ఏటా లక్ష నగదు.. ఉద్యోగాల్లో 50 % రిజర్వేషన్లు.. మహిళలకు కాంగ్రెస్‌ గ్యారెంటీ

రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది

  • Publish Date - March 13, 2024 / 01:34 PM IST
  • మహాలక్ష్మి, ఆధి ఆబది పూరా హక్,
  • శక్తి కా సమ్మాన్, అధికార్ మైత్రి, సావిత్రీబాయి ఫూలే హాస్టల్
  • 5 గ్యారెంటీలు ప్రకటించిన రాహుల్‌గాంధీ
  • అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన
  • కులాల అభివృద్ధిలో అదొక విప్లవాత్మక చర్య
  • పారిశ్రామిక వేత్తలకు 16 లక్షల కోట్ల మాఫీ
  • రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయలేదు?
  • అటవీ హక్కుల చట్టాన్ని బలహీనపర్చిన బీజేపీ
  • కార్పొరేట్ కంపెనీల్లో, ఐఏఎస్‌లలో గిరిజనులెక్కడ?
  • భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌

ధులే: రాబోయే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఏటా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఐదు మహిళా న్యాయ్‌ గ్యారెంటీలను ప్రకటించారు. మహారాష్ట్రలోని ధులే జిల్లాలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర సందర్భంగా మహిళలను ఉద్దేశించి రాహుల్‌ మాట్లాడారు. పేద మహిళల ఖాతాల్లో ఏటా లక్ష రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ఆశ (అక్రెడిటెడ్‌ సోషల్‌ హెల్త్‌ యాక్టివిస్ట్స్‌) కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు రెట్టింపు చేస్తామని ప్రకటించారు. మహిళలకు వారి హక్కుల గురించి చైతన్యం కల్పించేందుకు, వారి కేసులలో సహాయం అందించేందుకు నోడల్‌ అధికారులను నియమిస్తామని తెలిపారు. దేశంలోని అన్ని జిల్లాల్లో మహిళల కోసం సావిత్రిబాయ్‌ ఫూలే హాస్టళ్లు నెలకొల్పుతామని రాహుల్‌ గాంధీ చెప్పారు.

మహిళలకు ఐదు గ్యారెంటీలకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక వీడియో సందేశంలో తెలియజేశారు.

మహాలక్ష్మి: పేద మహిళల బ్యాంకు ఖాతాల్లో ఏటా లక్ష రూపాయల నగదు జమ.

ఆధీ అబాది పూరా హక్‌ : ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు.

శక్తి కా సమ్మాన్‌: అంగన్‌వాడి, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ ఆదాయంలో ప్రభుత్వ వాటా రెట్టింపు.

అధికార్‌ మైత్రి : ప్రతి జిల్లాలో మహిళలకు వారి హక్కుల గురించి చైతన్యం చేసేందుకు, వారి న్యాయ పోరాటాలలో సహకారం అందించేందుకు నోడల్‌ అధికారి నియామకం.

సావిత్రిబాయ్‌ ఫూలే హాస్టల్‌: వర్కింగ్‌ విమెన్‌ కోసం ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం ఒక హాస్టల్‌ను ప్రభుత్వం నెలకొల్పుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న హాస్టళ్ల రెట్టింపు.

కులగణనే మార్గం

ఆర్థిక, సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్‌ పార్టీ మాట్లాడుతున్నదన్న రాహుల్‌ గాంధీ.. వాటికి మార్గం కులగణనేనని స్పష్టం చేశారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కులగణన నిర్వహిస్తుంది. దానితోపాటు ఆర్థిక పరిస్థితులపైనా దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుంది. ఇదొక విప్లవాత్మక అడుగు కానున్నది. ప్రతి కులానికి సంబంధించిన, జనాభాలో వారి శాతంపై మన దగ్గర స్పష్టమైన వివరాలు ఉంటాయి’ అని రాహుల్ చెప్పారు. పారిశ్రామిక వేత్తలకు సంబంధించిన 16 లక్షల కోట్ల రూపాయల రుణాలను బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది కానీ.. రైతుల రుణాలను మాఫీ చేయలేదని రాహుల్‌ ఆరోపించారు.

అటవీ హక్కులు బలోపేతం చేస్తాం

‘అటవీ హక్కుల చట్టం, భూసేకరణ చట్టం వంటివాటిని బీజేపీ బలహీనం చేసింది. మేం వాటిని బలోపేతం చేయడమే కాదు.. ఏడాది వ్యవధిలో గిరిజనుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం’ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాలు అడవిపై గిరిజనులకు హక్కు లేకుండా చేశాయని మండిపడ్డారు. ఇతర వర్గాల ప్రజలకంటే ముందే అడవుల్లో ఆదివాసీలు ఉండేవారన్న వాస్తవాన్ని నిరాకరించేందుకే ఆదివాసీలను ‘వనవాసీ’లని బీజేపీ పిలుస్తున్నదని ఆరోపించారు. ఆదివాసులు అంటే ఈ నేల, ఈ అడవి, ఇక్కడి నీటికి అసలు యజమానులని చెప్పారు. వనవాసీలకు ఆ వారసత్వం లేదని అన్నారు. ఆదివాసులను వనవాసీలని పిలుస్తున్న బీజేపీ.. వారి అడవులను మాత్రం నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. ‘జనాభాలో మీరు ఎనిమిదో వంతు ఉన్నారు. ఏదైనా ప్రధాన కార్పొరేట్‌ రంగంలో లేదా ప్రైవేటు కంపెనీల్లో ఏదైనా సీనియర్‌ మేనేజర్‌ పోస్టులలో మీకు ప్రాతినిథ్యం ఉన్నదా? దేశ బడ్జెట్‌ను కేటాయించే 90 మంది ఐఏఎస్‌ అధికారుల్లో ఒక్కరే గిరిజనుడు. బడ్జెట్‌లో ఖర్చు చేసే ప్రతి వంద రూపాయల్లో కేవలం పది పైసల ఖర్చును మాత్రమే గిరిజన ఐఏఎస్‌ నిర్ణయించే శక్తి ప్రస్తుతం ఉన్నది’ అని రాహుల్‌ వివరించారు.