Medak | బీఆరెస్‌లో రచ్చకెక్కిన విబేధాలు.. తడిబట్టలతో పోటాపోటీ ప్రమాణాలు
Medak అవినీతికి పాల్పడలేదంటూ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ప్రమాణం భూకబ్జాలు చేశారంటూ అసమ్మతి నేతలు పద్మను ఓడించి తీరుతామని శపథాలు విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గ బీఆరెస్‌లో విబేధాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వర్గం, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్గం బుధవారం ఏకంగా ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా మంజీర నదిలో స్నానం చేసి.. తడిబట్టలతో ప్రమాణం చేశాయి. ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డిపై […]

Medak
- అవినీతికి పాల్పడలేదంటూ ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డి ప్రమాణం
- భూకబ్జాలు చేశారంటూ అసమ్మతి నేతలు
- పద్మను ఓడించి తీరుతామని శపథాలు
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: మెదక్ నియోజకవర్గ బీఆరెస్‌లో విబేధాలు రచ్చకెక్కాయి. గత కొంతకాలంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వర్గం, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్గం బుధవారం ఏకంగా ఏడుపాయల వనదుర్గామాత సాక్షిగా మంజీర నదిలో స్నానం చేసి.. తడిబట్టలతో ప్రమాణం చేశాయి.
ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్‌రెడ్డిపై తాము చేసిన అవినీతి ఆరోపణలకు కట్టుబడి ఉన్నామంటూ బీఆరెస్ ముఖ్య నాయకులు.. చిన్నంపేట సర్పంచ్ రాజిరెడ్డి, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్, బీఆరెస్ విద్యార్థి విభాగం నాయకుడు జీవన్ రావు తదితరులు తడిబట్టలతో ప్రమాణం చేయగా.. వారు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, తాను నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని దేవేందర్‌రెడ్డి సైతం తడిబట్టలతో అమ్మవారి ముందు ప్రమాణం చేయడం సంచలనం రేపింది.
రాజిరెడ్డి, గంగా నరేందర్, జీవన్ రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, ఎవరో కుట్రపూరితంగా వారి వెనుక ఉండి ఆడిస్తున్నారని పరోక్షంగా మైనంపల్లి హనుమంతరావును ఉద్దేశించి దేవేందర్‌రెడ్డి ఆరోపించారు. సామాజిక సేవ పేరుతో చారానా ఖర్చు చేసి.. బారానా ప్రచారం చేసుకుంటున్నారని హనుమంతరావు కొడుకు రోహిత్‌ను ఉద్దేశించి మండిపడ్డారు.
తాము నిరుద్యోగులకు డ్రైవింగ్ లైసెన్సులు ఇప్పించామని, కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెటీరియల్ ఇచ్చి కోచింగ్ ఇప్పంచడంతోపాటు.. భోజనాలు కూడా పెట్టామని, ఇది కూడా సామాజిక సేవేనని పేర్కొన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ దుర్గమ్మ సన్నిధిలో తడిబట్టలతో ప్రమాణం చేశారు.
దేవేందర్‌రెడ్డి కబ్జాకోరు..
ఎమ్మెల్యే పద్మ భర్త దేవేందర్ రెడ్డి నియోజకవర్గంలో భూకబ్జాలకు పాల్పడ్డారని, తనపైనే 22 అక్రమ కేసులు పెట్టించారని బీఆరెస్ అసమ్మతినేత, చిన్న శంకరం పేట సర్పంచ్ రాజిరెడ్డి ఆరోపించారు. రాజిరెడ్డితోపాటు.. గంగా నరేందర్, జీవన్‌రావు మంజీర నదిలో స్నానం చేసి.. తడిబట్టలతో ప్రమాణం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. స్వంత గ్రామం కోనాపూర్ సొసైటీ చైర్మన్‌గా ఉన్న దేవేందర్‌రెడ్డి.. 2.25 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆయన అవినీతిపై స్వయంగా ప్రభుత్వ అధికారే నివేదిక ఇచ్చారని తెలిపారు.
చిన్న శంకరం పేట మండలంలో దేవేందర్ రెడ్డి, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఏడు పాయల వన దుర్గామాత ఆలయం సన్నిధిలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అక్రమంగా ఒక్కొక్కరి నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేశారని అన్నారు. అ సొమ్ము ఏమైందని ప్రశ్నించారు. ఆలయ ఈవో సార శ్రీనివాస్‌ను దేవేందర్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారని చెప్పారు.
ఇరు వర్గాల బల ప్రదర్శన
తడిబట్టలతో ప్రమాణాల సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో బీఆరెస్‌లోని ఇరు వర్గాలూ బల ప్రదర్శనకు దిగాయి. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్ అనుచరులు భారీ బైక్‌ర్యాలీతో ఆలయం వద్దకు చేరుకున్నారు. అంతకు ముందే దేవేందర్‌రెడ్డి వర్గం వాహనాలు, బైకులతో ఆలయం వద్దకు చేరుకుని ప్రమాణం చేశారు. ఉభయ వర్గాలూ వస్తున్నట్టు సమాచారంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు వర్గాల వారు ఒకరికి ఒకరు తారసపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
పద్మకు టికెట్‌తో రాజుకున్న అసమ్మతి
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి సిటింగ్ కోటాలో మళ్లీ టికెట్ లభించడంతో నియోజకవర్గంలో అసమ్మతి రాజుకున్నది. ఇది రోజుకో రూపంలో సెగలు గక్కుతున్నది. సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేపై తిరుగుబాటు చేస్తున్నారు. టికెట్ కేటాయింపుపై పునః పరిశీలన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేటీఆర్ చెప్పినా, హరీశ్‌రావు చెప్పినా తగ్గేది లేదని, మెదక్‌లో రెబల్‌గా నిలబడి పద్మాదేవేందర్‌రెడ్డిని ఓడించి తీరుతామని అమ్మవారి సాక్షిగా ప్రకటించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి దారెటు?
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇటీవల తిరుమలలో మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే హనుమంతరావుతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. రోహిత్‌కు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పుకొంటున్నారు. అయినా రోహిత్ మెదక్ టికెట్ కోసం పట్టు పడుతున్నట్లు సమాచారం.
కుమారుని రాజకీయ జీవితం కోసం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పార్టీ మారేందుకైనా సిద్ధపడుతున్నట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేతలతో ఆయన మాట్లాడుతున్నట్లు సమాచారం. మైనంపల్లి నిర్ణయం కోసం ఆయన అనుచరులు ఎదురుచూస్తున్నారు.