231 మంది ఖైదీల ముంద‌స్తు విడుద‌ల‌

భార‌త‌దేశం 75వ గ‌ణ‌తంత్ర వేడుక‌లు జ‌రుపుకుంటున్న శుభ‌వేళ‌.. ప‌లువురు ఖైదీల‌కు శిక్ష‌లో ఉప‌శ‌మ‌నం ల‌భించింది

  • Publish Date - January 26, 2024 / 08:44 AM IST
  • జీవిత ఖైదీలు 212 మంది, ఇత‌ర ఖైదీలు 19
  • రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా శిక్ష‌లో ప్రత్యేక ఉపశమనం

విధాత‌: భార‌త‌దేశం 75వ గ‌ణ‌తంత్ర వేడుక‌లు జ‌రుపుకుంటున్న శుభ‌వేళ‌.. ప‌లువురు ఖైదీల‌కు శిక్ష‌లో ఉప‌శ‌మ‌నం ల‌భించింది. దేశ‌వ్యాప్తంగా జైళ్లలో సత్ప్రవర్తన కలిగి ఉన్న231 మంది ఖైదీలు ముంద‌స్తుగా విడుద‌ల కాబోతున్నారు. వీరిలో జీవితకాల ఖైదీలు 212 మంది, జీవిత‌కాలం కాకుండా శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు 19 మంది ఉన్నారు. ముంద‌స్తు విడుద‌లతో ఖైదీలు సమాజంలో తిరిగి సంఘటితం కావడమే కాకుండా నేరరహిత స‌మాజానికి మార్గం సుగమం అవుతుంద‌ని ప్ర‌భుత్వం భావిస్తుంది.

ప్రభుత్వం సాధారణంగా మూడు సందర్భాల్లో జనవరి 26న, ఆగస్టు 15, గాంధీ జయంతి నాడు అక్టోబర్ 2 నాడు ఖైదీల‌ను ముంద‌స్తుగా విడుదల‌ను చేస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్‌కు ఉన్నఅధికారాల ద్వారా ప్రత్యేక ఉపశమనం క‌ల్పిస్తూ ముంద‌స్తుగా విడుద‌ల చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016, 2020లో రెండు సందర్భాల్లో ఖైదీల‌ను ముందస్తుగా విడుద‌ల చేశారు.

ప‌దేండ్ల‌ కంటే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్న ఖైదీల క్యాటగిరీలో, మహిళా ఖైదీలందరూ, 65 ఏండ్లు పైబడిన పురుష ఖైదీలు 90 రోజుల ఉపశమనానికి అర్హులు. ఐదు నుంచి ప‌దేండ్ల వరకు శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలందరికీ, అదే క్యాటగిరీలో 65 ఏండ్లు పైబడిన పురుషులందరికీ 60 రోజుల ఉపశమనం ఇవ్వబడుతుంది. 65 ఏళ్లలోపు పురుషులు 45 రోజుల పాటు ఉపశమనం పొందుతారు. ఏడాది నుంచి ఐదేండ్ల వరకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలందరికీ 30 రోజుల ఉపశమనం లభిస్తుంది.

ఒక సంవత్సరం వరకు శిక్ష అనుభవిస్తున్న వారికి, 65 ఏండ్లు పైబడిన పురుష ఖైదీలు, మహిళా ఖైదీలందరికీ 20 రోజుల ఉపశమనం లభిస్తుంది. ఇతర ఖైదీలకు 15 రోజుల ఉపశమనం లభిస్తుంది.

మరణశిక్ష ప‌డిన‌వారు, జీవిత ఖైదు అనుభవిస్తున్న వారితోసహా అనేక వర్గాల ఖైదీలు దీనికి ముంద‌స్తు విడుద‌ల‌కు అన‌ర్హులు. ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 354 కింద మహిళలపై నేరాలకు శిక్ష పడిన ఖైదీలకు, కొంతమంది సివిల్ దోషులు, పోక్సో చట్టం కింద శిక్ష ప‌డిన‌ ఖైదీలకు కూడా ఉపశమనం ల‌భించ‌దు.