Congress
విధాత: అదేంటి రాహుల్ గాంధీకి వైఎస్సార్ తనయ షర్మిళకు పడదు కదా.. వారితో ఆమె అంత ఖుష్ అయ్యేది ఏవుంటుంది అంటారా ? ఏమో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు.. అవసరాన్నిబట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన దాదాపు పధ్నాలుగేళ్ళు ఎలాంటి స్పందన లేకుండా ఉన్న కాంగ్రెస్ పెద్ద నాయకుడు ఇప్పుడు ఆయనకు జై కొడుతున్నారు. నేడు జులై ఎనిమిది వైఎస్సార్ జయంతి సందర్భంగా తనకు నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీతో బాటు రాహుల్ గాంధీ వేర్వేరుగా నివాళులు అర్పిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మళ్ళీ ఇన్నాళ్లకు తమ నాయకుడిగా చెప్పుకుంటున్నారు.
అయితే ఇది తెలంగాణ ఎన్నికల కోసమో ఇంకేదో కారణం కావచ్చు. రాజశేఖర్ రెడ్డి దార్శనికుడు అని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరాయంగా కృషి చేసారని ఆయన చిర స్మరణీయుడని రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు. దీనికి మిగతా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల నుంచి పెద్దగా స్పందన లేకున్నా షర్మిల మాత్రం వెనువెంటనే స్పందించారు.
రాహుల్ కు థాంక్స్ చెబుతూ మీ ఆప్యాయతకు ధన్యవాదాలు అని చెబుతూ మీ సారధ్యంలో తెలుగు ప్రజలు మరింత సమున్నతంగా ఉండాలని దివంగత వైఎస్సార్ కోరుకునే వారని షర్మిల చెప్పారు. నాన్న గారిని గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు.
ఈ ట్వీట్ చూస్తుంటే షర్మిల కాంగ్రెస్ కు దగ్గర అవుతున్నారన్న పుకార్లు నిజమే అనిపిస్తోంది. షర్మిళను కాంగ్రెస్ లో చేర్చుకుని రాజ్య సభ సీట్ ఇస్తారని, తెలంగాణాలో ఆమె ప్రచారం చేసి కాంగ్రెస్ కోసం పని చేస్తారని ఇలా రకరకాల పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ట్వీట్స్ చూస్తుంటే ఆమె నిజంగానే కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏమో రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు.