Telangana | సరఫరా 12 గంటలే!

Telangana విధాత క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి వివాదం తర్వాత కొన్ని చోట్ల 24 గంటలు యాసంగిలో ఇబ్బంది పడ్డామన్న రైతులు అప్పట్లో పలు చోట్ల కరెంటు కోసం ధర్నాలు హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదేశాలతోనే పలువురు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్ల వెల్లడి (విధాత న్యూస్‌ నెట్‌వర్క్‌) రాష్ట్రంలో ఉచిత్‌ విద్యుత్తు సరఫరా అంశం అధికార, విపక్షాల మధ్య చిచ్చు రేపింది. మాటల మంటలు కాస్తా ధర్నాలు, పంచాయితీల వరకూ వెళ్లాయి. బీఆరెస్‌ ఏకంగా రైతు వేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు […]

  • Publish Date - July 18, 2023 / 02:00 AM IST

Telangana

  • విధాత క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి
  • వివాదం తర్వాత కొన్ని చోట్ల 24 గంటలు
  • యాసంగిలో ఇబ్బంది పడ్డామన్న రైతులు
  • అప్పట్లో పలు చోట్ల కరెంటు కోసం ధర్నాలు
  • హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదేశాలతోనే
  • పలువురు సబ్‌స్టేషన్‌ ఆపరేటర్ల వెల్లడి

(విధాత న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఉచిత్‌ విద్యుత్తు సరఫరా అంశం అధికార, విపక్షాల మధ్య చిచ్చు రేపింది. మాటల మంటలు కాస్తా ధర్నాలు, పంచాయితీల వరకూ వెళ్లాయి. బీఆరెస్‌ ఏకంగా రైతు వేదికల వద్ద సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ పార్టీని బహిష్కరిస్తూ తీర్మానాలు చేయిస్తున్నది. బీఆరెస్‌కు దీటుగా కాంగ్రెస్‌ ఆందోళనలు చేపట్టింది. ఉచితం పేరుతో బీఆరెస్‌ దోపిడీ చేస్తోందంటూ కాంగ్రెస్‌ సబ్ స్టేషన్ లను ముట్టడిస్తోంది.

ఇలా ఉచితం రద్దు అంటూ ఒకరు, ఉచితం పేరుతో కమీషన్లు అంటూ మరొకరు రైతులను తమ వైపు తిప్పుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నాయి. ఉచిత విద్యుత్తుపై అధికార బీఆరెస్‌, విపక్ష కాంగ్రెస్‌ ఆరోపణలు, ఆందోళనలతో ఎన్నికలకు ముందే రాజకీయం వేడిక్కింది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల పరస్పర ఆందోళనల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో వ్యవసాయానికి త్రీ ఫేస్‌ కరెంటు ఎన్ని గంటలు సరఫరా అవుతుందో తెలుసుకోవడానికి విధాత బృందం క్షేత్ర స్థాయి పరిశీలన చేసింది.

అయితే.. వ్యవసాయానికి అవసరమయ్యే త్రీఫేస్‌ విద్యుత్తు 24 గంటలూ సరఫరా కావడం లేదని, సగటున రోజుకు 10 నుంచి 12 గంటల మధ్య మాత్రమే వస్తున్నదని వెల్లడైంది. అయితే 12 గంటల విద్యుత్తు సరఫరా తమ వ్యవసాయానికి సరిపోతుందని పలువురు రైతులు చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 11 నుంచి 13 గంటలు కరెంటు అందిస్తున్నారని అక్కడి రైతులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు గంటల తేడా ఉన్నప్పటికి సగటున 12 గంటలు అందుతున్నదని చెబుతున్నారు. సబ్ స్టేషన్‌ల వారీగా సమయం తేడా ఉన్నది.

గత యాసంగిలో మాత్రం కరెంటు కోతలు విధించారు. దీంతో పంటలు చేతికొచ్చే సమయంలో అవస్థలు పడినట్లు రైతులు చెబుతున్నారు. అందుకే కొన్ని చోట్ల రైతులు ధర్నాలు నిర్వహించారు. ప్రస్తుతం నారుమళ్లకు మాత్రమే కరెంటు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఈ నెల 11 వ తేదీ వరకు రైతులకు ఉచిత విద్యుత్తు సరఫరా ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు వచ్చేదని రైతులు చెపుతున్నారు.

