మూవీ పేరు: ధమాకా విడుదల తేదీ: 23 డిసెంబర్, 2022 నటీనటులు: రవితేజ, శ్రీలీల, రావు రమేష్, జయరామ్, అలీ, హైపర్ ఆది, సచిన్ ఖేడ్కర్, పవిత్రా లోకేష్ తదితరులు సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్ దర్శకత్వం: త్రినాథరావు నక్కిన DHAMAKA: మాస్ మహారాజా ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో. ఆయనతో సినిమా […]
మూవీ పేరు: ధమాకా
విడుదల తేదీ: 23 డిసెంబర్, 2022
నటీనటులు: రవితేజ, శ్రీలీల, రావు రమేష్, జయరామ్, అలీ, హైపర్ ఆది, సచిన్ ఖేడ్కర్, పవిత్రా లోకేష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని,
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి,
కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ,
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన
DHAMAKA: మాస్ మహారాజా ఒకప్పుడు మినిమమ్ గ్యారంటీ హీరో. ఆయనతో సినిమా చేస్తే.. అది ఎలాంటి టాక్ వచ్చినా.. సేఫ్ జోన్లో ఉండవచ్చనే ధీమా నిర్మాతలలో ఉండేది. అలాగే రవితేజ సినిమాలు కూడా ఆడేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కంటెంట్ నచ్చితేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. రవితేజ మాత్రం.. కంటెంట్ పక్కనెట్టి, తన రెమ్యూనరేషన్ తనకి వస్తే చాలు అనేలా.. కథ కూడా చూసుకోకుండా ఎడాపెడా సినిమాలు చేసేస్తున్నాడు. దీంతో వరుస పరాజయాలు ఆయనని పలకరిస్తున్నాయి.
ఓ ఐదారు పరాజయాల తర్వాత ‘క్రాక్’ రూపంలో రవితేజకు బంపర్ హిట్ వచ్చింది. ఆ తర్వాత కూడా ఆయన మారలేదు. ఆ సినిమా తర్వాత వచ్చిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలు రవితేజని, అతని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. అందుకే ఆయనకి, ఫ్యాన్స్‌కి అర్జెంట్‌గా హిట్ కావాలి. మాములు హిట్టు కాదు.. ‘ధమాకా’ హిట్ ఇవ్వబోతున్నాం అనేలా.. కొన్ని రోజులుగా ఈ ‘ధమాకా’కు సంబంధించి ప్రచార కార్యక్రమాలు నడుస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవికి ‘రౌడీ అల్లుడు’ సినిమా ఎలాగో.. రవితేజకు ఈ సినిమా అలా అవుతుందని మేకర్స్ చెబుతున్న మాటలు, టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటించడం, ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఆకర్షించడంతో.. ఖచ్చితంగా రవితేజకు ‘ధమాకా’ హిట్ రాబోతుందనేలా.. సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లారు. మరి ఆ ‘ధమాకా’ హిట్‌ని ఈ ‘ధమాకా’ ఇచ్చిందా? రవితేజ ఫ్యాన్స్‌ని ఖుషి చేసిందా? రవితేజ పరాజయాల పరంపరకు బ్రేక్ పడిందా? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. మన సమీక్ష పూర్తిగా చదవాల్సిందే. ముందుగా కథేంటో తెలుసుకుందాం.
కథ:
చిరంజీవి దొంగ మొగుడు, రౌడీ అల్లుడు మిక్స్ కొట్టి ‘అల వైకుంఠపురములో’కి కనెక్ట్ చేస్తే ఏమి వస్తుందో.. అదే ‘ధమాకా’. ఏం అర్థం కాలేదు కదా.. సరే కథలోకి వద్దాం. పీపుల్ మార్ట్ అధిపతి నందగోపాల్ చక్రవర్తి (సచిన్ ఖేడ్కర్) ఇంకొన్ని రోజుల్లో చనిపోతున్నానని ప్రకటించి.. తన కుమారుడి ఆనంద్ చక్రవర్తి (రవితేజ)కి పగ్గాలు ఇచ్చేందుకు సిద్ధమవుతాడు. తన కనుసన్నల్లో ఉన్న కంపెనీలన్నింటిని హస్తగతం చేసుకునే ‘జేపీ ఆర్బిట్’ అధినేత జేపి (జయరామ్) కన్ను.. పీపుల్ మార్ట్‌పై పడుతుంది.
