నాయకుడు సభకు రావట్లే అక్బరుద్దీన్ సెటైర్.. పనేంటని KTR ప్రశ్న!
అసెంబ్లీలో అక్బర్, కేటీఆర్ మధ్య సంభాషణ ఎంఐఎంకు ఈసారి 15 మంది ఎమ్మెల్యేలు గ్యారంటీ ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ధీమా విధాత: బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్లకు వెళ్లే టైమ్ ఉంటుంది కానీ అసెంబ్లీకి వచ్చే టైం లేదా? అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ సభలో సభానాయకుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా […]

- అసెంబ్లీలో అక్బర్, కేటీఆర్ మధ్య సంభాషణ
- ఎంఐఎంకు ఈసారి 15 మంది ఎమ్మెల్యేలు గ్యారంటీ
- ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ధీమా
విధాత: బీఆర్ఎస్ నేతలకు టీవీ డిబేట్లకు వెళ్లే టైమ్ ఉంటుంది కానీ అసెంబ్లీకి వచ్చే టైం లేదా? అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ సభలో సభానాయకుడు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా లేరని ఖాళీ కుర్చీలను చూపిస్తూ ప్రస్తావించారు.
ఇష్టారీతిన బీఏసీలో నిర్ణయం తీసుకున్నారని, తాను 25 ఏళ్లలో ఇలాంటి సభను చూడ లేదన్నారు. ఓవైసీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. సభా నాయకుడు సభకు రాలేదని ప్రశ్నిస్తున్నారని, అసలు సభా నాయకుడితో ఓవైసీకి ఏం సంబంధం? అని ప్రశ్నించారు. ఓవైసీ బీఏసీ సమావేశాలకు రాకపోగా ఆరోపణలు చేయడం తగదని అన్నారు. ఆవేశంగా ప్రసంగం చేస్తే సరిపోదని, అర్థవంతంగా సమాధానం చెప్పొచ్చు అని కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో సభ్యులు మాట్లాడటానికి సంఖ్యను బట్టి సమయం ఇస్తామన్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎంకు గంట సమయం కేటాయిస్తే.. తమకు ఎన్ని గంటల సమయం ఇవ్వాలని కేటీఆర్ ప్రశ్నించారు. దీనిపై జోక్యం చేసుకున్న అక్బరుద్దీన్ ఓవైసీ.. ‘నేను కొత్త సభ్యుడిని కాదు.. చాలాసార్లు ఎమ్మెల్యే అయ్యాను. సమయాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చునో నాకు తెలుసు’ అన్నారు.
రాబోయే ఎన్నికల తర్వాత 15 మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారని చెప్పారు. సభలో చర్చ రాజ్యాంగ బద్దంగా జరగాలన్న అక్బర్ గతంలో చాలా సభల్లో ఆయా అంశాలపై గంటల సేపు చర్చించామని, ఏనాడూ అభ్యంతరం చెప్పలేదన్నారు.