Telangana
విధాత: తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 3నుంచి ప్రారంభంకానుండగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీకి ఇదే చివరి సెషన్ సమావేశాలు కావచ్చన్న ఆలోచనతో ఉన్న అధికార, విపక్ష పార్టీలు జనంలో తమ పార్టీలకు ఎన్నికల లబ్ధిని, మైలేజీని సాధించే దిశగా అసెంబ్లీలో తమ ప్రభావం చూపాలన్న పట్టుదలతో ఉన్నాయి. అధికార బీఆరెస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంలు ఎవరికి వారు ఈ సమావేశాల్లో తమదే పైచేయి కావాలన్న లక్ష్యంతో అందుకు తగ్గ చర్చలకు వీలుగా తగిన వ్యూహప్రతివ్యూహాలను, అస్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు.
సమావేశాలు ఎన్ని రోజలు నిర్వహించాలన్నదానిపై తొలి రోజున శాసన సభ వ్యవహారాల కమిటీ (బీఏసీ)లో నిర్ణయించనుండగా, వీలైనంత ఎక్కువ రోజులు సభా సాగితే తమకు మంచిదన్న ఆలోచనతో ఇరుపక్షాలున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ధరణి, వరదలు, గత వరదల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన 10వేల హామీ, అలాగే ఎకరాకు పదివేల పరిహారం వంటి అంశాలతో పాటు ప్రాజెక్టుల దుస్థితి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలు, రైతుల లక్ష రుణమాఫీ, దళితబంధులో అవినీతిపై అధికార బీఆరెస్‌ను సభావేదికగా నిలదీయనుంది.
ఆ అంశాలపై చర్చ జరిగేలా చేసి తద్వారా సమీపిస్తున్న ఎన్నికలకు ముందు జనంలో మైలేజీకి ఆ పార్టీ కసరత్తు చేస్తున్నది. అలాగే క్షేత్ర స్థాయిలో 24గంటల విద్యుత్తు అమలుకాని అంశం, విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలలో అవినీతి, ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులు, ప్రభుత్వ భూముల అమ్మకాలు, ఉద్యోగాల భర్తీలో సమస్యలు వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేయవచ్చు. దాదాపు అదే అంశాలపై బీజేపీ కూడా తమవంతుగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాల ఉన్నాయి.
ఇక అధికార బీఆరెస్ పార్టీ తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, చేసిన అభివృద్ధి పనులను చెప్పుకునేందుకు ఈ దఫా అసెంబ్లీ సమావేశాలు పక్కాగా ప్రచార వేదిక తరహాలో సద్వినియోగం చేసుకోవాలని బీఆరెస్ యోచిస్తుంది. రైతబంధు, దళిత బంధుతో పాటు ఇటీవల బీసీలకు, మైనార్టీలకు ప్రకటించిన లక్ష సహాయం పథకాలు, కార్మిక బీమా, దివ్యాంగుల పింఛన్ పెంపు వంటి వాటితో దశాబ్ది కాలంలో సాధించిన ప్రగతి వివరాలను ఏకరవు పెడుతూ అసెంబ్లీ ద్వారా ఎన్నికల లబ్ధికి ప్రయత్నించనుందనడంలో సందేహం లేదు.
ఇదే సమయంలో వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టులు, వరదలు వంటి అంశాలపై చర్చ సందర్భంగా విపక్షాలపై ఎదురుదాడికి మంత్రులు, ఎమ్మెల్యేలు దిగడం ఖాయం. ఈ నేపథ్యంలో ఈ దఫా వర్షాకాల సమావేశాలు అటు అధికార, ఇటు ప్రతిపక్షాలకు మధ్య ఎన్నికల లబ్ధి కోణంలో సమర వేదికగా నిలుస్తాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
అలాగే ఇంతకాలంగా తాము దూరం పెట్టిన వర్గాలను ఎన్నికల దృష్ట్యా దగ్గర చేసుకునే క్రమంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాలనుకునే పీఆర్సీ ప్రకటన సహా ఇతర ఉద్యోగ వర్గాలకు, నిరుద్యోగులకు, రైతులు, మహిళలకు ఇచ్చే కొత్త వరాలు ఏమైనా సిద్ధం చేస్తే వాటిని కూడా ఈ సమావేశాల్లో ప్రకటించే అవకాశముంది. రైతుల లక్ష రుణమాఫీపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే ఆస్కారం లేకపోలేదు. ముఖ్యంగా గవర్నర్ తిప్పి పంపిన, తిరస్కరించిన బిల్లులపై కీలక చర్చలకు అస్కారముంది. ఎంఐఎం కూడా రానున్న ఎన్నికల దృష్ట్యా ఈ సమావేశాల్లో తనవంతు ముద్ర వేసేందుకు, తద్వారా తాము అధికార పార్టీకి బాకా కాదని చాటుకునేందుకు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గొంతు సవరించుకోవచ్చు.
విపక్షాల చర్చకు కత్తెర తప్పదా…
అయితే సీఎం కేసీఆర్ ఎంతమేరకు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ఆసక్తికర అంశంగా మారనుంది. గతంలో సాగిన పలు సెషన్ల అసెంబ్లీ సమావేశాలను పరిశీలిస్తే అధికార పార్టీ విపక్ష సభ్యుల గొంతు నొక్కేందుకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వడంతో పాటు తన కార్యక్రమాల పై ఉపన్యాసాల పోటీగా సమావేశాలను నడిపించిన తీరు విస్మరించలేం. బీజేపీ సభ్యులకైతే ఏ మాత్రం అవకాశమివ్వకుండా సమావేశాల తొలి సెషన్‌లోనే బయటకు పంపించే వ్యూహాన్ని అమలు చేసింది.
అలాగే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మాట్లాడే కాంగ్రెస్ సభ్యులను కూడా టార్గెట్ చేసి సస్పెన్షల ద్వారా అసెంబ్లీలో పైచేయి కోసం ప్రయత్నించింది. ఈ దఫా సమావేశాల చర్చల్లో విపక్షాలకు చాన్స్ ఇస్తే ఎన్నికలకు ముందు అది జనంలో తమకు ప్రతికూలంగా మారుతుందన్న కోణంలో ఖచ్చితంగా సభలో విపక్ష సభ్యుల మైక్‌లకు కట్ తప్పదని భావిస్తున్నారు.