ఎలాగైనా ఆ కంపెనీని హస్తగతం చేసుకోవాలనే జేపీ పన్నాగాల నుంచి.. ఆనంద్ చక్రవర్తి ఎలా తప్పించుకున్నాడు? ఎలా తన కంపెనీని కాపాడుకున్నాడు? దీనికోసం సేమ్ టు సేమ్ తనలాగే ఉన్న స్వామి (రవితేజ) సహాయాన్ని ఆనంద్ చక్రవర్తి తీసుకుంటాడు. ఆ స్వామి ఎవరు? ఒకేలా ఉన్న ఆనంద్, స్వామిలని ఏకకాలంలో ప్రేమించిన ప్రణవి(శ్రీలీల) ఆ ఇద్దరితో ఎన్ని పాట్లు పడింది? చివరికి ఆమె ఎవరిని దక్కించుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ‘ధమాకా’ని థియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:
నటీనటుల్లో ముందుగా రవితేజ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. ఇలాంటి పాత్రలు రవితేజకు కొత్తేం కాదు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయినా, హిట్ అయినా.. రవితేజ ఎఫర్ట్‌లో మాత్రం ఏ మాత్రం తేడా ఉండదు. తన నుంచి 100 శాతం సినిమాకు ఏం కావాలో అది అందిస్తాడు. ఈ సినిమాలో కూడా రవితేజ ఎక్కడా తగ్గలేదు. ఆనంద్, స్వామి రెండు పాత్రలను తన నటనతో అరిపించేశాడు. మాస్ రాజా యాక్షన్‌లోకి దిగితే ఎంటర్టైన్మెంట్కి లోటుండదని మరోసారి క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన హుషారైన నటన.. చాలా చోట్ల ఆడియన్స్‌తో క్లాప్స్ కొట్టిస్తుంది.
శ్రీలీల అందానికి అందం, డ్యాన్స్‌కి డ్యాన్స్. అభినయం పరంగా ఇంకాస్త ఎఫర్ట్ పెట్టాలి. డ్యాన్స్‌లో మాత్రం ఇరగ్గొట్టేసింది. అయితే ఆమె పాత్రకు మాత్రం అంతగా ఇంపార్టెన్స్ లేదనే చెప్పుకోవాలి. రావు రమేష్, హైపర్ ఆది జోడి.. చూస్తున్న ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తారు. అలీ, ప్రవీణ్ వంటి వారు కూడా నవ్వించడానికి ట్రై చేశారు. ఇంకా ఇతర పాత్రలలో జయరామ్ పాత్ర.. ‘అల వైకుంఠపురములో’ పాత్రకి నెగిటివ్ షేడ్స్ ఇస్తే ఎలా ఉంటుందో.. అలా అదే పాత్ర కంటిన్యూ అయినట్లుగా అనిపిస్తుంది. ఆయన పాత్రకి కూడా పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పుకోవాలి. ఇంకా సచిన్ ఖేడ్కర్, తులసి, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేష్ వంటి వారు.. వారి పాత్రల పరిధి మేర నటించారు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..
