Balagam | దిల్‌రాజు కంటగింపు.. ‘బలగం’ ఊరంతా చూడడంపై ఫైర్‌! పొలీసులకు ఫిర్యాదు

భావోద్వేగం కాదు.. కలెక్షన్లే ముఖ్యం విధాత‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ తెరకెక్కిన సినిమా బలగం. చిన్న సినిమా, తక్కు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని పెద్ద విజయాన్ని నమోదు చేసింది. బలమైన కథ ఉంటే దానికి స్టార్స్‌ ఎవరూ అక్కర లేదని మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా ప్రభావం తెలంగాణ ప్రజలపై ఎంతగా పడిందంటే ఈ నేపథ్యంలో పాత రోజులను గుర్తుకు చేస్తూ.. తెలంగాణలోని చిన్న గ్రామాల్లో […]

  • Publish Date - April 4, 2023 / 04:33 AM IST

భావోద్వేగం కాదు.. కలెక్షన్లే ముఖ్యం

విధాత‌: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ తెరకెక్కిన సినిమా బలగం. చిన్న సినిమా, తక్కు బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని పెద్ద విజయాన్ని నమోదు చేసింది. బలమైన కథ ఉంటే దానికి స్టార్స్‌ ఎవరూ అక్కర లేదని మరోసారి ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా ప్రభావం తెలంగాణ ప్రజలపై ఎంతగా పడిందంటే ఈ నేపథ్యంలో పాత రోజులను గుర్తుకు చేస్తూ.. తెలంగాణలోని చిన్న గ్రామాల్లో దండోరాలు వేసి మరి అక్కడి యువత, నాయకులు స్క్రీన్‌ లాంటి తెరలు కట్టి వీధుల్లో ప్రదర్శిస్తున్నారు. ఒక‌టి రెండు గ్రామాల్లో మొద‌లైన ఈ ట్రెండ్ ప్ర‌స్తుతం వంద‌ల సంఖ్య‌లో గ్రామాల‌కు విస్త‌రించింది.

ఈ సినిమాకు ప్రాణం క్లైమాక్సే. డైలాగులేమీ ఉండవు. ఇద్దరు బలగం బుడగ జంగాల పాట పాడుతూ.. కుటుంబ విలువలు, ఎవరి బాధ్యత ఏమిటి? అందరూ కలిసి ఉండాలనే వారి తండ్రి కోరికను నెరవేర్చడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నట్టు చెబుతారు. అది అందరీన కంటతడి పెట్టిస్తుంది. అందుకే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఏదో విధంగా కనెక్ట్‌ అయ్యింది.

అలా తాజాగా ఒక ఊరిలో ఆ సినిమా ప్రదర్శించగా.. జనమంతా భావోద్వేగానికి లోనయ్యారు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి అందరూ బోరున విలపిస్తున్న వీడియో ఒక నెటీజన్‌ నెట్టింట్‌లో షేర్‌ చేశాడు. బలగం సినిమా బాహుబలి కంటే ఎక్కువగా జనంలోకి చొచ్చుకుపోయిదని, ఇది ఇప్పట్లో ఆగేలా లేదని కామెంట్‌ పెట్టాడు. దీనికి ఈ సినిమా హీరో ప్రియదర్శి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెండు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నది. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఫీచర్‌ఫిల్మ్‌ సినిమాటోగ్రఫీ విభాగాల్లో లాస్‌ ఏంజిల్స్‌ సినిమాటోగ్రఫీ అవార్డులను అందుకున్నది. ఇవే కాకుండా తాజాగా బెస్ట్‌ డ్రామా ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో విభాగంలో ఒనికో ఫిల్మ్‌ అవార్డు (ఉక్రెయిన్) సొంతం చేసుకున్నది. తెలుగు సినిమా వేదిక నుంచి నంది అవార్డు కూడా వరించింది.

ఒకవైపు ఓటీటీ, మరోవైపు థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు వస్తున్నాయి. అయితే ప్రేక్షకులు ఈ సినిమా చూసి కంటనీరు పెడుతుంటే.. అది నిర్మాత దిల్‌ రాజుకు కంటగింపు అయినట్టు ఉన్నది.

ఇలా ఊరికి మొత్తానికి ఈ సినిమాని ఉచితంగా చూపించడంతో తమకు భారీ స్థాయిలో నష్టాలు వస్తాయంటూ దిల్ రాజు ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా అక్రమ ప్రదర్శనలను అడ్డుకోవాలని నిజామాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమాను డౌన్‌లోడ్ చేసుకుని ఊరంతా ఒక్క దగ్గర చూస్తుంటే.. దాని వల్ల థియేటర్లలో తనకు కలెక్షన్లు తగ్గాయని ఆయన వాపోతూ.. అట్లా పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి సినిమా ప్రదర్శిస్తే కాపీ రైట్‌ చట్టం కింద చర్యలు తీసుకుంటానని ఒకప్రకటన విడుదల చేశారు.

అయితే దిల్ రాజు ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఈ చిత్రం సక్సెస్ మీట్లలో ..‘ఈ సినిమాను డబ్బు కోసం తీయలేదు. మానవ సంబంధాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తీశాను’ అని దిల్ రాజు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ దెప్పిపొడుస్తున్నారు. తెలంగాణ సినిమాను ఆదరిస్తున్నామని, తెలంగాణ కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నామని మైకుల ముందే గొప్పలు చెప్పుకోవడం గాని అసలు ఆయన ఎంత కమర్షియల్‌ అన్నది ఆయన విడుదల చేసిన ప్రకటన చూస్తే అర్థమౌతుంది అంటున్నారు.