రాత్రి 11నుండి ఉదయం 5 గంటలవరకు విద్యుత్తు సరఫరా చేశామని సబ్ స్టేషన్ ఆపరేటర్లు పేర్కుంన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ నుచి 24 గంటల విద్యత్తు సరఫరా చేస్తున్నట్లు రైతులు చెపుతున్నారు.

ఆదేశాల మేరకే కరెంటు సరఫరా

హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదేశాల మేరకే సబ్‌స్టేషన్ల నుంచి విద్యుత్తు సరఫరా జరుగుతుందని విధాత బృందానికి పలువురు ఆపరేటర్లు తెలిపారు. ‘‘గతంలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రైతులకు విద్యుత్తు సరఫరా జరిగేది. పలు చోట్ల మాత్రం రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు జరిగేది.

సబ్ స్టేషన్‌ లాగ్‌బుక్‌లో మాత్రం 24 గంటల విద్యుత్తు సరఫరా జరుగుతుందనే ఉన్నది. హైదరాబాద్ కంట్రోల్ కార్యాలయం నుండి జిల్లా ఎస్ఈలకు విద్యుత్తు సరఫరా విషయంలో మేసేజ్ వస్తుంది. అక్కడి నుంచి డీఈలకు, వారి నుంఇ ఏఈలకు ఆ తర్వాత సబ్ స్టేషన్ ఆపరేటర్‌లకు మేసేజ్ వస్తుంది. ఇలా అధికారుల సూచనల మేరకే విద్యుత్ సరఫరా జరుగుతుంది.’’ అని పేర్కొన్నారు.

గతంలో 12 గంటలే..

గత సంవత్సరం ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటలవరకు 3 ఫేస్ కరెంట్ ఇచ్చారు. ఈ నెల 12 నుండి మాత్రం వ్యవసాయానికి 24 గంటల సరఫరా జరుగుతున్నది.

వీరప్ప గారి శ్రీనివాస్ గౌడ్ , రైతు
కుచన్ పల్లి గ్రామం, మెదక్‌ జిల్లా

13 గoటల కరెంటు సరఫరా

13 గంటల కరెంట్ సరఫరా అవుతోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి మధ్య రాత్రి 12 గంటల వరకు సింగల్ ఫేజ్ కరెంట్ ఇస్తున్నారు.

మల్లు రాజేందర్ రెడ్డి, రైతు
మాచన్ పల్లి గ్రామం, మహబూబ్‌నగర్‌ జిల్లా

ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా

ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇస్తున్నారు. దాదాపు రాత్రి పూట కరెంట్ సరఫరా చేయడం లేదు. ఈ మధ్యలో కరెంటు కట్, లో వోల్టేజ్ సమస్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం ఈ కరెంటు నాకు ఉన్న మూడు ఎకరాల భూమికి నీళ్ళు పారించేందుకు సరిపోతుంది. రాత్రి వేళ సరఫరా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

బాలరాజు, రైతు
ఏనుగల్లు గ్రామం, వరంగల్‌ జిల్లా

10 గంటల కరెంటు వస్తుంది.

పేరుకు 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా, నిజానికి 10 గంటలు మాత్రమే కరెంటు వస్తుంది. నాకు మూడు ఎకరాల వ్యవసాయం ఉంది. వానకాలం సీజన్ లో వరి నారుమడి పోశాను. నారుమడి సగం పట్టేలోపే కరెంటు పోతుంది. మళ్లీ గంట తర్వాత వస్తుంది. ఈ లోపు నార్మడి ఎండిపోతుంది. దుక్కి కి నీళ్లు వేద్దామంటే కరెంటు నిరంతరం రావడం లేదు, వర్షాలు లేకపోవడంతో దుక్కులు తడవడం లేదు, కరెంటు కోసం రాత్రి పగలు పడికాపులు కాయల్సి వస్తుంది. ఏడాది వానలు పడకుంటే కరెంటుతో వ్యవసాయం చేసేది కష్టమే.

పందుల సైదులు, రైతు
శ్రీరాంపురం గ్రామం, నల్గొండ జిల్లా.

Latest News