పొట్టపై కాలితో నొక్కి గర్భిణీ డెలివరీ.. నర్సుల తీరుపై విమర్శలు

విధాత, నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గర్భిణీ వైద్యుల, నర్సుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన శిరస్సు అఖిల(21) ప్రసవం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ 9వ తేదీన అడ్మిట్ కావడం జరిగింది. సాధారణ కాన్పు కోసం వేచిచూశారు. సెప్టెంబర్ 11వ తేదీ […]

  • By: Somu    latest    Sep 18, 2022 11:16 AM IST
పొట్టపై కాలితో నొక్కి గర్భిణీ డెలివరీ.. నర్సుల తీరుపై విమర్శలు

విధాత, నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ప్రసవం కోసం చేరిన గర్భిణీ వైద్యుల, నర్సుల నిర్లక్ష్యంతో మృతి చెందిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామానికి చెందిన శిరస్సు అఖిల(21) ప్రసవం నిమిత్తం నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సెప్టెంబర్ 9వ తేదీన అడ్మిట్ కావడం జరిగింది. సాధారణ కాన్పు కోసం వేచిచూశారు.

సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచి నొప్పులు ప్రారంభం కావడంతో అక్కడ ఉన్న డ్యూటీ డాక్టర్లు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించి నర్సులకు కాన్పు బాధ్యత చూడమన్నారు. గర్భంలో ఉన్న నాలుగు కేజీల మగ శిశువు జననం సాధారణ ప్రసవం ద్వారా సాధ్యం కాదని తెలిసి కూడా గర్భిణీ పొట్టపై బలవంతంగా కాలితో నొక్కి నర్సులు డెలివరీ చేశారు.

నొప్పులధికమై గర్భిణీ కేకలు వేయగా పడుకునేటప్పుడు తెలియదా ఇప్పుడు అరుస్తావ్ ఎందుకు అంటూ బలవంతపు కాన్పు చేశారు. దాంతో ఆమెకు అధిక రక్తస్రావమైనది. బాబుకు జన్మనిచ్చిన తరువాత కూడా తల్లికి అధిక రక్తస్రావం అవుతున్న విషయాన్ని గర్భిణీ అత్త నర్సులకు చెప్పినప్పటికి వారు మోబైల్‌ చూస్తూ పట్టించుకోలేదు.

బాధితురాలి భర్త వచ్చి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేయగా ఆయన డ్యూటీ డాక్టర్‌ను మందలించారు. గర్భంపైన అధిక ఒత్తిడి చేయడంతోనే గర్భ సంచి పేగు పగిలిపోయిందని అందుకే ఎక్కువ రక్తస్రావం అయిందని బాధిత కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టారు. వైద్యులు గర్భసంచి తొలగించినా రక్తస్రావం ఆగకపోవడంతో ఐసీయూకు తరలించారు.

అక్కడి నుంచి రెండు రోజుల తర్వాత హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించగా ఆమె పరిస్థితి విషమించి సెప్టెంబర్ 16 రాత్రి 12 గంటలకు మరణించినట్లు గాంధీ వైద్య బృందం ధ్రువీకరించింది. గర్భిణీ మరణానికి పూర్తిగా ఆసుపత్రి వైద్యులు, నర్సుల నిర్లక్ష్య వైఖరి కారణమని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ అమానుష ఘటనపై కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి ప్రభావతి తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు పందుల సైదులు మాట్లాడుతూ గైనకాలజీ వార్డులో గత కొంతకాలంగా సిబ్బంది వైద్యులు అనుసరిస్తున్న తీరు పట్ల రోగులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నరన్నారు.

పేషెంట్లను వారి బంధువులను సిబ్బంది నానాబూతులు తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేసే వైద్యం కన్నా మొబైల్ ఫోన్లలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటున్నారని అక్కడి రోగులు బంధువులు తరుచూ చెబుతూ ఉన్నారన్నారు.

హాస్పటల్ సూపరింటెండెంట్ గైనకాలజీ వార్డుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వైద్యుల నర్సుల నిర్లక్ష్యం వైద్యానికి బలైన వారిలో ఈ కేసు మొదటిది కాదు చివరిది కాదని, గతంలోనూ అనేకం జరిగాయన్నారు.

డాక్టర్ల నిర్లక్ష్య వైద్యంపై సమగ్రమైన విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత మహిళ కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, పుట్టిన బాబుకు ప్రభుత్వమే పూర్తిగా భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.గర్భిణీ భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.