విధాత: ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అప్పట్లో గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం భూములు ఇచ్చిన సినీ నిర్మాత అశ్వనీ దత్‌కు అప్పటి టిడిపి సర్కారు కౌలు చెల్లిస్తానని హామీ ఇచ్చింది.అయితే అది కొన్ని సాంకేతిక పరమైన అడ్డంకుల నేపథ్యంలో ఆ హామీ అమలు కాలేదు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు ఆయనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కౌలు చెల్లించాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం విమానాశ్రయం విస్తరణకు రైతుల నుంచి భూమిని సేకరించారు. దాదాపుగా 700 ఎకరాలు సేకరించి దాన్ని ఎయిర్‌పోర్టు అథారిటీకి అప్పగించారు. అయితే ముందు ఆ ప్రాంత రైతులు భూములు ఇవ్వడానికి ఒప్పుకోక పోవడంతో అమరావతి రాజధాని రైతులకు ఇచ్చినట్టే పరిహారంతో పాటు ఏటా కౌలు కూడా చెల్లిస్తామని చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చింది.
దీంతో ఆ 700 ఎకరాల భూ సేకరణ పూర్తి అయింది. ఇందులో భాగంగా నిర్మాత చలసాని అశ్వినీదత్ కూడా 39 ఎకరాలను విమానాశ్రయానికి ఇచ్చారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రైతులకు కౌలు చెల్లించడం ఆపేయగా అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో కోర్టు సదరు రైతులకు కౌలు ఎందుకు చెల్లించడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసింది. సాంకేతిక కారణాలు చెప్పి ఆలస్యం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాల ఇలాంటి వైఖరితోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మండిపడింది. విమానాశ్రయం విస్తరణ కోసం భూములు ఇచ్చిన వారికి ఎప్పటిలోగా కౌలు చెల్లిస్తారో చెప్పాలని రెవెన్యూ శాఖను హైకోర్టు ప్రశ్నించింది.
రెవిన్యూ శాఖ సమాధానం సంతృప్తిగా లేకపోతే తగిన ఆదేశాలు ఇస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఈ కేసును విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ధర్మాసనం భూ యజమానికి కౌలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
దీంతో ప్రభుత్వం మీద అశ్వనీదత్ విజయం సాధించినట్లయింది. చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి, చూడాలని ఉంది వంటి చిత్రాలు నిర్మించిన వైజయంతి మూవీస్ అధినేత అశ్వనీదత్ 2009లో ప్రజారాజ్యం తరఫున విజయవాడ నుంచి ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు.