CPI
విధాత, వరంగల్: ధరల పెరుగుదలపై భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) కన్నెర్ర చేసింది. శుక్రవారం పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్, వరంగల్, ఖమ్మం రహదారి పెట్రోల్ పంప్, నర్సంపేట సెంటర్లు ధర్నా, రాస్తారోకోలతో దద్ధరిల్లాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి మాట్లాడారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు నియంత్రించడంలో విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో పేద ప్రజల దగ్గరికి వస్తూ మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు.
ఓట్లు దండుకోవాలనే దురుద్దేశంతోనే అమలు కాని హామీలను ఇస్తున్నారని మండిపడ్డారు. ఉప్పు, పప్పు, నూనె, ఇతర రకరకాల నిత్యావసర వస్తువులపై జీఎస్ట్సీ వేసి ప్రజల రక్తాన్ని తాగుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
నిరసనలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంజాల రమేష్, బుస్సా రవిందర్, గుండె బద్రి, కండి నర్సయ్య, సండ్ర కుమార్, జన్ను రవి, పరికిరాల రమేష్, జిల్లా సమితి సభ్యులు వలబోజు వెంకన్న, ఎండి అంజాద్ పాల్గొన్నారు.