విధాత: ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత ఆయన ముఖం మళ్లీ అసెంబ్లీ కనబడకూడదన్న కోపం కేసీఆర్‌లో ఉండేది అనే ప్రచారం జరిగింది. ఎలాగైనా ఈటల తిరిగి అసెంబ్లీలో అడుగు పెట్టకుండా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వ పథకాల రూపంలో , ఎన్నికల ప్రచారం ఖర్చులు కలిసి దాదాపు 400 కోట్లు దాటిందనేది అప్పట్లో రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.
అంతేకాదు దేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక అనే ప్రచారమూ ఉన్నది. ఇన్ని చేసినా ఈటల గెలుపును అధికారపార్టీ అడ్డుకోలేకపోయింది. ఓటమి తర్వాత గతంలో కంటే మెజారిటీ తగ్గించగలిగామని సంతృప్తి పడింది తప్పా ప్రభుత్వ వైఫల్యాలను, వ్యతిరేకతను అంగీకరించలేదు.
అలాగే దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను ట్రబుల్ షూటర్‌గా పేరొందిన మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. ఆ రెండు ఓటములు ఆయన ఖాతాలో వేసి చేతులు దులుపుకున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికలో ఆయనను ఒక మండలానికే పరిమితం చేశారు. ఆ గెలుపును కేసీఆర్ వ్యూహంగా.. కేటీఆర్ ఘనతగా ప్రచారం చేయించారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆదివారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానం ఇస్తూ.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నబీజేపీ ప్రభుత్వానికి 2024లో ప్రజలు చరమగీతం పాడుతారని, కేంద్రంలో ఆ పార్టీ పాలన అంతమౌతుందని అన్నారు. ప్రధాని సంకుచిత ధోరణి వీడాలని, తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలనా వైఫల్యాలను ఎండగడుతూ మోడీని అత్యంత అసమర్థ ప్రధానిగా అభివర్ణించారు.
మేం చెప్పిందే వినాలి, మేం చెప్పిందే లెక్క, వినకపోతే చంపేస్తామనేది కేంద్రంలో బీజేపీ ధోరణి అని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అధికారపార్టీకి ఏటీఎంగా మారిందని జేపీ నడ్డా మొదలు అమిత్ షా, రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వేగంగా ఎందుకు పూర్తికాలేదని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఈ విమర్శలకు నేరుగా సమాధానం చెప్పకుండా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేశారని దీనికి ఈటలే సాక్షి అని, ఆయన ఇప్పుడు బీజేపీలో ఉండొచ్చు కానీ ఆయకు అన్ని తెలుసు అని ఆయనను ఈ వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు.
అలాగే తమ బేషజాలు లేవంటూ.. ఈటల కోరిక మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు పెంచుతున్నామన్నారు. ఆయన చెప్పాడు కాబట్టి చేయమని అనొద్దు, అవసరమైతే ఆయన ఫోన్ చేసిన సలహాలు తీసుకోవాలని సూచించారు. నిన్న సభలో ఈటల రాజేందర్ పేరును సీఎం సభలో 18 సార్లు ప్రస్తావించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
మొన్ననే మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో ఈటల రాజేందర్‌తో ప్రత్యేకంగా మాట్లాడటం, అధికార కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించడం, పిలిస్తే కదా.. వచ్చేది అని ఈటల జవాబు ఇవ్వడం చర్చనీయాంశం అయ్యింది. ఈటలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారా? అందుకే మొన్న తనయుడు, నిన్న తండ్రి ఈటలను ప్రస్తన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేశారా అనుకుంటున్నారు.
సభలో ఆయన ముఖం కనిపించకూడన్న కేసీఆర్ ఈటల పేరు పదే పదే ప్రస్తావించడంపై ఈటల స్పందించారు. గెంటేసిన వాళ్లు తిరిగి పిలిచినా వెళ్లేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతలను అవమానించడమే లక్ష్యంగా సమావేశాలు నిర్వహించారని విమర్శించారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లొచ్చు అనే ప్రచారం జరుగుతున్నది. రెండు సార్లు సొంతంగా మెజారిటీ సాధించిన ఆ పార్టీకి ఈసారి ధరణి సమస్యలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు, ధాన్యం కొనుగోళ్లు, కరెంటు కోతలతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావొచ్చు. అందుకే ఈసారి చెమటోడ్చినా అధికారం నిలబెట్టుకోవడానికి కావాల్సిన మెజారిటీ దక్కకపోవచ్చనే చర్చ జరుగుతున్నది.
బడ్జెట్ సమావేశాల ముందు రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ రాజ్‌భవన్ చర్చ, బడ్జెట్ సమావేశాల్లో ఈటల రాజేందర్ పై అధికార పార్టీ అధినేత ప్రశంసలు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా మాట్లాడిన అంశాలే చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత ఆంతర్యం ఏమిటో ఆ పార్టీ నేతలకే అంతుపట్టడం లేదు.