ఈ సినిమాకి కార్తీక్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ, భీమ్ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలెట్ అని చెప్పుకోవాలి. డ్యాన్స్ కూడా బాగుంది. ఎడిటింగ్ పరంగా ఇంకాస్త ఎఫర్ట్ పెట్టే ఛాన్స్ ఉంది. కొన్ని ల్యాగింగ్ సీన్స్‌కు కత్తెర వేసినట్లు అయితే.. సినిమా ఇంకాస్త క్రిస్ప్‌గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది. ఫైట్స్ బాగున్నాయి. ఇక ఈ సినిమాకు ప్రసన్న కుమార్ అందించిన కథ రొటీన్‌గా ఉంది. అలాగే ఆయన రాసిన డైలాగ్స్ మాత్రం అక్కడక్కడా బాగా పేలాయి. దర్శకత్వం విషయానికి వస్తే.. ఇందులో త్రినాథరావు నక్కిన చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి కథలు.. కాదు కాదు.. ఇదే కథతో వచ్చిన సినిమాలను ఎన్నో తెలుగు ప్రేక్షకులు చూసి ఉన్నారు. ఇదే కథని, రవితేజ వంటి హీరోతో ఇంకాస్త కొత్తగా ట్రై చేసే ఛాన్స్ ఉన్నా.. కేవలం రవితేజ మాస్ ఇమేజ్ పైనే ఆయన ఆధార పడినట్లుగా అనిపించింది. కమర్షియల్ అంశాలైతే జోడించారు కానీ.. కొత్తదనం మాత్రం ఆయన ఇవ్వలేకపోయారు.
విశ్లేషణ:
‘దొంగమొగుడు’ సినిమాలో రావు గోపాలరావు అండ్ టీమ్ చిరంజీవి బట్టల వ్యాపారాన్ని నాశనం చేయడానికి, తమ సొంతం చేసుకోవడానికి ఎలాంటి కుయుక్తులు పన్నుతారో.. అలాంటి నేపథ్యంలోనే ఈ సినిమా నడుస్తుంది. పాత్రల తీరుతెన్నులు కూడా అలాగే నడుస్తాయి. కాకపోతే ఇక్కడ కాస్త కమర్షియల్ వే లో ఆలోచించారు అంతే. సినిమా చూస్తున్నంత సేపూ.. రౌడీ అల్లుడు ఏమోగానీ.. ‘అజ్ఞాతవాసి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు అస్తమానం గుర్తొస్తుంటాయి. అయితే రవితేజ మార్క్ కామెడీ.. అలాగే రావు రమేష్-ఆదిల కామెడీ.. చూస్తున్న ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇస్తుంది.
హీరోయిన్ పాయింట్ ఆఫ్ వే లో అయితే.. పరమ రొటీన్‌గా నడిపించారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఫార్మెట్ అయిన.. ఒక సీన్, ఫైట్, పాట అన్నట్లుగా సినిమా నడిచింది. ఇద్దరు రవితేజలతో ఫుల్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మెట్‌తో సినిమాని నడిపించారు తప్ప.. కొత్తదనంగా మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాస్త కొత్తగా అనిపించే ఇద్దరు హీరోల బ్యాక్‌గ్రౌండ్ స్టోరీని కూడా సింపుల్‌గా తేల్చేశారు. పైగా అందులో లాజిక్ అస్సలు అర్థం కాదు. స్టోరీ కూడా ముందే తెలిసిపోతుంది.. మధ్య మధ్యలో కొన్ని సీన్లు మరీ సాగదీతగా అనిపిస్తాయి.
కాకపోతే.. ‘క్రాక్’ తర్వాత వచ్చిన రవితేజ చిత్రాల కంటే మాత్రం ఈ సినిమా బెటర్‌గా ఉందని చెప్పుకోవచ్చు. అందుకు శ్రీలీల కూడా ఓ కారణం. అయితే కథ, కథనం పరంగా మాత్రం అవుట్ డేటెడ్ అని చెప్పుకోవాలి. క్లైమాక్స్ కూడా సింపుల్‌గా తేల్చేశారు. సాంగ్స్, ఫైట్స్, శ్రీలీల గ్లామర్, రవితేజ మార్క్ యాక్షన్, కామెడీ కోసం ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు. మొత్తంగా.. కొత్తదనంగా ఫీలయ్యే కథేం లేదు కానీ.. ఎంటర్టైన్మెంట్ పరంగా మాత్రం లోటుండదు. అయితే రవితేజకి కావాల్సిన హిట్ అయితే మాత్రం ఇది కాదనే చెప్పుకోవాలి.
ట్యాగ్‌లైన్: నాట్ ధమాకా.. ఇట్స్ ఆర్డినరీ!
రేటింగ్: 2.5/5