బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న.. మంత్రి కేటీఆర్‌తో భేటీ

బీఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న.. మంత్రి కేటీఆర్‌తో భేటీ

విధాత, హైద్రాబాద్ : ప్రముఖ ప్రజాగాయకుడు, వైఎస్సార్టీపీ నేత ఏపూరి సోమన్న శుక్రవారం బీఆరెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన త్వరలో బీఆరెస్‌లో చేరేందుకు నిర్ణయించుకుని మంత్రి కేటీఆర్‌తో భేటీయైనట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ప్రగతి భవన్‌కు వెళ్లిన ఏపూరి సోమన్న మంత్రి కేటీఆర్‌తో పార్టీలో చేరికపై చర్చించగా, ఆయన చేరికను కేటీఆర్‌ స్వాగతించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ లు ఉన్నారు. గాయకుడు సాయిచంద్‌ అకాల మృతి తర్వాతా బీఆరెస్‌కు ఆ స్థాయిలో బహిరంగసభలలో ఊపునిచ్చే గాయకుడు లేని లోటు కనిపించింది. ఈ నేపధ్యంలో సోమన్నను బీఆరెస్‌లోకి తీసుకొచ్చేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన ఆటపాటలతో ఉర్రూతలూగించిన సోమన్న అనంతరం సీఎం కేసీఆర్‌కు, బీఆరెస్‌కు వ్యతిరేకంగా గళమెత్తి పలు కేసులను కూడా ఎదుర్కోన్నారు. అనంతరం వైఎస్సార్టీపీలో చేరి షర్మిల పాదయాత్రల సభలలో తన ఆటపాటలతో కీలకంగా వ్యవహారించారు.

షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్న నేపధ్యంలో సోమన్న కూడా తనదారి తాను చూసుకుని బీఆరెస్‌లో చేరేందుకు మొగ్గు చూపినట్లుగా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్టీపీ తరుపున తుంగతుర్తి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తానని ప్రకటించిన ఏపూరి సోమన్న ఇప్పుడు ఏ హామీతో బీఆరెస్‌లో చేరారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత కొరవడింది.