దిల్ రాజు తెచ్చిన తంటా.. మరోసారి అజిత్ vs విజయ్ వార్

దిల్ రాజు.. అది కోలీవుడ్ .. అక్కడ పప్పులుడకవ్! టాలీవుడ్‌లో లాగా ఏ ఎండకా గొడుగు కోలీవుడ్లో వీలు కాదు దిల్ రాజు అజిత్‌కు మించిన క్రేజ్ విజయ్ సొంతమని వివాదాస్పద వ్యాఖ్యలు అజిత్‌ అభిమానుల ఆగ్రహం విధాత‌: మన తెలుగులో అభిమానులకైనా నైతిక విలువలు ఉంటాయి గాని దర్శకనిర్మాత‌లకు ఉండవు. ఎందుకంటే అభిమానులు ఒక హీరోని అభిమానించడం మొదలుపెట్టిన తర్వాత దానినే అనుసరిస్తూ హిట్లు వచ్చినా.. ప్లాఫ్ లు వచ్చినా ఆయా హీరోకే తమ అండదండలు […]

దిల్ రాజు తెచ్చిన తంటా.. మరోసారి అజిత్ vs విజయ్ వార్
  • దిల్ రాజు.. అది కోలీవుడ్ .. అక్కడ పప్పులుడకవ్!
  • టాలీవుడ్‌లో లాగా ఏ ఎండకా గొడుగు కోలీవుడ్లో వీలు కాదు దిల్ రాజు
  • అజిత్‌కు మించిన క్రేజ్ విజయ్ సొంతమని వివాదాస్పద వ్యాఖ్యలు
  • అజిత్‌ అభిమానుల ఆగ్రహం

విధాత‌: మన తెలుగులో అభిమానులకైనా నైతిక విలువలు ఉంటాయి గాని దర్శకనిర్మాత‌లకు ఉండవు. ఎందుకంటే అభిమానులు ఒక హీరోని అభిమానించడం మొదలుపెట్టిన తర్వాత దానినే అనుసరిస్తూ హిట్లు వచ్చినా.. ప్లాఫ్ లు వచ్చినా ఆయా హీరోకే తమ అండదండలు ప్రకటిస్తారు.

కానీ మన దర్శక నిర్మాతలు అలా కాదు. వారు ఏ ఎండగా గొడుగు పడతారు. కనీసం ఎదుట మీడియా ఉందని, కామెంట్లను ప్రేక్షకులు వింటారు.. .చదువుతారనే కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే చాలా కాలంగా ఎవరైనా పరిశీలించుకోండి.

ఎవ‌రైనా దర్శకుడు లేదా నిర్మాతకు ఒక స్టార్ హీరో ఛాన్స్ ఇస్తే ఆ స్టార్ హీరోనే తమకు ఆరాధ్యదైవం అని, చిన్ననాటి నుండి ఆ హీరోకే తాము వీరాభిమానులమని, వారిని చూసే ఈ స్థాయికి వచ్చామని, వారు ఛాన్స్ ఇవ్వడంతో తమ జన్మ ధన్యమైందని భజన చేస్తూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. వెంటనే వేరే హీరోతో అవకాశం కావాల్సి వస్తే మరలా సేమ్. కొత్త స్టార్ హీరోకి అనుకూలంగా పైన చెప్పిన పాత భజన మ‌ర‌లా మొదలవుతుంది. కానీ తెలుగులో లాగా అన్నిచోట్ల ఈ పప్పులు ఉడకవు. కోలీవుడ్‌లో మరీను.

అక్కడి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకుల కంటే వీరాభిమానులు. ప్రతి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటారు. సమయం వచ్చినప్పుడు రివేంజ్ తీర్చుకుంటారు. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. మాట పొరపాటున రాకూడదు. ప్రస్తుతం దిల్ రాజుకు కోలీవుడ్ అభిమానుల నుండి ఆ విధమైన సెగ అంటుతోంది.

కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా ‘వారిసు’ సినిమా తీస్తూ.. దానిని తెలుగులో ‘వారసుడు’గా విడుదల చేస్తున్నాడు. ఆయ‌నేమో ఇది స్ట్రైట్ చిత్రం అన్న‌ట్లు బిల్డ‌ప్ ఇస్తాడు. విజయ్ మన హీరోనే అన్నట్లుగా మాట్లాడుతాడు. కానీ గతంలో ఒకప్పుడు దిల్ రాజే మన హీరోల చిత్రాలకు పండుగలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని.. తర్వాతే ఇతర భాషలని సూక్తులు చెప్పిన వ్యక్తి.

మన తెలుగు సినిమాలకు థియేటర్లు కేటాయించిన తర్వాతే ఇతర భాషల చిత్రాలకు కేటాయించాలనేది ఆయన చెప్పిన విద్యయే. దాన్నే నీవు చెప్పిన విద్యయే నీర‌జాక్ష అనవచ్చు. కానీ ఇప్పుడు సీన్‌ మారిపోయింది. మరోపక్క తెలుగులో సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా, నందమూరి నట‌సింహం బాలకృష్ణ ‘వీర సింహారెడ్డి’గా వస్తున్నారు. అదే సమయంలో వారసుడు కూడా విడుదల కానుంది.

