విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నోరు జారి ఆ తర్వాత నాలుక కరుచుకోవడం స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు అలవాటు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, ఘటనలలో ఇరుక్కోవడం ఆయనకు గ్రహపాటు. ఇతరత్రా వివాదాలను కొనితెచ్చుకునే స్వయంకృతాపరాధం ఆయనకు కొత్తేమీ కాదు. ఇటీవలనే ఒకటి, రెండు సీరియస్ ఆరోపణల నేపథ్యంలో రాజయ్య ఇబ్బందుల్లో పడ్డారు.
ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు
ఇటీవల ఎమ్మెల్యే రాజయ్య మహిళా సర్పంచ్ నుంచి లైంగిక వేధింపుల ఆరోపణకు గురయ్యారు. అది జరిగిన కొద్ది రోజులకు జరిగిన ఒక సమావేశంలో బోరున విలపించారు. తన అక్కాచెల్లెళ్ల ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడిందని కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే.
ప్రత్యర్థి పార్టీలు, సొంత పార్టీలోని తన వ్యతిరేకులు కుట్రపూరిత ఫలితంగానే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను ప్రజలింకా మరిచిపోక ముందే మరోసారి ఎమ్మెల్యే రాజయ్య స్టేషన్గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో నోరు జారారు.
బీఆర్ఎస్సే కాంగ్రెస్…కాంగ్రెస్సే బీఆర్ఎస్
ఎమ్మెల్యే రాజయ్య ఈసారి ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీని మరిచిపోయి తన పాత పార్టీ కాంగ్రెస్‌ను ఇంకా మర్చిపోలేదు అన్నట్లు మాట్లాడారు.
ఇక్కడ బీఆర్ఎస్.. అక్కడ బిఆర్ఎస్.. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్సే.. కాంగ్రెస్. కాంగ్రెస్సే.. బీఆర్ఎస్ అంటూ మాట్లాడారు. మనమంతా కెసిఆర్ కు అండగా నిలబడాలని, ఆయన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉందంటూ ఆవేశంగా సాగిన ఉపన్యాసంలో పై విధంగా ఉద్ఘాటించారు.
ఉపన్యాసంలో భాగంగా కాసింత ఉద్వేగానికి లోనైన రాజయ్య బీఆర్ఎస్ కు పెరిగిన ఆదరణ, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల నుంచి వస్తున్న స్పందన బ్రహ్మాండంగా ఉందంటూ తెలియజేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో టిఆర్ఎస్సే కాంగ్రెస్ అంటూ నోరు జారడంతో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన పార్టీ నాయకులు కేడర్ గందరగోళానికి గురయ్యారు.
రాజయ్య వ్యాఖ్యల పై విభిన్న స్పందన
రాజయ్య నోటి వెంట కాంగ్రెస్ పేరు రావడం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అనే రీతిలో మాట్లాడడం ఆశ్చర్యానికి లోను చేసింది. అయితే అనుకోకుండానే నోరు జారినట్లు ఆయన తర్వాత సన్నిహితుల దగ్గర చెప్పడం గమనార్హం.
ప్రత్యర్ధులు మాత్రం రాజయ్య బీఆర్ఎస్ నేతగా చాలా కాలమైనప్పటికీ ఇంకా ఆయన పాత పార్టీ కాంగ్రెస్‌ను మరిచిపోలేకపోతున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.
మరికొందరు మాత్రం రాజయ్యకు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకుంటే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తాననే సంకేతాలు ఇప్పుడే రాజయ్య ఇస్తున్నారని పార్టీలో ప్రత్యర్థి వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏది ఏమైనా వివాదాల్లో ఇరుక్కోవడం, నోరు జారడం రాజయ్యకు సాధారణ విషయంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.