రాష్ట్ర మంతటా ప్రజాదర్భార్‌లు: డిప్యూటీ సీఎం భట్టి
ప్రజా దర్బార్ లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు

- ప్రత్యేక అధికారుల నిమాయకం
- ప్రతి వ్యవస్థ తమ కోసం ఉందనే నమ్మకాన్ని కలిగిస్తాం
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సరైన త్వరలో శ్వేత పత్రం
- బీఆరెస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలే
- మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
విధాత: ప్రజా దర్బార్ లు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం ఆయన ఖమ్మం జిల్లాలోని మధిరలో మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన వినతులపై తిరిగి సమాధానాలు స్పష్టంగా ప్రజలకు అందించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని తెలిపారు. గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగా, జవాబుదారీగా లేకుండా గ్రీవెన్స్ నిర్వహించాయని, ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయలేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని భట్టి స్పష్టం చేశారు.
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ మొదలుకొని గ్రామస్థాయి అధికారి వరకు ప్రజల కోసం పని చేసే విధంగా, ప్రతి వ్యవస్థ ప్రతి కార్యాలయం నాకోసమే ఉందని ఈ రాష్ట్ర ప్రజలకు నమ్మకాన్ని కల్పించడమే మా ప్రభుత్వం ముందున్న కర్తవ్యమన్నారు. ప్రభుత్వంలోని ప్రతి వ్యవస్థ, సంస్థలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజల కోసం మాత్రమే అధికారులు పనిచేయాలన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన అత్యంత పవిత్రమైన భారత రాజ్యాంగాన్నీ స్ఫూర్తిగా తీసుకుని అధికారులు ప్రజలకు సేవలు అందించాలన్నారు.
త్వరలో శ్వేతపత్రం
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై త్వరలోనే శ్వేత పత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 2014 ముందు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు, 2023 వరకు బీఆరెస్ ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై శ్వేత పత్రం సిద్ధం చేస్తున్నామన్నారు. నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం కోసం తెలంగాణ సమాజం కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకుంద న్నారు. పది ఏళ్ల బీఆరెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చక పోగా ఉన్న స్వేచ్ఛని సైతం హరించిందన్నారు.
బీఆరెస్ పాలనలో వనరుల దుర్వినియోగం, పాలన అస్తవ్యస్తం, సంపద దోపిడీకి గురి కావడం, సంస్థలు వ్యవస్థలు నిర్వీర్యం, విచ్ఛిన్నం అయ్యాయని తెలిపారు. భారత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత వ్యవస్థీకృతమైన సమాజాన్ని బీఆరెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసి 70 సంవత్సరాల వెనుక ఉన్న ఆర్థిక అసమానతలు కలిగిన ఫ్యూడల్ సమాజాన్ని నిర్మించిందన్నారు. పది సంవత్సరాల బీఆరెస్ పరిపాలనలో జరిగిన కుట్రపూరితమైన పాలనకు ఇక చరమగీతం పాడుతున్నామన్నారు.