Eatala Rajender
విధాత: కొన్నిరోజులుగా ఈటల రాజేందర్(Eatala Rajender) మాటలు చూస్తుంటే ఇవాళ అద్దంకి దయాకర్ ఆయన ఫ్రస్టేషన్‌లో ఉన్నారనేది వాస్తవమే అనిపిస్తున్నది. ఎందుకంటే మొన్న సీఎం కేసీఆర్‌పై కూడా ఎవడ్రా నువ్వు అని ఈటల చాలా పరుషంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధిష్ఠానంతో విభేదాలతో బైటికి వచ్చిన తర్వాత ఆయనకు చేరికల కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించారు.
నిజానికి ఈటల గతంలో పనిచేసిన పార్టీ సిద్ధాంతానికి బీజేపీ భావజాలానికి వైరుధ్యమే తప్పా పోలిక ఉండదు. ఉద్యమకాలంలోనూ.. అసెంబ్లీలోనూ ఈటల మాటలు తూటాల్లా పేలేవి. ఈటల రాజేందర్ (Eatala Rajender) అంటే సౌమ్యంగానే సమాధానాలు ఇస్తారనే పేరు ఉన్నది.
కానీ ఈ మధ్యకాలంలో ఢిల్లీలో కొందరు హస్తిన పెద్దలను కలిసిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు కనిపిస్తున్నది. పార్టీలో చేరికలు పెంచాలనే పార్టీ పెద్దలు ఆదేశించడం, రాష్ట్రంలో బీజేపీలో చేరేందుకు అనుకూల వాతావరణం కూడా రాష్ట్రంలో లేదు.
దీనికి కారణం రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ లాంటి నేతలు అనుసరిస్తున్నవిధానాలు ఆ పార్టీ అధిష్ఠాన ఆలోచనలకు అనుగుణంగా ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రంలో ఆ విద్వేష రాజకీయాలకు చోటు ఉండదు.
అందుకే ఈటల రాజేందర్ బీజేపీ లో కొనసాగుతూ.. ఆ పార్టీలోకి బీఆర్‌ఎస్ అసంతృప్త నేతలను, లేదా కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. అందుకే ఈటల (Eatala Rajender) ఈ మధ్యకాలంలో ఫ్రస్టేషన్‌కు గురవుతున్నట్టు కనిపిస్తున్నది.
ఇంకో ఉదాహరణకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగరేసి కొంతకాలంగా ఏ పార్టీలో చేరకుండా స్వతంత్రంగానే ఆయన ఆ జిల్లాలో బలప్రదర్శన చేశారు. బీఆర్‌ఎస్ ఎదుర్కొనే పార్టీలో చేరుతానన్న ఆయన కాంగ్రెస్‌లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు.
పొంగులేటి పార్టీ మార్పు అనే నిర్ణయం జరిగిపోయిన తర్వాత ఆయనతో చర్చిస్తున్నట్టు ఈటల అనడం హాస్యాస్పదంగా ఉన్నది. అలాగే తటస్థంగా ఉన్నవాళ్లు, బీజేపీలో చేరాలనుకుంటున్న వారితో చర్చించు కునేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ఉద్యమకారులు ఎవరూ బీజేపీలో ఇమడలేరని ఆ పార్టీలో చేరి బైటికి వచ్చిన వాళ్లను చూస్తే అర్థమౌతుంది.
ఎందుకంటే బీజేపీ ఈ ప్రాంతంలో రాజకీయంగా బలోపేతకావడానికి ఆ పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు వివిధ కారణాలతో ఇప్పటికే పార్టీలో చేరిక వారికే నచ్చడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆపార్టీ ఓట్లు అడగాలంటే గత తొమ్మిదేళ్లుగా దేశం సాధించిన ప్రగతి గురించి అయినా చెప్పుకోవాలి. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో నెరవేర్చిన వాటి గురించి అయినా చెప్పాలి.
కానీ కేంద్రం చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ పనితీరు ఎలా ఉన్నదో నీతిఆయోగ్ లాంటి సంస్థలు ఇస్తున్న నివేదికలే తెలియజేస్తున్నాయి. కేవలం మతం ప్రాతిపదిక ఓట్ల రాజకీయం చేయాలనుకుంటున్న ఆ పార్టీ ఆలోచనలకు.. ఈటల రాజేందర్ (Eatala Rajender) మనస్తత్వానికి ఎక్కడా పొంతన కుదరడం లేదు. అందుకే ఈటల ఫ్రస్టేషన్‌కు ఇవి కూడా కారణమై ఉండొచ్చు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఇక్కడ బీఆర్‌ఎస్ కుటుంబ రాజకీయాలు, కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలపై కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపులో బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. జాతీయ పార్టీగా బీజేపీకి ఒక విధానమంటూ ఏదీ లేదని అర్థమౌతున్నది. తమ మాట విన్నవాళ్లు, తమ పార్టీలో ఉన్నవాళ్లపై ఎన్ని ఆరోపణలు ఉన్నాఎలాంటి సమస్యలు రావు.
కేంద్రాన్ని ధిక్కరిస్తేనే ఏం జరుగుతుందో.. విపక్ష నేతలపై కేంద్రం దర్యాప్తు సంస్థలను ఎలా ప్రయోగిస్తున్నదో? తాజాగా పుల్వామా ఘటన పాపం మోడీదే అన్న జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ‘నిజాలు మాట్లాడటం ద్వారా కొందరి తప్పుల్ని ఎత్తిచూపాను. అందుకే నన్ను సీబీఐ పిలిచిందేమో. తాను ఏ మాత్రం భయట పడను. సత్యంవైపే నిలబడతానని’ మాలిక్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
మోడీ వైఫల్యాలను ఎండగడితే ఎలా ఉంటుందో ఈ ఉదంతాలను చూస్తే అర్థమౌతుంది. బహుశా ఈటల రాజేందర్ (Eatala Rajender) లాంటి వారికి ఇవన్నీ బోధపడి ఉండొచ్చు. అందుకే ఈటల బైటికి రాలేక.. పార్టీలో కొనసాగాలేక.. ఆ పార్టీ భావజాలాన్ని మోయలేక.. చేరికల కమిటీ కన్వీనర్‌గా పార్టీలోకి తీసుకొచ్చే వారికి సమాధానం చెప్పలేక సతమతమౌతూ ఫ్రస్టేషన్‌కు గురౌతున్నారు కావొచ్చు!.