Congress
ప్రతి కీలక పరిణామానికి ముందు కొన్ని సంకేతాలు ఉంటాయి. అవి చిన్నవే కావచ్చు. కానీ.. వాటి ప్రభావం మాత్రం చిన్నగా ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో అటువంటివే రాజకీయ పునఃసమీకరణాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు వంటి కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా.. మరోవైపు ఆయా జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో కీలకమైన కదలికలు కనిపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. పెద్ద మందాడి ఎంపీపీ మేఘారెడ్డి సైతం కాంగ్రెస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. ఇప్పటికే ఒక వివాహ వేడుక సందర్భంగా పొంగులేటితో వేముల వీరేశం చర్చలు జరపడం రాజకీయంగా కాక రేపింది. రాజకీయ పునరేకీకరణల్లో రాబోయే మార్పులకు ఇవి సంకేతాలని విశ్లేషకులు అంటున్నారు.
(విధాత నెట్‌వర్క్)
రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయా? నానాటికీ ప్రజల్లో పుంజుకుంటున్న కాంగ్రెస్‌వైపు వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలు దృష్టిసారిస్తున్నారా? బీఆర్‌ఎస్‌లో ఇమడలేని అసంతృప్త నేతలు.. కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నద్ధమవుతున్నారా? తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానాలే వస్తున్నాయి. నిజానికి కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడానికి బీఆర్‌ఎస్ నాయకత్వం చాలా శ్రమించింది.
అనేక మందిని గులాబీ నీడకు లాగింది. కాంగ్రెస్ ఎల్పీ, టీడీపీ ఎల్పీని సైతం బీఆర్‌ఎస్ ఎల్పీలో విలీనం చేసి.. బంగారు తెలంగాణ కోసం రాజకీయ శక్తుల పునరేకీకరణ అంటూ సమర్థించుకున్నది. ఆ దెబ్బ కాంగ్రెస్ మీద గట్టిగానే పడినప్పటికీ.. ‘బంతిని గట్టిగా నేలకేసి కొడితే.. అంతకంటే వేగంగా అందనంత ఎత్తుకు ఎగురుతుందన్నట్లు’.. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా అంతే వేగంగా పెరిగింది.
నేతల మధ్య సఖ్యత కావచ్చు, వివిధ సమస్యలపై ఆ పార్టీ తీసుకున్న కార్యాచరణలు కావచ్చు.. బీఆర్‌ఎస్‌పై పెరుగుతున్న అసంతృప్తి కావచ్చు.. ఏదైనా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల సానుకూల పవనాలు వీచడం అనేది మొదలైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్‌కే ఉన్నదన్న అభిప్రాయమూ బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే బీఆర్‌ఎస్‌లో అధినేత వైఖరిపై విసుగెత్తి, వేరే దారి చూసుకుంటున్న వారికి కాంగ్రెస్ గమ్యస్థానంగా కనిపిస్తున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రెండో దఫాలో ఓటమి పాలైన కొందరు బీఆర్ఎస్ నేతలకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కలేదన్న వాదనలు ఉన్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితర నేతలు ఆ కోవలోకి చెందినవారే. మరోవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఓడిన స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ నేతలను అభ్యర్థులు బీఆర్‌ఎస్‌లో చేరారు.
దీంతో అప్పటిదాకా నియోజకవర్గంపై పట్టు ఉన్న నేతలకు పార్టీలో తగిన స్థానం లేకుండా పోయిందని ఆ పార్టీకి చెందిన ఒక అసంతృప్త నేత చెప్పారు. నిర్లక్ష్యానికి గురైన సదరు నాయకులు పార్టీకి దూరమయ్యేందుకు కారణమవుతున్నదని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని తెలుస్తున్నది. ఆయన కొంత కాలంగా కాంగ్రెస్ పెద్దలతోనూ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనూ టచ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. తాజాగా.. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఎమ్మెల్సీ పదవిని వదులుకొని వస్తే మంచిదని రవి చేసిన సూచనకు కూడా ఆయన అంగీకరించినట్లు తెలిసింది.
