అరుణమ్మా.. కాంగ్రెస్‌లోకి పోదాం! గద్వాల జేజమ్మపై అనుచరుల ఒత్తిడి?

అరుణమ్మా.. కాంగ్రెస్‌లోకి పోదాం! గద్వాల జేజమ్మపై అనుచరుల ఒత్తిడి?
  • బీజేపీతో ఇక్కడ గెలవడం కష్టం..
  • కాంగ్రెస్‌లోనే విజయావకాశాలు
  • గద్వాలలో మళ్లీ పూర్వ వైభవం
  • పార్టీ మారాలంటున్న సన్నిహితులు
  • కాంగ్రెస్‌ నేతల నుంచీ ఆఫర్లు?
  • సందిగ్ధంలో పడిన డీకే అరుణ!

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజకీయ భవిష్యత్ సందిగ్ధంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా అరుణ మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేసే విషయం నేటికీ వెల్లడించలేదు. బీజేపీలో కొనసాగి, మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో ఉంటారా? లేక అదే పార్టీ నుంచి గద్వాల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా? అనే విషయాన్ని ఆమె ఇంకా రహస్యంగానే ఉంచుతున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు అరుణ ఎక్కడి నుంచి పోటీలో ఉంటారనే విషయంలో అయోమయంలో ఉన్నారు. బీజేపీలో ఉంటే లోక్‌సభలో అవకాశం రాకుంటే రాజ్యసభకు నామినేట్ అయి, కేంద్ర మంత్రి పదవి పొందొచ్చనే ఆలోచన కూడా అరుణకు ఉన్నట్టు తెలుస్తున్నది. ఇదే జరిగితే ఆమె బీజేపీని వీడరనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్ లోకి వెళదాం


అరుణమ్మ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేస్తే భారీ విజయం అందిస్తామని గద్వాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అనుచరులు అరుణ ముందు ప్రస్తావన తెచ్చారని సమాచారం. గద్వాల కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా బలమైన నేతలు లేరని, ఎప్పటిలాగే కాంగ్రెస్‌లో ఉంటే తప్పక గెలుపు వరిస్తుందని, మనసు మార్చుకుని తిరిగి కాంగ్రెస్ లో చేరుదామని ప్రస్తుతం ఆమె వెంట ఉన్న ముఖ్య అనుచరులు అరుణకు నచ్చజెప్పుతున్నారని తెలుస్తున్నది.

గద్వాల నియోజకవర్గంలో బీజేపీకి గెలిచేంత బలం లేదని, కాంగ్రెస్‌లోకి వెళితే తప్పకుండా గెలిపించుకుంటామని అరుణకు భరోసా ఇస్తున్నారని చెబుతున్నారు. అనుచరుల మాటలతో అరుణ సందిగ్ధంలో పడ్డారని సమాచారం. బీజేపీలో జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్న అరుణ తన అనుచరుల మాటలకు తలోగ్గి కాంగ్రెస్‌లో చేరి గద్వాల నియోజకవర్గంలో చక్రం తిప్పుతారా? లేక బీజేపీలోనే కొనసాగుతారా? అన్న విషయంలో త్వరలోనే స్పష్టత రానున్నదని ఆమె అనుచరులు చెబుతున్నారు.

అరుణ వస్తే సరిత పరిస్థితేంటి?


ఒకవేళ అరుణ కాంగ్రెస్‌లోకి వస్తే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆరెస్‌ గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరిత పరిస్థితి ఏంటని కొందరు కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం గద్వాల టికెట్ సరితకు ఇస్తామని హామీ ఇచ్చిందని, దీంతో ఆమె నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటున్నారు. సరిత కేవలం తన సామాజిక వర్గం ఓట్లను నమ్ముకుని గద్వాల బీఆరెస్‌ ఎమ్మెల్యేను ఎదిరించి కాంగ్రెస్‌లో చేరారు.

కానీ అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కురుమ విజయకుమార్‌కు కాంగ్రెస్‌లో సీనియర్ నేతగా గుర్తింపు ఉంది. ఆయన ఈసారి గద్వాల కాంగ్రెస్ టికెట్ కోరుతున్నారు. సరితకు టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదని ఆయన బాహాటంగా అంటున్నారు. సరిత సామాజిక వర్గంలో వర్గ పోరు ఉండటంతో ఆ వర్గం ఓట్లు కాంగ్రెస్‌కు కలిసొచ్చే అవకాశం కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.

ఒకవేళ మాజీ మంత్రి అరుణ కాంగ్రెస్‌లోకి వస్తే ఈ వర్గం ఆమె వైపే ఉంటుందని ఆ వర్గంలోని కొందరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అరుణ పోటీ చేస్తే గద్వాల నియోజకవర్గంలో భారీ మెజారిటీ తో గెలుపొందడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గద్వాల రాజకీయంలో దీటైన మహిళ అరుణ


గద్వాల నియోజకవర్గంలో డీకే అరుణ రాజకీయ ఎత్తులకు ఉద్దండ నేతలే కనుమరుగయ్యారు. గద్వాల రాజకీయంలో తనదైన ముద్ర వేశారు. రాజకీయ కుటుంబ చరిత్ర కల్గిన అరుణకు రాజకీయం వారసత్వంగా వచ్చింది. మక్తల్‌కు చెందిన చిట్టెం నర్సిరెడ్డి (నక్సల్స్ దాడిలో చనిపోయారు) ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూతురు అరుణకు తన తండ్రి వారసత్వంగా రాజకీయం వచ్చింది. ఇటు అత్తగారిల్లు కూడా రాజకీయ చరిత్ర కలిగినదే.

గద్వాలలో డీకే సత్యరెడ్డి ఇంటికి రెండో కోడలిగా అరుణ వచ్చారు. డీకే సత్యరెడ్డి కూడా పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ రెండు కుటుంబాలు కాంగ్రెస్‌తో అనుబంధం ఉన్నవే. డీకే సత్యరెడ్డి అనంతరం ఆయన పెద్ద కుమారుడు డీకే సమరసింహారెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈయన మంత్రి పదవి చేపట్టారు. తరువాత ఆయన సోదరుడు భరత సింహారెడ్డి (అరుణ భర్త) టీడీపీ తరపున రాజకీయాల్లోకి వచ్చారు.

అన్న సమరసింహారెడ్డికి పోటీగా ఎదిగారు. అన్న కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటే తమ్ముడు టీడీపీ నుంచి బరిలో ఉండేవారు. టీడీపీ హవా కొనసాగడంతో ఎమ్మెల్యేగా భరతసింహ రెడ్డి ఎన్నికవుతూ వచ్చారు. అనంతరం ఆయన అరుణను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అరుణ వచ్చిన తరువాత గద్వాల రాజకీయం మలుపు తిరిగింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌లో ఎదురు లేని నాయకురాలిగా ఎదిగారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

 

 

గద్వాల రాజకీయ చరిత్రలో మలుపు


గద్వాల రాజకీయ చరిత్రనే మార్చి వేసిన ఘనత అరుణ దక్కిoచుకున్నారని చెబుతారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ రాకుంటే గద్వాల నియోజకవర్గం నుంచి సమాజ్‌వాది పార్టీ నుంచి టికెట్ పొంది ