CPI&CPM | BRSతో పొత్తు.. కాదనే వారిపై ‘కొడవలి’ వేట్లు

షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు కామ్రేడ్ల కంచు కోటగా ఉమ్మడి నల్లగొండ నాయకుల్లో ఆధిపత్య ధోరణలు ప్రబలి.. బీటలు నిరాశలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు బీఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల మద్దతుతో వివాదం ప్రజల్లో తలెత్తుకోలేక పోతున్నామంటున్న క్యాడర్‌ నాయకుల తీరుపై వాట్సప్‌ గ్రూపుల్లో ఆవేదనలు ప్రశ్నిస్తున్న వారికి లెఫ్ట్‌ నాయకత్వం నోటీసులు CPI-CPM । ఉమ్మడి నల్లగొండ జిల్లా! ఎర్రజెండా నీడలో సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రధాన కేంద్రం! […]

CPI&CPM | BRSతో పొత్తు.. కాదనే వారిపై ‘కొడవలి’ వేట్లు
  • షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు
  • ఒకప్పుడు కామ్రేడ్ల కంచు కోటగా ఉమ్మడి నల్లగొండ
  • నాయకుల్లో ఆధిపత్య ధోరణలు ప్రబలి.. బీటలు
  • నిరాశలో పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు
  • బీఆర్‌ఎస్‌కు కమ్యూనిస్టుల మద్దతుతో వివాదం
  • ప్రజల్లో తలెత్తుకోలేక పోతున్నామంటున్న క్యాడర్‌
  • నాయకుల తీరుపై వాట్సప్‌ గ్రూపుల్లో ఆవేదనలు
  • ప్రశ్నిస్తున్న వారికి లెఫ్ట్‌ నాయకత్వం నోటీసులు

CPI-CPM । ఉమ్మడి నల్లగొండ జిల్లా! ఎర్రజెండా నీడలో సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ప్రధాన కేంద్రం! ఆ వారసత్వమే జిల్లాను కమ్యూనిస్టులకు కంచుకోటగా మార్చింది. దశాబ్దాల తరబడి ఎర్రజెండాను ఎగరేయించింది. కానీ.. ఇప్పుడు ఆ కంచుకోట బద్దలైపోయింది. జిల్లాను శాసించిన కామ్రేడ్ల ప్రజా రాజకీయం ఇప్పుడు ఫక్తు సీట్ల రాజకీయంగా మారిపోయింది. అధికార పార్టీ పంచన చేరి.. ఒకటో రెండో సీట్లు ఇప్పించుకుంటే చాలు అన్నట్టు తయారైపోయిందని ఆ పార్టీ శ్రేణులే వాపోతున్నాయి.

విధాత: కమ్యూనిస్టులు ఉండాల్సింది ప్రజా క్షేత్రంలో. ప్రజా సమస్యలపై పోరాటాలే వారికి ఆయువు. ఇటీవలి కాలంలో జరిగిన చారిత్రక విద్యుత్తు ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నది వారే. అలాంటి కమ్యూనిస్టులు.. అనేక పరిణామాల్లో ఉన్న ప్రాభవం కోల్పోయి.. తోక పార్టీలుగా మారుతున్నాయన్న విమర్శ గట్టిగానే ఉన్నది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీతో చెలిమి చేయడం మొదలు.. తాజాగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టకుండా.. నొప్పించక.. తానొవ్వక అన్న చందాన రెండు పార్టీల రాష్ట్ర నాయకత్వాలు వ్యవహరిస్తున్న తీరు క్యాడర్‌లో అసంతృప్తికి దారి తీస్తున్నది.

ఉద్యమాల పార్టీకి ఉద్యమాలు నిర్వహిస్తేనే పూర్వవైభవం వస్తుంది కానీ.. సీట్ల పంచాయతీతో కాదని కొందరు తెగేసి చెబుతున్నా.. ఉభయ కమ్యూనిస్టు పార్టీల అగ్రనాయకత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

గ్రామ స్థాయిలో వైరుధ్యాలు నిజమే

గ్రామస్థాయిల్లో బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీ నాయకుల మధ్య వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే గానీ.. తమ స్థాయిలో అంతా సఖ్యతగానే ఉందన్న తమ్మినేని వీరభద్రం మాటలే.. కేసీఆర్, కమ్యూనిస్టు నేతల అవగాహనా అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని కేసీఆర్‌ సర్కారును నిలదీయాల్సింది పోయి.. సఖ్యతతో మెలగటమేంటని స్థానిక కార్యకర్తలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ వాట్సప్‌ గ్రూపులలో చర్చలు మొదలు పెట్టారు. నేతల తీరును ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పార్టీతో పొత్తులకు ఎలా సిద్ధపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కన్నెర్ర చేసిన వామపక్ష పార్టీ సీపీఎం.. ప్రశ్నించినవారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నది.

జాతీయ, రాష్ట్ర కమిటీ తీర్మానాల పేరుతో

సిద్ధాంతాలను వదిలేస్తున్న కమ్యూనిస్టు పార్టీలు మిగిలిన అన్ని బూర్జువా పార్టీల్లానే మారిపోతున్నాయని, జాతీయ, రాష్ట్ర కమిటీల తీర్మానాల పేరు చెప్పి.. ప్రజల నాడి తెలిసిన జిల్లా, రూరల్‌ నాయకత్వం నోరు మూయిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నేతల వ్యవహారం బయటపడిన ప్రతిసారీ.. క్రమశిక్షణ పేరుతో చర్యలకు దిగుతున్నారని మండిపడుతున్నారు. అగ్ర నాయకత్వం ఒంటెత్తు పోకడలు, బూర్జువా పద్ధతుల కారణంగా వామపక్షాలు ఇప్పటికే ప్రాభవాన్ని కోల్పోయాయని, కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్పే ఉమ్మడి నల్లగొండలో లెఫ్ట్‌ పార్టీలు పత్తా లేకుండా పోయాయని క్యాడర్‌ విమర్శిస్తున్నది.

రాష్ట్ర‌ నాయకత్వం తీరుతో ప్రజల్లో తలెత్తుకోలేని పరిస్థితులు ఉన్నాయని స్థానిక కార్యకర్తలు అంటున్నారు. ఈ ధోరణిని సహించలేక కొందరు పార్టీని వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా ఉన్నది. అయినా సరే తగ్గేది లేదన్నట్టు పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఎర్ర’ కోటలో ‘గులాబీ’ జెండా

సీపీఎం, సీపీఐ నాయకత్వం తీరుతో ఉమ్మడి నల్లగొండ లాంటి కంచుకోట బీటలు వారింది. ఇప్పుడు అక్కడ బీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడుతున్నది. గతంలో నకిరేకల్‌లో సీపీఎం ఎనిమిది సార్లు విజయం సాధించింది. ఒక దఫా సీపీఐ గెలిచింది. మొత్తంగా ఇక్కడ 45 ఏండ్లపాటు వామపక్షాలదే హవా. మిర్యాలగూడను 15 ఏళ్లపాటు గెలుచుకున్నది.

మిర్యాలగూడలో 15 సంవత్సరాలు, దేవరకొండలో ఎనిమిది సార్లు, తుంగతుర్తిలో మూడు సార్లు, మునుగోడు నియోజకవర్గంలో ఐదుసార్లు కమ్యూనిస్టు పార్టీల ఎమ్మెల్యేలే గెలిచారు. మునుగోడులో వామపక్షాల తరఫున అభ్యర్థిని పెట్టాలని స్థానిక కార్యకర్తలు, నాయకుల నుంచి విజ్ఞప్తులు వెళ్లినా.. బీజేపీ బూచిని చూపిస్తూ దానిని బీఆర్‌ఎస్‌ చేతిలో పెట్టారు.

ఇక్కడ లెఫ్ట్‌ ఓట్లతో గెలిచినా.. ప్రభుత్వ విధానాలే గెలిపించాయని బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. నాగార్జున సాగర్‌లోనూ కమ్యూనిస్టులకు మద్దతు ఉన్నప్పటికీ.. దానినీ బీఆర్‌ఎస్‌కే వదిలేశారు. ఆయా సందర్భాల్లో అభ్యంతరాలు వెలిబుచ్చిన కార్యకర్తల నోరు మూయించడంతోపాటు.. పార్టీ నుంచి తొలగించిన సందర్భాలు ఉన్నాయని తెలుస్తున్నది.

పేపర్‌ లీకేజీపై కార్యాచరణ ఏది?

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్నా.. ఎందుకు కార్యక్రమాలు తీసుకోవడం లేదని రాష్ట్ర నాయకత్వాన్ని కింది స్థాయి నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలావరకు పదేళ్లు దాటినా అమలు కాకపోవడాన్ని ఎందుకు నిలదీయటం లేదన్న ప్రశ్నలకూ సమాధానాలు రావడం లేదని అంటున్నారు.

ప్రశ్నించిన వారికి షోకాజ్‌ నోటీసులు జారీచేయడమే కాకుండా.. పార్టీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచనలు ఇస్తున్నారని సమాచారం. వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసినవారిని సైతం ఈ క్రమంలో వదులకునేందుకు సీపీఎం నాయకత్వం సిద్ధంగానే ఉన్నదని, కేసీఆర్‌ను మాత్రం వదులుకునేందుకు ఇష్టపడటం లేదని కార్యకర్తలు వాపోతున్నారు.

12 మందికి షోకాజ్‌ నోటీసులు

ఖమ్మం జిల్లాలో మైనింగ్‌ను కాపాడుకోవడంతో పాటు కేసీఆర్ నుంచి ప్యాకేజీలు అంది ఉంటాయని పలువురు అసంతృప్త కమ్యూనిస్టు కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇలా ఆరోపణలు చేసినవారిలో 12 మందికి సీపీఎం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిందని సమాచారం. నోటీసులు అందుకున్నవారిలో ఒక ఉప సర్పంచ్‌తోపాటు.. ముగ్గురు శాఖ కార్యదర్శులు సైతం ఉన్నట్టు తెలుస్తున్నది.