వ్యతిరేక ఓటు చీలనీయొద్దు!.. ఇదే వ్యూహంతో బరిలోకి కాంగ్రెస్

- ఉద్యమకారులందరికీ చేరువ
- టీజేఎస్ బేషరతు మద్దతు
- టీడీపీ పోటీ నివారణ వరమే!
- ఆ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లే చాన్స్
- లెఫ్ట్ పార్టీలనూ కాపాడుకుంటే
- ప్రభుత్వ వ్యతిరేక ఓటు భద్రం
విధాత ప్రతినిధి: రాష్ట్రంలో తమకు విజయావకాశాలు గణనీయంగా ఉన్నాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలిపోకుండా చూస్తే గెలుపు తమదే అవుతుందని ఆలోచిస్తున్నది. గత ఎన్నికల్లో దాదాపు 28 నియోజకవర్గాల్లో మెజార్టీ పదివేల లోపే ఉన్నది. ఇటువంటి చోట్ల ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం తారుమారవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తున్న సమయంలో కాంగ్రెస్ తీసుకునే పొరపాటు నిర్ణయాలు ఆ పార్టీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే బీఆరెస్ దూరం చేసుకున్న నాటి ఉద్యమకారులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.
ప్రజల్లో అభిమానం సంపాదించుకున్న ఆకునూరి మురళి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్ వంటివారు రంగంలోకి దిగారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి.. సీట్లు కేటాయించకున్నా.. ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించడం ఒక కీలక అంశంగా రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీట్ల కేటాయింపులో ఇప్పటికే వామపక్షాలతో ఇబ్బందికర పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో సీట్లు ఇవ్వకున్నా మద్దతు ఇచ్చేలా తెలంగాణ జనసమితిని ఒప్పించడంలో కాంగ్రెస్ సఫలమైందని అంటున్నారు.
మరోవైపు టీడీపీని పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేయడంలోనూ కాంగ్రెస్ కీలక నేతల పాత్ర ఉన్నదని చెబుతున్నారు. టీడీపీకి హైదరాబాద్ నగరంలోని పలు నియోజకవర్గాలతోపాటు.. నిజామాబాద్, కోదాడ, ఖమ్మం, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల్లో గణనీయమైన ఓటింగ్ ఉన్నదని అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లలో విజయం సాధించి, 9 నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో టీడీపీ బరిలోకి దిగితే.. ఆయా స్థానాల్లో ప్రభుత్వ ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయి.
దీనిని నివారించేందుకే టీడీపీ పోటీ నుంచి ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు. దానికితోడు ప్రస్తుతం ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో ఉన్నారు. టీడీపీ అధినాయకత్వానికి ఈ అంశంతోనే సరిపోతున్నది. ఈ సమయంలో తెలంగాణపై దృష్టి కేంద్రీకరించే పరిస్థితి కూడా లేనందునే ఆ పార్టీ నాయకులు తెలంగాణలో పోటీకి ఆసక్తి చూపలేదని తెలుస్తున్నది. ఏది ఏమైనా.. టీడీపీ బరిలో ఉండకపోవడం కాంగ్రెస్‌కు పెద్ద వరంగానే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇక వామపక్షాలను కూడా వదులుకోవద్దనే అభిప్రాయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. పలు కీలకమైన సీట్లలో లెఫ్ట్ ఓట్లు ఫలితాన్ని తారుమారు చేసే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో హోరాహోరీ పోరు సాగనున్న నేపథ్యంలో ప్రతి ఓటు, ప్రతి సీటు కీలకమైనదే అవుతుంది. ఏ కాస్త తేడా వచ్చినా.. కాంగ్రెస్‌కు ఇబ్బందే. కామ్రేడ్ల స్నేహాన్ని వదులుకుంటే తెలిసీ కొన్ని సీట్లు బీఆరెస్‌కు ఇచ్చేసినట్టే అవుతుందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. అయితే.. వారికి ఏ సీట్లు ఇవ్వాలనే అంశంలో పార్టీలో చర్చలు తుదిరూపు తీసుకోనున్నాయని తెలుస్తున్నది.