టికెట్.. నాదంటే నాదే..!

మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు టికెట్ నాదంటే నాదే అని ప్రకటించుకుంటున్నారు

టికెట్.. నాదంటే నాదే..!
  • పాలమూరు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్ నేతల పోటా పోటీ
  • టికెట్ కోసం ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు
  • జనరల్ స్థానం కావడంతో పోటీ తీవ్రం
  • టికెట్ వస్తుందనే నమ్మకంతో సెగ్మెంట్‌లో వంశీచంద్ పాదయాత్ర
  • బీసీలకు ఇవ్వాలని రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్
  • బీజేపీ లో కూడా బీసీ నినాదం
  • బీఆరెస్‌ టికెట్ కోసం ఆసక్తి చూపని నేతలు
  • ఎన్నికలు సమీపస్తున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు టికెట్ నాదంటే నాదే అని ప్రకటించుకుంటున్నారు. జనరల్ స్థానంలో కావడంతో పోటీ చేసేందుకు నేతలు ఉత్సహం చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా ఏడుగురు నేతలు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. సీడబ్ల్యుసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తనయుడు ఆదిత్య రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి, పాలమూరుకు చెందిన లాయర్ వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ రాష్ట్ర యువజన నేత శివశంకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారు. ఎంపీగా పోటీచేసేందుకే కల్వకుర్తి అసెంబ్లీ స్థానంలో పోటీ నుంచి విరమించుకున్నానని, అందుకే పాలమూరు ఎంపీ టికెట్ తనకే ఇవ్వాలని వంశీచంద్ రెడ్డి అధిష్టానం ఎదుట ప్రస్తావించినట్లుగా తెలిసింది. అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అందుకే ఈ ఎంపీ సెగ్మెంట్ లో ఆయన న్యాయ యాత్ర పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర ఈ సెగ్మెంట్ లోని ఏడు నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మక్తల్ నియోజకవర్గంలో పూర్తయి నారాయణ పేట నియోజకవర్గంలో అడుగు పెట్టింది. ఈ పాదయాత్రలో శనివారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా నియోజకవర్గం లోని ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానని ప్రజలకు వంశీ హామీ ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ సెగ్మెంట్ టికెట్ వంశీ కన్ఫర్మ్ అయినట్లు ఆ పార్టీ నేతలు అనుకుంటున్నారు. పాదయాత్ర లో టికెట్ గురించి వంశీచంద్ ఎక్కడా ప్రస్థావించలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల సమయంలో చేస్తున్న పాదయాత్ర కు రాజకీయ రంగు వచ్చింది. ఈ స్థానంలో పోటీ చేసేందుకే వంశీ పాదయాత్ర చేపడుతున్నారని, లేకుంటే ఈ ప్రాంతం వైపు కన్నెత్తి చూసేవారు కాదని వంశీ పై ఇతర పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