వనపర్తి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, పెద్దమందాడి ఎంపీపీ మేఘారెడ్డి కూడా ఇటీవల బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆమె కూడా మల్లు రవిని శనివారం కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలియజేసినట్లు సమాచారం.
నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గత కొంత కాలంగా బీఆర్‌ఎస్ అధినేత తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వివాహ కార్యక్రమంలో పొంగులేటితో కలిసి మాట్లాడినట్లు సమాచారం. వీరేశం కూడా కాంగ్రెస్‌లో చేరుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరబోతున్నారని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ను వదిలి వెళ్లినవారు కూడా తిరిగి పార్టీలోకి వస్తారన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పొంగులేటి, జూపల్లి ఆదివారం హైదరాబాద్‌లో వెంకట్‌రెడ్డితో ఆయన నివాసంలో సమావేశమయ్యారు.
ఈ భేటీలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీ శ్రీధర్‌బాబు కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో జూపల్లి, పొంగులేటి చేరికపై ఈ సందర్భంగా వారంతా చర్చించినట్లు సమాచారం. భేటీ అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పొంగులేటి, జూపల్లితోపాటు.. గతంలో కాంగ్రెస్‌ను వదిలి వెళ్లినవారం అందరూ తిరిగి వస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు.
వారందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన కోరారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమన్నారు. భేటీ వివరాలను జూపల్లి, పొంగులేటి మీడియాకు బహిర్గతం చేయలేదు.
ఇప్పటికే నిర్మల్ జిల్లాలో జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి నెల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. నిర్మల్ నియోజకవర్గం జనరల్ సీటు కావడంతో కాంగ్రెస్ నుంచి అవకాశం దక్కుతుందనే ఆలోచనలో ఆయన పార్టీ మారినట్టు ప్రచారం జరుగుతున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్‌ఎస్‌లో అసంతృప్త నాయకులు చాలామంది ఉన్నారనే ప్రచారం ఉన్నది. ఇతర పదవుల్లో ఉన్నప్పటికీ, తమ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరుపై అసహనంతో ఉన్నారని అంటున్నారు. వీరంతా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు కావడం గమనార్హం.
భూపాల్‌పల్లిలో ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి.. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అసంతృప్తితో ఉన్నారనే చర్చ నడుస్తున్నది. స్టేషన్ ఘన్‌పూర్‌లో సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య పొసగడం లేదని అంటున్నారు. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఎమ్మెల్సీ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసంతృప్తితో ఉన్నారని సమాచారం.
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌పై మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, పార్టీ నాయకుడు రాజనాల శ్రీహరి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. డోర్నకల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.
మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ మాలోత్ కవిత మధ్య కూడా సఖ్యత లేదని సమాచారం. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో రైతు రుణ విమోచన సమితి చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు ఎడముఖం పెడముఖం ఉన్నట్టు వ్యహరిస్తున్నారని అంటున్నారు. అయితే.. వీరంతా కీలక నేతలు కావడంతో పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోయినా ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్న పిల్లి రామరాజు వచ్చే ఎన్నికలలో సొంతగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు నియోజకవర్గంలో ఆయన కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికే ఇదే నియోజకర్గస్థాయి నేత చకిలం అనిల్‌కుమార్ బీఆర్‌ఎస్‌ను వీడి పొంగులేటి వెంట నిలిచారు.
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వ్యతిరేకంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం రానున్న ఎన్నికల్లో ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ రాకపోతే వేరే పార్టీ నుండైనా పోటికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తున్నది. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు పోటీగా సీనియర్ నేత కన్నమంతరెడ్డి శశిధర్ రెడ్డి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ లభించకుంటే మరో పార్టీలో వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు పోటీగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దేవరకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై అసమ్మతి బాటన గుత్తా సుఖేందర్ రెడ్డి వర్గీయులు సాగుతున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. మునుగోడు నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా.. రాబోయే ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గౌడ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు.