Congress
విధాత: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు షర్మిల పార్టీ వివాదం చిచ్చు రేపుతోంది. షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవాలా వద్దా అన్నది ఒక చర్చ అయితే, చేర్చుకున్నా ఆమెను తెలంగాణలో కాకుండా ఏపీకి పరిమితం చేయాలన్న చర్చ కాంగ్రెస్‌లో విభేదాలకు కేంద్రంగా మారింది. షర్మిల పార్టీని విలీనం చేసి తెలంగాణలో పోటీ చేయించాలని కోమటిరెడ్డితోపాటు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలు చూస్తుంటే, రేవంత్ రెడ్డి వర్గం మాత్రం అందుకు ససేమిరా అంటోంది.
తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌పై మోజు పడుతుంటే, కాంగ్రెస్ నాయకులు మాత్రం ఇంకా గ్రూపు తగాదాలను ప్రోత్సహించే లోపాయికారి ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు మాత్రం ఆ పార్టీకి పుండుగా మారాయి. రేవంత్‌రెడ్డి జోరుకు బ్రేక్‌లు వేయడానికి
నల్లగొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు తమ వ్యూహాలకు పదునుపెడుతూనే ఉన్నారు.
అందులో భాగంగానే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం ప్రతిపాదనను బలంగా ముందుకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఒకవైపు వైఎస్ షర్మిల తాను పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం లేదు మొర్రో అంటుంటే, మరోవైపు మాజీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డి.కె. శివకుమార్‌తో భేటీ అయ్యారు. షర్మిల పార్టీ విలీనంపై చర్చ చేసినట్లు అధికారికంగా వెల్లడించారు.
షర్మిల పార్టీ విలీనం చేసుకున్నా…ఆమె మాత్రం ఏపీ కాంగ్రెస్ తరఫునే వచ్చే ఎన్నికల్లో ప్రచారం చేస్తారని రేవంత్‌రెడ్డి స్పష్టంగా మీడియాకు వెల్లడించారు. తెలంగాణలో ఆమె పోటీ చేయదనే ఒప్పందం మేరకే విలీనం జరుగుతుందని కుండబద్ధలు కొట్టారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం శుక్రవారంనాడు బెంగళూరుకు వెళ్లి డి.కే. శివకుమార్‌ను కలిసి షర్మిల పార్టీ విలీనంపై చర్చించడం కొత్త వివాదానికి తెరదీసినట్లు అయింది.
షర్మిలను తెలంగాణ రాజకీయాలలోకి తీసుకురావడం గురించే కోమటిరెడ్డి డీకేతో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అదేవిధంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నాడంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన కూడా ఘాటుగా స్పందించారు. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఒకవైపు ప్రజల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగి, చేరికలు ఎక్కువైన నేపథ్యంలో సీనియర్ నాయకులు ఇలా తలోవైపు పార్టీకి నష్టం చేసే చర్యలకు దిగడాన్ని సామాన్య కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. కాంగ్రెస్‌కు రానున్నవి మంచి రోజులు అనుకుంటున్న తరుణంలో కోమటిరెడ్డి, ఉత్తమ్ మరోసారి మీడియా ముందుకు రావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని వారు మాట్లాడుకుంటున్నారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాల పుణ్యామా అని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చింది. ఆ ఫలితాల అనంతరం నాయకులు కొత్త ఉత్సాహంతో జనంలోకి వెళుతున్నారు. ఇన్నాళ్లు ఏ పార్టీలోకి పోతే బావుంటుందనే డైలామాలో ఉన్న నాయకులు సైతం కాంగ్రెస్‌లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందుకే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో పెరిగిన చేరికలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
టిపిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నాయకత్వం చేపట్టాక, బీఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ధరణితోపాటు, రైతులు, నిరుద్యోగుల సమస్యలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. దశాబ్ధి ఉత్సవాల పేర చేపట్టిన కార్యక్రమాన్ని విభేధిస్తూ దశాబ్ది దగా పేరిట కాంగ్రెస్ చేసిన కార్యక్రమం విజయవంతమైంది.
మరోవైపు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ కూడా వంద రోజులు పూర్తి చేసుకుని ప్రజలకు, కార్యకర్తలకు భరోసా ఇస్తున్నది. ఈ సందర్భంగా నిర్వహంచిన సభల ద్వారా అధికారంలోకి రాగానే ధరణి రద్దు చేస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారంతా తిరిగి రావాలని రేవంత్‌రెడ్డి కోరుతున్నారు. తిరిగి పార్టీలోకి వచ్చేవారికోసం తాను ఎంత వరకైనా దిగొస్తానని ప్రకటించారు. అన్నట్లుగానే తన చిరకాల ప్రత్యర్థి అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని స్వయంగా ఇంటికి వెళ్లి ఆహ్వానించారు.
కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో సయోధ్యగా ఉంటూనే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులాంటి వారిని బిజేపీలోకి వెళ్లకుండా కాంగ్రెస్‌వైపు చూసేలా కృషి చేశారు. దీంతో బీఆర్ ఎస్‌కు కాంగ్రెస్ ఏకైక ప్రత్యామ్నాయం అన్న సందేశం ప్రజల్లోకి, ఇటు పార్టీ క్యాడర్‌లోకి వెళుతోంది. దీంతో బిజేపీ, బీఆర్ ఎస్ అసంతృప్తులంతా కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.