విధాత, ఉమ్మడి ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. ఇది అందరికి తెలిసిన నగ్నసత్యం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సందర్భాలు అనేకం చూశాం.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టు పెద్దలంతా టీఆర్ఎస్‌కు కొమ్ముకాస్తున్న స్థానిక
నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌కే జై కొడుతున్నారు. అందుకు సంబంధించిన నిజాలు బయట పడుతున్నాయి.
కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ములుగు జిల్లా మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అక్కడి నుంచి నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్, ఇల్లందు పినపాక నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ పార్టీని ఎండగడుతూ పాదయాత్ర చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలపై విరుచుకుపడ్డారు. వారు చేస్తున్న అవినీతి అక్రమాలపై ధ్వజమెత్తారు.
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మద్దతుగా కొంతమంది కామ్రేడ్స్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుంది.
పాదయాత్రలో మెరిసిన కామ్రేడ్స్!
ఉమ్మడి ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలంలో సీపీఐ నేతలు రేవంత్ రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. వారు స్థానిక కార్యకర్తలనొ అనుకుంటే పొరపాటే. ఏకంగా జిల్లా కార్యవర్గ సభ్యులే ఈ యాత్రలో పాల్గొన్నారు. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి చెందిన కమటం వెంకటేశ్వరరావు పార్టీని దిక్కరించి పాదయాత్రలో పాల్గొన్నారు.
పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా సీపీఐ క్యాడర్ అంత కాంగ్రెస్ వైపు ఉన్నట్టు స్పష్టమవుతుంది. చాలామంది బయట పడకపోయినా అభిమానం మాత్రం కాంగ్రెస్ వైపే అంటున్నారు. మరికొందరు మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి జై కొడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సీపీఐ, సీపీఎం క్యాడర్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.
బహిరంగంగా బయట పడకపోయినా, లోలోన బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎటువంటి పిలుపు లేకపోయినా రేవంత్ రెడ్డి పాదయాత్రకు హాజరయ్యారు. సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీ సింగరేణి కార్మికులంతా పాదయాత్రలో పాల్గొన్నట్లు సమాచారం.
ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ ఎంఎల్ న్యూ న్యూ డెమోక్రసీకి కంచుకోటైన ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీపై క్యాడర్ తీవ్ర వ్యతిరేకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇల్లెందు నియోజకవర్గంలో సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధిపత్యం చెలాయించింది. ప్రస్తుతం గ్రూపులుగా ముక్క చెక్కలుగా అయిపోయింది.
నిజానికి చెప్పాలంటే కేసీఆర్ దీక్ష సందర్భంగా ఖమ్మంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం కేంద్రంగా పోషించిన పాత్ర ఉద్యమానికి కేంద్ర బిందువు. అలాంటి పార్టీ రాష్ట్ర ఏర్పడినంక తునా తునకలైపోయింది. అందుకు కార్యకర్తలు ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.