విధాత: ఎక్కడున్నా, ఏం చేసినా కన్న వారి, ఉన్న ఊరు పేరు నిలబెట్టాలనేది నానుడి. ఇతడు మాత్రం తాను కన్న ఊరుకు పేరును సార్థకం చేశాడు. స్టూవర్ట్ పురం అంటే.. దొంగలకు పేరుగాంచింది. అక్కడ అనేక కుటుంబాలకు కుటుంబాలే దొంగతనాన్ని వృత్తిగా ఎంచుకొని జీవిస్తుంటారని ప్రచారం. ఈ ఊరు పేరుతో స్టూవర్ట్ పురం దొంగలు అనే పేరుతో సీనిమానే వచ్చిందంటే.. ఆ ఊరు ఎంత పేరుగాంచిందో అర్థం చేసుకోవచ్చు.
ఏపీ బాపట్ల జిల్లా స్టూవర్ పురంకు చెందిన ఈశ్వర్ పోలీస్ ఉద్యోగంలో చేరాడు. నిఘా విభాగంలో పనిచేస్తూ కీలకమైన టాస్క్‌ఫోర్స్ లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేయటం, చోరీ సొత్తును రికవరీ చేయటం, దొంగల ముఠాలను పట్టుకోవటంలో పట్టు సాధించాడు. దొంగల్లోనే ఇన్‌ఫార్మర్లను తయారు చేసుకొని అంతర్రాష్ట్ర ముఠాల ఆట కట్టించటంలో దిట్ట అయ్యాడు.
ఆ క్రమంలోనే దొంగల ముఠాలతో పరిచయాలు పెరిగాయి. ముఠాలతోనే చోరీలు చేయిస్తూ రెండు చేతులా సంపాదించవచ్చు కదా అనే ఆలోచన చేశాడు, అమలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఏడు ముఠాలను ఏర్పాటు చేసి తెలంగాణ, ఏపీల్లో దొంగతనాలు చేయించాడు.
దొంగలను తన నివాసం హఫీజ్‌పేటలో కూడా పెట్టి పోషించాడు. ఒక్కో కుటుంబానికి రూ. 40నుంచి రూ.50వేల దాకా ముట్టజెప్పుతాడట. ముఖ్యంగా సెల్‌ఫోన్లు, బంగారు ఆభరణాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేయించాడు. రికవరీ సొత్తు కాజేయటంలో, దొంగ సొత్తును సొంతం చేసుకోవటంలో తన ఉన్నతాధికారులు ఎస్సైలు, సీఐలకు వాటాలు పంచాడు.
ఏదైనా ఎన్ని రోజులు సాగుతుంది. నల్లగొండలో సెల్‌ఫోన్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండటంతో అక్కడి పోలీసులు నిఘాపెట్టి దొంగలను పట్టుకున్నారు. విచారణలో ఈ పనులన్నీ తమ సార్ చేయిస్తున్నట్లు దొంగలు చెప్పటంతో.. తీగ లాగితే డొంకంతా కదిలింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దీనిపై సమగ్ర విచారణ చేపట్టినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ శ్వర్‌తో చేతులు కలిపి దొంగసొత్తులో వాటాలు పంచుకుతిన్న ఉన్నతాధికారుల్లో గుబులు మొదలైనట్లు తెలుస్తున్నది.