Warangal: CPI(ML) నాయకురాలు బేబక్కకు ఘనంగా అంతిమ వీడ్కోలు

కొత్తగూడ, నర్సంపేటల్లో అంతిమయాత్ర కేఎంసీకి భౌతికకాయం అప్పగింత పెద్దసంఖ్యలో పాల్గొన్న విప్లవశ్రేణులు విప్లవోద్యమానికి బేబక్క జీవితం అంకితం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీపీఐ( ఎంఎల్) నాయకురాలు నిమ్మగడ్డ సరోజన అలియాస్ బేబక్క (83) శుక్రవారం రాత్రి తన స్వగ్రామమైన కొత్తగూడ మండలం గుండంపల్లిలో గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. జీవితాంతం పీడిత ప్రజల హక్కుల కోసం ఆమె అలుపెరుగని పోరాటం చేసింది. బేబక్కగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఆమె […]

Warangal: CPI(ML) నాయకురాలు బేబక్కకు ఘనంగా అంతిమ వీడ్కోలు
  • కొత్తగూడ, నర్సంపేటల్లో అంతిమయాత్ర
  • కేఎంసీకి భౌతికకాయం అప్పగింత
  • పెద్దసంఖ్యలో పాల్గొన్న విప్లవశ్రేణులు
  • విప్లవోద్యమానికి బేబక్క జీవితం అంకితం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీపీఐ( ఎంఎల్) నాయకురాలు నిమ్మగడ్డ సరోజన అలియాస్ బేబక్క (83) శుక్రవారం రాత్రి తన స్వగ్రామమైన కొత్తగూడ మండలం గుండంపల్లిలో గ‌త కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. జీవితాంతం పీడిత ప్రజల హక్కుల కోసం ఆమె అలుపెరుగని పోరాటం చేసింది. బేబక్కగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఆమె సుపరిచితం. అనేక ఆటుపోట్ల మధ్య ఆమె విప్లవోద్యమ జీవితాన్ని కొనసాగించింది.

బేబక్క అంతిమయాత్ర సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో స్వగ్రామం గుండంపల్లి, కొత్తగూడెం మండల కేంద్రంలో నర్సంపేట పట్టణంలో అంతిమయాత్ర నిర్వహించారు అనంతరం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో బేబక్క భౌతికకాయం ఆమె కోరిక మేరకు అందజేశారు. పార్టీ నాయకులు, సహచరులు బేబక్కకు ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు.

సంతాప సభ, ర్యాలీ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా, సిపిఐ ఎంఎల్, తుడుం దెబ్బ ఎమ్మార్పీఎస్, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరై బేబక్క భౌతికకాయం పై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.

బేబక్క జీవితం విప్లవోద్యమానికి అంకితం

ఈ సందర్భంగా జరిగిన సంతాప సభలో పలువురు నాయకులు ప్రసంగించారు. బేబక్కతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని చాటిచెప్పారు. బేబక్క తన చిన్న వయసు నుండి విప్లవోద్యమంలో పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఏజెన్సీ ఆదివాసి గిరిజన ప్రాంతంలో పనిచేశారు.

ఆదివాసి, గిరిజన, బడుగు, బలహీన, పేద వర్గాల కోసం నిస్వార్ధంగా విప్లవ ప్రతిఘటన ఉద్యమంలో ఉద్యమించారు. ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొని దోపిడీ పాలకవర్గ పార్టీలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆదివాసి గూడాలను, గుంపులను తిరుగుతూ వారికి బాసటగా నిలిచారు.

బేబక్క తమ్ముడైన పాలడుగు కృష్ణ పేద ప్రజల కోసం పోరాడి 1979 నవంబర్ 7న పాకాల కొత్తగూడలో హత్యకు గురైనా కూడా ఇసుమంతైనా చ‌లించ‌కుండా గుండె నిబ్బరంతో విప్లవోద్యమంలో నడిచారు. బేబక్క పాలడు కృష్ణన్న నాయకత్వంలో కొత్తగూడ, గంగారం, నర్సంపేట ఏరియా ప్రాంతాలలో అనేక పోడు భూములను కొట్టించి, ఫారెస్ట్ దాడులను ఎదుర్కొని, పేద ప్రజలకు భూములను పంచిన చరిత్ర బేబక్కది.

పోడు భూములే కాకుండా వడ్డీ, నాగులకు, మేకలపుల్లరికి తునికాకు కూలి రేట్లకై పోరాడుతూ నిత్యం మమేకమై ఉండేది. అంతేకాకుండా పాకాల కొత్తగూడా ఏరియా ప్రాంతంలో పనిచేస్తున్న అజ్ఞాత దళాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తను తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన బేబక్క మరణం విప్లవ ప్రతిఘటన ఉద్యమానికి తీరని లోటు అని నాయకులు స్పష్టం చేశారు.

ఈ అంతిమయాత్ర ర్యాలీ సంతాప సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు శ్రీశైలం, బూర్కా వెంకటన్న నర్సక్క, శివారపు శ్రీధర్, గట్టి సురేందర్, బూర్కా బుచ్చి రాములు, రాస మల్ల శ్రీను, గజ్జి సోమన్న, పసునూరి రాజమల్లు, యాదగిరి, యుగంధర్, పోతుగంటి వెంకన్న, లక్ష్మయ్య, పిట్టల దేవేందర్, సరోజన, రమ, ఇరుప ముత్తయ్య, నారాయణరెడ్డి, రాచర్ల బాలరాజు, నున్న అప్పారావు, దయాకర్, బండి కోటేశ్వర్, రాజేందర్, సిపిఐ ఎంఎల్ ప్రజా పంథా నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య,

రాయల చంద్రశేఖర్, చిన్న చంద్రన్న, కొత్తపల్లి రవి, పూనం ప్రభాకర్, రాయల విమల, అరుణ, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవు నూరి మధు, పుల్లన్న, మండల వెంకన్న, బండారి ఐలన్న, తిరుపతమ్మ, సిపిఐ ఎంఎల్ నాయకులు మోడం మల్లేష్, ఈర్ల పైడి, తుడుం దెబ్బ నాయకులు ఆకబోయిన రవి, ఆలూరి రాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు తీగల ప్రేమ్ సాగర్, కేదాసి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగమల్లేశ్వరరావు, నెహ్రు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.