ప‌ద‌విని త్య‌జించిన డెన్మార్క్ మ‌హారాణి.. జ‌న‌వ‌రి1న అనూహ్య ప్ర‌క‌ట‌న

డెన్మార్క్ ప్ర‌జ‌ల‌కు ఆ దేశ మ‌హారాణి షాక్ ఇచ్చారు. ఈ నెల 14వ తేదీ త‌ర్వాతి నుంచి తాను పీఠంపై ఉండ‌బోన‌ని ప్ర‌క‌టించారు

ప‌ద‌విని త్య‌జించిన డెన్మార్క్ మ‌హారాణి.. జ‌న‌వ‌రి1న అనూహ్య ప్ర‌క‌ట‌న

విధాత‌: డెన్మార్క్ (Denmark Queen) ప్ర‌జ‌ల‌కు ఆ దేశ మ‌హారాణి షాక్ ఇచ్చారు. ఈ నెల 14వ తేదీ త‌ర్వాతి నుంచి తాను పీఠంపై ఉండ‌బోన‌ని ప్ర‌క‌టించారు. 52 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు మ‌హారాణిగా దేశాన్నిపాలించిన క్వీన్ మార్గ‌రెట్ 2 ఈ మేర‌కు వెల్ల‌డించారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1 ముందురోజు ఆదివారం సాయంత్రం ఇచ్చిన‌ టీవీ సందేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ విష‌యాన్ని పేర్కొన్నారు.


అనంత‌రం త‌న పెద్ద కుమారుడు ఫ్రెడ్రిక్ రాజ్య పాల‌న చేప‌డ‌తాడ‌ని 60 ల‌క్ష‌ల మంది టీవీ చూస్తుండ‌గా ప్ర‌క‌టించారు. 83 ఏళ్ల క్వీన్ మార్గ‌రెట్ 2.. 1972లో డెన్మార్క్ రాణిగా బాధ్య‌త‌లు చేపట్టారు. వ‌య‌సు పైబ‌డ‌టం, 2023లో వెన్నుకు శ‌స్త్రచికిత్స అయిన నేప‌థ్యంలో విశ్రాంతి తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు రాజీనామా ప్ర‌క‌ట‌న‌లో ఆమె వెల్ల‌డించారు.


శ‌స్త్రచికిత్స నాలో ఒక ప్ర‌శ్న‌ను లేవ‌నెత్తింది. ప‌ద‌వీ బాధ్య‌త‌ల‌ను త‌ర్వాతి త‌రానికి అప్ప‌గించాల‌ని భావించా. దానికి ఇదే స‌రైన స‌మ‌యం. జ‌న‌వ‌రి 14తో నేను రాణిగా ప‌ట్టాభిషిక్తురాలై 52 ఏళ్లు పూర్త‌వుతుంది. అదే రోజు రాజ్య పాల‌న బాధ్య‌త‌ను నా పెద్ద కుమారుడికి అప్ప‌గిస్తా అని మార్గ‌రెట్ 2 పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా రాణిగా మార్గ‌రెట్ సేవ‌ల‌ను డెన్మార్క్ ప్ర‌ధాని మెట్టె ఫ్రెడ్రిక్స‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.


రాచ‌రిక పీఠంపై అధికార మార్పిడి జ‌ర‌గ‌డానికి స‌మ‌యం వ‌చ్చింద‌న్న భావ‌నను జీర్ణం చేసుకోవ‌డం క‌ష్ట‌మే. క్వీన్ విక్టోరియా డెన్మార్క్‌కు ఒక శిఖ‌ర స‌మానురాలిగా ఉండేవారు. ఈ దేశ ప్ర‌జ‌ల భావాల‌కు ఒక రూపంగా క‌నిపించేవారు అని ఆయ‌న త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. డెన్మార్క్‌కు ఒక‌ప్ప‌టి మ‌హారాజు ఫ్రెడ్రెక్ 9, క్వీన్ ఇంగ్రిడ్‌ల‌కు 1940లో క్వీన్ మార్గ‌రెట్ జ‌న్మించారు.


ఎంతో చురుకైన ఎత్తులు, దౌత్య‌ప‌ర‌మైన నైపుణ్యం ఉండ‌టంతో ఆమె త‌న ప్ర‌జ‌ల‌, రాచ‌రిక కుటుంబ స‌భ్యుల మ‌ద్ద‌తను ఎప్పుడూ కోల్పోయే ప‌రిస్థితి తలెత్త‌లేదు. ఆర్కియాల‌జీపై ఆస‌క్తి ఉండ‌టంతో ప‌లు త‌వ్వ‌కాల్లోనూ ఆమె పాల్గొన్నారు. 31 ఏళ్ల వ‌య‌సులో 1953లో ఆమె త‌న తండ్రి నుంచి సామ్రాజ్ఞిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 1967లో ఫ్రాన్స్ దౌత్య‌వేత్త హెన్రీ డె మోంజెపాట్‌ను వివాహ‌మాడారు. వీరికి యువరాజు ఫ్రెడ్రిక్‌, జోకిమ్‌లు జ‌న్మించారు.


బ్రిట‌న్ మ‌హారాణి క్వీన్ ఎలిజ‌బెత్ 2.. 2023 సెప్టెంబ‌ర్‌లో మ‌ర‌ణించ‌డంతో.. యూర‌ప్‌లో అత్యంత పెద్ద వ‌య‌స్కురాలైన సామ్రాజ్ఞిగా మార్గ‌రెట్‌ను చెప్పుకొనేవారు. ఇప్పుడు ఆవిడ కూడా బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గ‌డంతో ఒక త‌రం మ‌హారాణుల క‌థ ముగిసింద‌నే చెప్పాలి. యూర‌ప్ దేశాలలో వాస్త‌వాధికారాలు ప్ర‌జ‌ల‌చే ఎన్నుకోబ‌డిన పార్ల‌మెంటు చేతిలోనే ఉంటాయి. రాజ‌కీయాల‌కు అంట‌కుండా దేశానికి ప్రాతినిధ్యం వ‌హించ‌డం, సంప్ర‌దాయాల‌ను సంర‌క్షించ‌డం, దేశ విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేయ‌డం రాచ‌రిక కుటుంబాల బాధ్య‌త‌గా ఉంటూ వ‌స్తోంది.