మరోవైపు కోలీవుడ్‌లో దిల్ రాజు – విజయ్‌ వారసుడుకు పోటీగా అజిత్ నటించిన ‘తూనీవు’ చిత్రం ఉంది. అందరి పప్పులు ఎల్లకాలం ఉడకవ్. దిల్ రాజు ప‌రిస్థితి ప్ర‌స్తుతం బ్యాడ్‌. గత కొంతకాలంగా విషమ కాలం నడుస్తోంది. ఆయనపై వద్దన్నా వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఆయన ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతోంది. దాంతో ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాడు.

తాజాగా కూడా వారసుడు సమయం దగ్గర పడుతున్న సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా థియేటర్లపై స్పందించాడు. కోలీవుడ్‌లో విజయ్ నెంబర్ వన్ హీరో అని.. అజిత్‌కు మించిన క్రేజ్ విజయ్ సొంతమని కాబట్టి అజిత్ సినిమాకి మించి విజయ్ సినిమాకు థియేటర్లో కేటాయించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఆయన మాట్లాడుతూ అజిత్‌తో పోలిస్తే విజయ్ నెంబర్ వ‌న్‌. కనుక మొత్తం 800 థియేటర్లు ఉన్నాయని అందులో విజయ్‌కు 400 మాత్రమే ఇస్తామన్నారని.. కానీ అజిత్ సినిమాకు సమానంగా 400 కేటాయించడానికి ఒప్పుకోలేదని.. తన సినిమాకు 450 కావాలని డిమాండ్ చేసినట్టు మాట్లాడాడు.

ఇంకేముంది అజిత్‌ని తక్కువ చేసి మాట్లాడిన తీరు ఆయన అభిమానులకు ఆగ్రహానికి గురిచేసింది. గత కొంత కాలం నుంచే కాదు ఎప్పటినుంచో ఈ విషయంపై విజయ్, అజిత్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా యుద్ధం సాగిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేసుకుంటున్నారు.

ఒక హీరోని మరో హీరో ఫ్యాన్స్ దారుణంగా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో అవమానిస్తున్నారు. దిల్ రాజు చేసిన తాజా వ్యాఖ్యలు ఈ గొడవకు మ‌రింత ఆజ్యం పోసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా రజనీకాంత్ తర్వాత తమిళనాడులో నెంబర్ వన్ అనే మాటే ఉద్భవించదు. విజయ్, అజిత్ అందరికీ సమానమైన ఫాలోయింగ్ ఉంది. కానీ దిల్ రాజు ఏమో విజయ్ నెంబర్ వ‌న్ అని ప్రకటించాడు.

తాజాగా ఆయ‌న మరో ప్రొడక్షన్ హౌస్ స్థాపించి అందులో బలగం అనే సినిమా నిర్మిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మీరు మీడియా వాళ్ళు ఏదో ఒకటి గెలుకుతూనే ఉంటారు. ఇప్పుడు ఇక కెలక‌కండి.. ఆల్రెడీ కెలికింది చాలు అంటూ మాట్లాడాడు. అందుకు సంబంధించిన కామెంట్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

తాజాగా కూడా దిల్ రాజు మాట్లాడుతూ వివాదాలు నాకు ఇష్టం ఉండవు. ప్రేక్షకులకు మంచి సినిమా కోసమే పరితపిస్తాను అన్నాడు. నా ఇంటర్వ్యూ‌కు సంబంధించి 20 సెకండ్ల వీడియోను కట్ చేసి పోస్ట్ చేశారు. దానికి ముందు వెనుక ఇంకా మ్యాటర్ ఉంది. అది పూర్తిగా చూస్తే అందరికి అర్థమవుతుంది. ఇది నా విన్నపం అన్నాడు.

మరో ఇంటర్వ్యూలో ‘వారసుడు’ చిత్రాన్ని మొదట వంశీ పైడిపల్లి కథ చెప్పినప్పుడు మహేష్ బాబుతో చేయాలనుకున్నాం. మహేష్ మరో ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు. తర్వాత రామ్ చరణ్‌ని కలిసి క‌థ వినిపించాం… కానీ అప్పటికే ఆయన నా బ్యానర్లో దర్శకుడు శంకర్‌తో కాంబినేషన్లో సినిమా చేస్తున్నాడు. ఆ సమయంలో అల్లు అర్జున్, ప్రభాస్ కూడా బిజీగా ఉన్నారు.

దాంతో విజ‌య్‌ని కలిసి కథ చెప్పాం. కంటెంట్ నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చేశారు అని చెప్పాడు. అంటే మ‌హేష్‌, చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, ప్ర‌భాస్.. ఇలా అందరు బిజీగా ఉండ‌బ‌ట్టి ఖాళీగా ఉన్న విజ‌య్‌ను తీసుకున్నాడ‌న్న‌మాట‌! బీస్ట్ తర్వాత విజయ్ నటించిన చిత్రం ‘వార‌సుడు’. విజయ్ స‌రసన రష్మికా మందన్న సందడి చేయనుంది.

ఇక ఇప్పుడు విజయ్ నెంబర్ వన్ అన్న దిల్ రాజు.. రేపు అజిత్‌తో ఛాన్స్ వస్తే ఆయనే టాప్.. ఆయనని మించిన హీరో ఇండియాలో లేడంటాడు. ఇట్లా ఉంటాయి మన వారి పనులు. మరి ఇకనైనా దిల్‌ రాజు కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుంటుంది. టాలీవుడ్ కింగ్‌ని అని అనుకుంటే.. అది అన్ని చోట్ల వర్కవుట్ అవుతుందా..!