కూంబింగ్ కోసం వెళితే ఎన్కౌంటర్ గా మారిన సీన్

జ‌మ్ముక‌శ్మీర్‌లో మ‌రోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు

  • Publish Date - January 5, 2024 / 05:39 AM IST
  • ఎన్‌కౌంట‌ర్‌గా మారిన గాలింపు చ‌ర్య‌లు
  • సోపియాన్ జిల్లాలో ఉద‌య‌వేళ ఘ‌ట‌న‌


విధాత‌: జ‌మ్ముక‌శ్మీర్‌లో మ‌రోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం ఉద‌యం ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని ఛోటిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందించింది. గురువారం కూడా ద‌క్షిణ క‌శ్మీర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి.


ఈ నిర్దిష్ట సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్ర‌వారం తెల్లవారుజామున షోపియాన్ జిల్లా పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా అక్కడ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి తెలిపారు. బ‌ల‌గాల రాక‌ను ముందే ప‌సిగ‌ట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎదురు కాల్పులు జ‌రిపాయి. సెర్చ్ ఆపరేషన్ కాస్త ఎన్‌కౌంటర్‌గా మారిందని పోలీస్ అధికారి పేర్కొన్నారు.


ఇప్పటివరకు, ఇరువైపులా ఎటువంటి ప్రాణ నష్టం జరిగినట్టు నివేదిక రాలేద‌ని వెల్ల‌డించారు. “షోపియాన్ జిల్లాలోని చోటిగామ్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. షోపియాన్ పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎప్ ద‌ళాలు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్న‌ది” అని క‌శ్మీర్ జోన్ పోలీస్‌శాఖ మీడియాకు తెలిపింది.