విధాత: అక్రమంగా నిల్వచేసిన విదేశీ ఆయుధాలు.. పెద్దమొత్తంలో బుల్లెట్లు.. కట్టలకొద్ది నగదు.. బంగారు బిస్కెట్లు.. వందకుపైగా మద్యం సీసాలు.. ఇవన్నీ ఏ గ్యాంగ్‌స్టర్ ఇంట్లోనో, నేరస్తుల నివాసంలో లభించలేదు. సాక్ష్యాత్తు ఓ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ మొత్తం లభించింది. హర్యానాలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన సోదాల్లో ఈ అక్రమ వ్యవహారం వెలుగుచూసింది.
హర్యానాకు చెందిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్, అతని సహచరుల ప్రాంగణంలో ఈడీ గురువారం సోదాలు నిర్వహించింది. అక్రమంగా దాచిన విదేశీ తయారీ ఆయుధాలు, 100 కంటే ఎక్కువ మద్యం సీసాలు, ఐదు కోట్ల నగదు, మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. భారతదేశం, విదేశాలలో పలు ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించినట్టు తెలిపారు. ఆస్తులతో సహా ఇతర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది. లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలిపింది.