CPI Narayana | అహంకారంతోనే ఓడారు.. మళ్లీ అదే ధోరణి

బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తన ఒంటెద్దు పోకడలు, అహంకారంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు

CPI Narayana | అహంకారంతోనే ఓడారు.. మళ్లీ అదే ధోరణి
  • కేసీఆర్‌పై సీపీఐ నారాయణ మండిపాటు


విధాత : బీఆరెస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తన ఒంటెద్దు పోకడలు, అహంకారంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారని, అయినా అదే ధోరణితో వ్యవహరిస్తూ నల్లగొండ సభలో సీఎం రేవంత్‌రెడ్డిపైన, ప్రభుత్వంపైన అడ్డగోలు విమర్శలు చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే మేడిగడ్డ కుంగుబాటును కేసీఆర్‌ చిన్నదిగా చెబుతున్నారన్నారు. మాజీ సీఎంగా, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లి ప్రజాసమస్యలపై చర్చించాల్సిన కేసీఆర్‌ సభకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.


మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్లకపోవడం చూస్తే బీఆరెస్‌-బీజేపీలు ఒక్కటేనని తేలిపోతుందని, అవినీతి నుంచి కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు ద్రోహిగా వ్యవహరిస్తోందన్నారు. కేంద్రం రైతు చట్టాలపై హామీలను విస్మరించడంతోనే రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారన్నారు. కేంద్రంలోని బీజేపీకి టీడీపీ, వైసీపీ మద్దతిస్తున్నాయన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం ఒక్క విభజన హామీ కూడా అనులు చేయలేదన్నారు.