కొత్త తరహా సైబర్ మోసానికి తెర తీసిన ఓ టెకీ.. పోలీసు డేటాబేస్ నుంచే సమాచారం చోరీ
ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్ (Cyber Crime) నేరగాళ్లు మోసాలు చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు.

విధాత: ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్ (Cyber Crime) నేరగాళ్లు మోసాలు చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటూనే ఉన్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ నివ్వెరపడే పనులు చేస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లో తాజాగా జరిగిన ఒక సైబర్ మోసం.. పోలీసులనే అవాక్కయ్యేలా చేసింది. 28 ఏళ్ల ఒక టెకీ (Con Man).. పోలీసు డేటాబేస్‌లోని పిల్లల కిడ్నాప్ అయిన వారి వివరాలను దొంగిలించాడు.
అనంతరం వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంత సొమ్ము ముట్టజెబితే మీ పిల్లలను మీకు అప్పగిస్తామంటూ నమ్మించాడు. ఇలా అతడు 950 మందిని మోసం చేయగా.. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పట్టుబడ్డాడు. దిల్లీకి చెందిన ఓ యువతి కొన్నేళ్ల క్రితం అదృశ్యమైంది. రెండు మూడు నెలల క్రితం ఆ యువతి తండ్రికి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. మీ అమ్మాయి దొరికిందని.. అక్కడకు పంపడానికి రూ.8 వేలు కావాలని అడిగాడు.
దీంతో ఆనందపడిన ఆ కుటుంబం దుండగుడు పంపిన క్యూ ఆర్ కోడ్‌కు అడిగిన మొత్తం పంపారు. ఆ తర్వాత అమ్మాయి జాడా లేదు. ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తీ సంప్రదించలేదు. దీంతో అనుమానం వచ్చిన సదరు తండ్రి.. గత నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు తీగ లాగడంతో డొంకంతా కదిలి ఈ భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
వేగంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ శ్యాంసుందర్ చౌహాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అని పేర్కొన్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు అతడు తెలివిగా తక్కువ మొత్తాలను మాత్రమే చెల్లించాలని డిమాండ్ చేసేవాడని పోలీసులు తెలిపారు. రూ.2 వేల నుంచి రూ.40 వేల వరకు బాధితుల స్థితిగతులను బట్టి అడిగేవాడని వెల్లడంచారు.
కొన్ని సార్లు పోలీసు అధికారులుగా, మరికొన్ని సార్లు కిడ్నాపర్లులా నిందితులు చెప్పుకునేవారన్నారు. ఇతడి చేతిలో మోసపోయిన వారు ఇంకా బయటకు రావాల్సి ఉందని… రోజూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని నార్త్ దిల్లీ డిప్యూటీ కమిషనర్ మనోజ్ కుమార్ మీనా పేర్కొన్నారు. శ్యాంనే కాకుండా ఇంకా కొంత మందిని అదుపులోకి తీసుకున్నామని వారివద్ద అదృశ్యమైన పిల్లలు, వారి తల్లిదండ్రుల నంబర్లు, పేర్లు ఉన్న డేటాను సేకరించామన్నారు.