర్గాలకు, దళిత గిరిజన వర్గాలకు కాంగ్రెస్ తోనే మేలు జరిగిందంటు జనాన్ని ఆలోచనలో పడేస్తున్నారు. కేసీఆర్ కుటుంబ పాలన, ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని, బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిని ప్రజల్లో ఎండ గట్టడంలో భట్టి తన పాదయాత్రను సద్వినియోగం చేసుకోవడం కూడా పాదయాత్రకు క్రేజ్ తెచ్చిపెట్టింది.

ఏదేమైనా పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక గేమ్ చేంజర్ గా, ట్రెండ్ సెట్టర్ గా నిలిచిపోయారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.