ఫార్మసీ యాక్టుతో ఉపాధి అవకాశాలు..కేయూ ఫార్మసీకాలేజ్ ప్రిన్సిపాల్ ప్రసాద్
ఫార్మసీ యాక్టు అమలు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసాద్ అన్నారు.

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఫార్మసీ యాక్టు అమలు వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు అవకాశాలు పెంపొందించేందుకు కృషి చేయాలని కోరారు. శుక్రవారం ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఉప్పు భాస్కర్ రావు, ఆకుల సంజయ్ రెడ్డిల ఎన్నికల ప్యానల్ అభ్యర్థులు కాకతీయ విశ్వవిద్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ డాక్టర్ సమ్మయ్య మాట్లాడుతూ ఫార్మసీ యాక్ట్ ను క్షేత్రస్థాయిలో అమలు చేస్తే ఫార్మాసిస్టులందరికీ ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. కౌన్సిల్ సేవలను మరింత సులభతరం చేయాలన్నారు.
ప్రొఫెసర్ నర్సింహరెడ్డి, ప్రొఫెసర్ అచ్చయ్య మాట్లాడుతూ కౌన్సిల్ వల్ల ఉన్న ప్రయోజనాలను వినియోగించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు ఉప్పు భాస్కరరావు, తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యులు ఆకుల సంజయ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ ను ఏర్పాటు చేయటానికి రాష్ట్రంలో 8 మంది మంత్రులు, ఆరుగురు శాసనసభ్యుల సహకారంతో గుంటూరులోని ఫార్మసీ కౌన్సిల్‌ను హైదరాబాద్ కు తీసుకు రాగలిగారని, ఇందుకోసం ముఖ్యమంత్రిని కలిసి కోరగానే కౌన్సిల్ ఏర్పాటు చేసిందని అన్నారు. కౌన్సిల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఫార్మసీ షాపుల్లో ఫార్మసిస్టులకు కనీస వేతనం ముప్పై వేలు ఇప్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ సభ్యులు డాక్టర్ మహాలక్ష్మి, సురేష్, ఆనంద్, సందీప్, కుమార్ తో పాటు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ నాగరాజు, ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ కు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.