బీజేపీతోనే తెలంగాణలో కాంగ్రెస్‌కు ముఖాముఖీ: దీపాదాస్ మున్షీ
బీజేపీతోనే కాంగ్రెస్‌కు రానున్న లోక్సభ ఎన్నికల్లో పోరు జరిగే పరిస్థితి కనిపిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు

- బీఆరెస్, బీజేపీల నుంచి వలసల క్యూ రెడీ
- రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ
విధాత : తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో గత లోక్ సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన బీజేపీతోనే కాంగ్రెస్‌కు రానున్న లోక్ సభ ఎన్నికల్లో ముఖాముఖీ పోరు జరిగే పరిస్థితి కనిపిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఇతర పార్టీలతో పొత్తు లేకుండానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే అవకాశముందన్నారు.
బీజేపీ, బీఆరెస్ సహా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వస్తామంటూ నేతలు క్యూ కడుతున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ బలహీనంగా కనిపించినా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయన్నారు. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్ ఎంఐఎం పార్టీలు నేరుగా పొత్తులు పెట్టుకోకపోయినా, పరోక్షంగా కలిసి పని చేశాయన్నారు.
అయినా సరే తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారన్నారు. మా పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే లోక్‌సభ ఎన్నికలకు వెళ్తుందని, ఎన్నికల్లో గెలుపొందిన తర్వాతే ప్రధాని ఎవరన్నది నిర్ణయిస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల్లో గెలుపొందామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. లబ్ధిదారులను గుర్తించే కార్యక్రమం త్వరలో చేపట్టబోతున్నామని, ఇందుకోసం ప్రజా పాలన గ్రామసభలు ప్రభుత్వం నిర్వహించబోతుందన్నారు.
గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి మాకు అప్పగించిందని, అయినా సరే హామీలను అమలు చేసే విషయంలో వెనక్కి తగ్గబోమన్నారు. కాంగ్రెస్‌లోనే అంతర్గత విబేధాలు, భిన్నాభిప్రాయాలు ఉంటాయనుకోవద్దని, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయన్నారు. ఎన్ని భేదాభిద్రాయలున్నా ఎన్నికల సమయంలో అందరూ ఒకటవుతారన్నారు. వంద రోజుల్లోపు చెప్పినట్టుగా అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. లోక్ సభ సీట్లు ఎన్ని సాధిస్తామన్నది లక్ష్యంగా పెట్టుకొకపోయినా, ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు.