Congress | 24 గంటల సరఫరా ఎక్కడ?: రేవంత్‌రెడ్డి

Congress అది వచ్చే ఊళ్లలో మేం ఓట్లడగం రాని గ్రామాల్లో మీరు ఓట్లడగొద్దు రెఫరెండానికి కాంగ్రెస్‌ పార్టీ రెడీ హరీశ్‌ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్‌ విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతిపై ‘విద్యుత్తు ఫైల్స్’ విడుదల చేస్తాం పోచారం, గుత్తాలను రైతు కులం నుండి బహిష్కరించాలి గవర్నర్ వారిద్దరినీ బర్తరఫ్ చేయాలి సీఎం మళ్లీ గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తారా? బీఆరెస్‌ సిటింగ్‌లందరికీ మళ్లీ టికెట్లు ఇస్తారా? హరీశ్‌, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్న విధాత: వ్యవసాయానికి […]

Congress | 24 గంటల సరఫరా ఎక్కడ?: రేవంత్‌రెడ్డి

Congress

  • అది వచ్చే ఊళ్లలో మేం ఓట్లడగం
  • రాని గ్రామాల్లో మీరు ఓట్లడగొద్దు
  • రెఫరెండానికి కాంగ్రెస్‌ పార్టీ రెడీ
  • హరీశ్‌ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్‌
  • విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతిపై ‘విద్యుత్తు ఫైల్స్’ విడుదల చేస్తాం
  • పోచారం, గుత్తాలను రైతు కులం నుండి బహిష్కరించాలి
  • గవర్నర్ వారిద్దరినీ బర్తరఫ్ చేయాలి
  • సీఎం మళ్లీ గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తారా?
  • బీఆరెస్‌ సిటింగ్‌లందరికీ మళ్లీ టికెట్లు ఇస్తారా?
  • హరీశ్‌, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రశ్న

విధాత: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా జరగడం లేదన్న తమ వాదనకు కట్టుబడి ఉన్నామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు. దీనిపై మంత్రి టీ హరీశ్రావు సవాల్ చేసినట్లుగా రెఫరెండానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమని చెప్పారు. గ్రామసభలు, రచ్చబండ సభలు పెట్టి రైతుల అభిప్రాయాలు తీసుకుందామన్న రేవంత్‌రెడ్డి.. 24 గంటల ఉచిత విద్యుత్తు వచ్చే గ్రామాల్లో తాము ఓట్లు అడగబోమని, రాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగవద్దని ప్రతి సవాల్ విసిరారు.

దమ్ముంటే తన సవాల్‌ను స్వీకరించాలని, లేదంటే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలపై త్వరలోనే ‘విద్యుత్తు ఫైల్స్’ విడుదల చేస్తామని రేవంత్‌ ప్రకటించారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్తుపై బీఆరెస్ ప్రభుత్వం పదేపదే చేస్తున్న అరుపులు చనిపోయే ముందుకు గావుకేకల్లాంటివన్నారు.

ఉచిత విద్యుత్తుకు పేటెంట్ కాంగ్రెస్ కాదని చెప్పే ప్రయత్నం బీఆరెస్ నేతలు చేస్తున్నారన్నారు. 1999లోనే వైఎస్ పీసీసీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉచిత విద్యుత్తు అంశాన్ని పెట్టారని చెప్పారు. తెలుగు మ్యానిఫెస్టోలో 8వ పేజీలో… ఇంగ్లిష్‌ మ్యానిఫెస్టోలో 9వ పేజీలో కాంగ్రెస్ స్పష్టంగా చెప్పిందని తెలిపారు. 1999లో అధికారంలోకి రాలేదు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ ఉచిత విద్యుత్తు ఇవ్వలేకపోయిందన్నారు.

విద్యుత్తు ఉద్యమంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడారని రేవంత్‌ చెప్పారు. ఆనాటి బషీర్‌బాగ్ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని, అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేసీఆర్ టీడీపీ హెచ్ఆర్డీ విభాగం చైర్మన్‌గా ఉన్నారని గుర్తు చేశారు. అప్పుడు పోచారం మంత్రిగా ఉన్నారని, గుత్తా, కేసీఆర్‌ కీలక పదవుల్లో ఉన్నారని చెప్పారు.

వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్తు పాలసీని తయారు చేశారన్న రేవంత్‌.. బషీర్‌బాగ్ కాల్పులకు మీరు కారణం కాదా? అని ప్రశ్నించారు. 2000 ఆగస్టు 28న బషీర్‌బాగ్‌ ఘటన చోటు చేసుకుంటే.. తాను టీడీపీలో చేరింది 2007లోనని చెప్పారు. అలాంటప్పుడు బషీర్‌బాగ్ కాల్పులకు తానే కారణమంటూ హరీశ్‌ ఎలా ఆరోపిస్తారని నిలదీశారు. ఆనాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కోసం కేసీఆర్ చంద్రబాబు చెప్పులు మోసేందుకు సిద్ధమైంది నిజం కాదా? అని ప్రశ్నించారు.

తుమ్మల, మండవ, బొజ్జల, వేమూరి రాధాకృష్ణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇందుకు ప్రత్యక్ష సాక్షులన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన డబ్బులతో ఆనాడు కేసీఆర్ టీఆరెస్ పార్టీ పెట్టారని రేవంత్‌ ఆరోపించారు. ఆంధ్రోళ్ల సొమ్ముతో టీఆరెస్ పెట్టారని, ఆ చరిత్రకు సాక్షులు చాలామంది ఉన్నారని చెప్పారు. వార్డు మెంబర్ కూడా కాని హరీశ్‌ను కాంగ్రెస్‌ పార్టీయే మంత్రిని చేసిందని గుర్తు చేశారు. 1999లో కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్తు హామీని 2004లో అమలు చేశారని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే చేసిన తొలి సంతకం దానిమీదేనని చెప్పారు.

చంద్రబాబుతో పొత్తెందుకు?

తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకొన్న కేసీఆర్ 2009లో మళ్లీ చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్ చరిత్ర అంతా కాంగ్రెస్‌, టీడీపీలపై ఆధారపడే సాగిందన్న రేవంత్‌.. ఆయన పరాన్నజీవి అని.. ఒకవైపు టీడీపీ.. మరో వైపు కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో బతికారని ఎద్దేవా చేశారు.

అత్యంత అవినీతికి పాల్పడిన వారే ఇప్పుడు కేసీఆర్ సలహాదారులుగా ఉన్నారని రేవంత్‌ విమర్శించారు. తెలంగాణ మేధావులపై కేసులు పెట్టి వేధించిన చరిత్ర కేసీఆర్‌దని మండిపడ్డారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీశ్‌కు సిగ్గుండాలన్నారు. రాజ్యంగ పదవుల్లో గౌరవంగా ఉండాల్సిన గుత్తా, పోచారం కేసీఆర్ బూట్లు నాకుతున్నారని దుయ్యబట్టారు.

గుత్తా తన కొడుకుకు టికెట్ ఇప్పించుకునేందుకు కేసీఆర్ ప్రాపకం కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. పోచారం, గుత్తాలను రైతు కులం నుంచి బహిష్కరించాలన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి రాజకీయాలు మాట్లాడుతున్న వారిద్దరినీ గవర్నర్ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

గజ్వేల్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించగలరా?

రాష్ట్రంలో వెలుగులు నింపింది, బంగారు తెలంగాణ చేసింది కేసీఆర్‌ అయితే.. పథకాల కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని సీఎం ప్రకటించాలని, సిట్టింగులందరికీ సీట్లు ఇస్తానని చెప్పాలని రేవంత్‌రెడ్డి సవాలు విసిరారు. ఈ సవాల్‌కు కేసీఆర్‌, కేటీఆర్‌ సిద్ధమా అని ప్రశ్నించారు.

మగాళ్లయితే తన సవాలును స్వీకరించాలన్నారు. బొగ్గు గనుల ప్రాంతాల్లోనే థర్మల్ ఫ్లాంట్‌లు పెడుతామని చెప్పిన కేసీఆర్‌.. యాదాద్రి ప్లాంట్‌ను ఎక్కడ కడుతున్నారని నిలదీశారు. కేసీఆర్ పాలనలో 24 గంటల విద్యుుత్తు సరఫరా కావడం లేదని సబ్‌స్టేషన్ల లాగ్‌బుక్‌లు చెబుతున్నాయన్నారు. దీనిపై కోమటిరెడ్డి, జీవన్‌రెడ్డి విసిరిన రాజీనామా సవాల్‌ను కేటీఆర్ స్వీకరించాలన్నారు