గుజ‌రాత్‌: ఎన్నికైన వారిలో స‌గం మంది కోటీశ్వ‌రులే

మూడింట ఒక వంతు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై శిక్షార్హ‌మైన తీవ్ర నేరారోప‌ణ‌లు విధాత‌: దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న తీరు, ఎన్నిక‌వుతున్న ప్రజాప్ర‌తినిధుల గుణ‌గ‌నాలు మ‌న ప్ర‌జాస్వామ్య దుస్థితిని తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నిక‌య్యే వారు సేవా త‌త్ప‌రులుగా ప్ర‌జాసేవ‌లో ఉంటూ నిరాడంబ‌ర‌, నిస్వార్థ జీవితాలు క‌లిగి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా ఉన్న‌వారే ఎన్నిక‌వుతార‌ని అనుకుంటాం. కానీ నేడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన ప్ర‌మాణాలు తారుమార‌య్యాయి. గ్రామ స‌ర్పంచ్‌గా ఎన్నిక కావాలంటే కూడా కోట్లు […]

  • By: krs    latest    Dec 12, 2022 7:40 AM IST
గుజ‌రాత్‌: ఎన్నికైన వారిలో స‌గం మంది కోటీశ్వ‌రులే

మూడింట ఒక వంతు ప్ర‌జాప్ర‌తినిధుల‌పై శిక్షార్హ‌మైన తీవ్ర నేరారోప‌ణ‌లు

విధాత‌: దేశంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న తీరు, ఎన్నిక‌వుతున్న ప్రజాప్ర‌తినిధుల గుణ‌గ‌నాలు మ‌న ప్ర‌జాస్వామ్య దుస్థితిని తెలియ‌జేస్తున్నాయి. ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎన్నిక‌య్యే వారు సేవా త‌త్ప‌రులుగా ప్ర‌జాసేవ‌లో ఉంటూ నిరాడంబ‌ర‌, నిస్వార్థ జీవితాలు క‌లిగి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా ఉన్న‌వారే ఎన్నిక‌వుతార‌ని అనుకుంటాం. కానీ నేడు ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నిక కావాలంటే ఉండాల్సిన ప్ర‌మాణాలు తారుమార‌య్యాయి. గ్రామ స‌ర్పంచ్‌గా ఎన్నిక కావాలంటే కూడా కోట్లు ఖ‌ర్చు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే.. కండ‌బ‌లం ఉండాలి. కుల బ‌ల‌గం ఉండాలి.

దీనికి తోడు కోటీశ్వ‌రులై ఉండాలి. కోట్లు వెచ్చించి ఓట్లు కొనుగోలు చేయగ‌ల‌గాలి. ఇవ‌న్నీ స‌మాజంలో నీతి, నిజాయితీ క‌ల‌వారుగా ఉంటే స‌మ‌కూరేవి కావు. కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఎన్నిక‌వుతున్న వారు కోటీశ్వ‌రులే కాదు, వారికి అవినీతి, అక్ర‌మాలు, నేర చ‌రిత్ర పుష్క‌లంగా ఉంటున్న‌ది.

ఈ నేప‌థ్యంలోంచే ఈ మ‌ధ్య జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. వివిధ పార్టీల అభ్య‌ర్థులుగా పోటీలో ఉండి, ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు త‌మ వ్య‌క్తిగ‌త స‌మాచారంతో వారు అఫిడ‌విట్‌గా స‌మ‌ర్పించిన వాటిని ప‌రిశీలిస్తే విస్తుపోయే నిజాలు బ‌య‌ట ప‌డ్దాయి.

అఫిడ‌విట్ల ఆదారంగా ప్రజాస్వామ్య సంస్క‌ర‌ణ‌ల సంఘం (ఏడీఆర్‌) తెలిపిన ప్ర‌కారం.. ఎన్నికైన వారిలో స‌గం మంది కోటీశ్వ‌రులే. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివభ జడేజా ఫ్యామిలీ సంపాదన ఏడాదికి 100 కోట్లపైనే కావడం గమనార్హం. ఈమె గుజరాత్‌లో అత్యధిక ధనవంతురాలైన ఎమ్మెల్యే కావడం మరో విశేషం. ఇక బీజేపీ నుంచి ఎన్నికైన వారిలో 26 మందిపై శిక్షార్హ నేరారోప‌ణ‌లున్నాయి. అందులో 20మందిపై తీవ్ర‌మైన హ‌త్య‌, అత్యాచారం వంటి నేరారోప‌ణ‌లున్నాయి.

కాంగ్రెస్ స‌రేస‌రి. స‌చ్ఛీల‌త‌కు మారుపేరుగా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ సంస్కృతికి ప్ర‌తీకగా చెప్పుకొంటున్న ఆప్ అభ్య‌ర్థులుగా ఎన్నికైన వారిలో కూడా ఇద్ద‌రిపై తీవ్ర నేరారోప‌ణ‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇలాంటి ప‌రిస్థితుల‌ను చూసే కావొచ్చు.. ప్ర‌జాస్వామ్య ప్రేమికులు చాలా మంది దేశంలో ప్ర‌జాస్వామ్యం కుల్లి కంపు కొడుతున్న‌ద‌ని వాపోతున్నారు. ఎప్ప‌టికైనా ఈ దుస్థితి మారేనా…