జోరందుకున్న బీసీ నినాదం

ఇదిలా ఉంటే పాలమూరు ఎంపీ స్థానంలో బీసీలకు టికెట్ ఇవ్వాలనే నినాదం జోరందుకుంది. ఈ సెగ్మెంట్ లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదుగురు రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, అందుకే ఎంపీ టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బీసీ అభ్యర్థులుగా కాంగ్రెస్ నుంచి ఎన్పి వెంకటేష్, సంజీవ్ ముదిరాజ్ దరఖాస్తు చేసుకున్నారు. వీరు పాలమూరు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేసి అధిష్టానం సూచన మేరకు కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా నిలిచారు. పార్టీ కోసం కష్ట పడిన తమకు టికెట్ ఇవ్వాలని వారు అధిష్టానంను కోరుతున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల ఓట్ల శాతం అధికంగా ఉందని, ఇది దృష్టిలో పెట్టుకుని ఈ స్థానంలో బీసీ అభ్యర్థిని పోటీలో నిలపాలనే డిమాండ్ వస్తోంది. ఇదే స్థానంలో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే సీతాదయాకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీలో ఉన్న ఆమె ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరి దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. తనకు ఎంపీ స్థానం నుంచి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానంను కోరుతున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే చిన్నా రెడ్డి తనయుడు ఆదిత్య రెడ్డి కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన కుమారునికి టికెట్ ఇవ్వాలని చిన్నా రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశానని అందుకే ఎంపీ స్థానంలో తన కుమారుణ్ణి పోటీలో ఉంచాలని రాష్ట్ర కాంగ్రెస్ ముందు తన అభిప్రాయం ఉంచారు. ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఫార్మా సంస్థ కు చెందిన మన్నే జీవన్ రెడ్డి కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జీవన్ రెడ్డి ప్రస్తుత బీఆరెస్‌ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు. జీవన్ రెడ్డి గతంలో టీటీడీ దేవస్థానం సభ్యుని గా కొనసాగారు. ప్రస్తుతం పదవి కాలం పూర్తి కావడంతో ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇదివరకే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈయన కూడా పాలమూరు ఎంపీ స్థానంలో పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ యువజన నేత శివశంకర్ రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసేకున్నారు. ఆయన కూడా టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్‌లో ఎంపీ స్థానంలో పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధిష్టానం ఆచి తూచి అడుగులు వేస్తోంది. వీరందరిని పిలిపించి నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది.

బీజేపీ లో టికెట్ లొల్లి

పాలమూరు పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు బీజేపీ నేతల మధ్య పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఇక్కడ కూడా బీసీ నినాదం తెర పైకి వచ్చింది. ఇంతకాలం అగ్రవర్ణ నేతలకు బీజేపీ టికెట్ ఇచ్చిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థానంలో నుంచి బీసీ అభ్యర్థి కి టికెట్ ఇవ్వాలని డిమాండ్ వచ్చింది. ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షులుగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని, ఎంపీ స్థానంలో బీసీలకు ఇవ్వాలని ఆ వర్గం నేతలు బీజేపీ అధిష్టానాన్ని కోరుతున్నారు. బీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ కు టికెట్ ఇవ్వాలనే ప్రత్తిపాదన ప్రస్తుతం తెర పైకి వచ్చింది. ఆయన కూడా తనకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి పాలమూరు బీజేపీకి సేవాలందించానని, గత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోరితే అధిష్టానం సముదాయించి పార్టీ అభ్యర్థి కి మద్దతుగా ఉండాలని కోరిందని, పార్టీ సూచన మేరకు టికెట్ త్యాగం చేసి పార్టీ కోసం పనిచేసానని శాంతి కుమార్ అంటున్నారు. ఈ సారి టికెట్ తనకే ఇవ్వాలని అధిష్టానం ఎదుట ప్రత్తిపాదన పెట్టారు. మరో సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుణ్ణి పాలమూరు నియోజకవర్గం నుంచి పోటీ లో ఉంచానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరో సీనియర్ నాయకురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షరాలు డీకే అరుణ కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎక్కడ టికెట్ ప్రస్తావన లేకుండా పాలమూరులో జరుగుతున్న పార్టీ ప్రతి కార్యక్రమానికి హాజరువుతున్నారు. అటు టి. ఆచారి కూడా ఎంపీ టికెట్ కోరుతున్నారు.

బీఆరెస్‌ నేతల్లో కనపడని ఆసక్తి

పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉరుకులు, పరుగులు పెడుతుంటే బీఆరెస్‌లో మాత్రం ఎలాంటి ఉలుకు, పలుకు లేదు. ఈ పార్టీ నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మా రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ స్థానంలో పోటీ చేయాలని భావించినా ప్రస్తుతం వెనుకడుగు వేస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తే ఓటమి తప్పదనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆరెస్‌ సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి కూడా మళ్ళీ పోటీ చేసేందుకు ఇష్టం లేనట్లు సమాచారం. ఎందుకంటే ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే ఉండడమే కారణం. ఇది దృష్టిలో పెట్టుకున్న బీఆరెస్‌ నేతలు ముందు జాగ్రత్త గా పోటీలో ఉండక పోవడమే మంచిదనే ధోరణిలో ఉన్నారు.