సరుకులతో రైతుల ఢిల్లీ మార్చ్
దేశ రాజధాని వైపు వచ్చే అన్ని రహదారులు రైతుల ట్రాక్టర్లతో నిండిపోయాయి. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 20 వేల మంది రైతులు ఢిల్లీకి వస్తున్నారు.

- 6 నెలలకు సరిపడా రేషన్, డీజిల్
- అన్ని డిమాండ్లు తీరాకే ఇంటికి
- గతంలో మోదీ సర్కార్ మోసం
- ఈ సారి అలా కుదరదు..
- ఢిల్లీ వైపు ట్రాక్టర్లో వేలాదిగా
- తరలివస్తున్న మంది రైతులు
- ఢిల్లీ సరిహద్దులో ఇనుప కంచెలు
- భారీ గోడలు, ఇనుప చువ్వలు
- అడ్డుకొనేందుకు భారీ బందోబస్తు
విధాత: దేశ రాజధాని వైపు వచ్చే అన్ని రహదారులు రైతుల ట్రాక్టర్లతో నిండిపోయాయి. మంగళవారం దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 200 రైతు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 20 వేల మంది రైతులు ఢిల్లీకి వస్తున్నారు. కొందరు ట్రాక్టర్లు, ఇంకొందరు ట్రక్కులు, మరికొందరు ఎండ్లబండ్లపై ఢిల్లీ వైపు బయలు దేరారు. ఆరు నెలలకు సరిపడా సరుకులు, బియ్యం, ఇతర వంట సామగ్రితో ట్రాక్టర్లలో వస్తున్నారు.
2020లో 13 నెలలపాటు సరిహద్దు పాయింట్ల వద్ద క్యాంప్ చేసి నిరసన కొనసాగించామని, ఈ సారి ఇంకా తమ సహనానికి పరీక్ష పెట్టినా తమ డిమాండ్లు నెరవేరే వరకు నిరసనను విరమించబోమని స్పష్టంచేశారు. ఎన్ని కష్టాలకు ఓర్చుకొని అయినా అన్ని డిమాండ్లను నెరవేర్చుకొనే తిరిగి ఇండ్లకు వెళ్తామని రైతు సంఘాల నాయకులు తెలిపారు.
“సూది నుంచి సుత్తి వరకు, రాళ్లను పగులగొట్టే పనిముట్లతో సహా మా ట్రాలీల్లో మాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. మా వద్ద ఆరు నెలల రేషన్‌తో మేము మా గ్రామాన్ని విడిచిపెట్టాము. హర్యానాకు చెందిన మా సోదరులకు కూడా తగినంత డీజిల్ మా వద్ద ఉంది” హర్భజన్ సింగ్, పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన ఒక రైతు తెలిపారు.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)పై చట్టం తీసుకురావాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, రైతులు, రైతు కూలీలకు పెన్షన్లు, వ్యవసాయ రుణమాఫీ, గత రైతుల ఆందోళన సందర్భంగా పెట్టిన పోలీసు కేసుల ఉపసంహరణ, లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్లతో ఢిల్లీమార్చ్ చేపట్టారు రైతులు.
మరోవైపు రైతులు ఢిల్లీ వైపు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దులనే భారీగా ముండ్ల కంచెలు ఏర్పాటుచేశారు. వాహనాలు రాకుండా ఇనుప చువ్వలు బిగించారు. వేల సంఖ్యలో పోలీసులను మోహరించారు. వాటర్ క్యానెన్లు, రబ్బరు బుల్లెట్లు సిద్ధం చేసుకున్నారు.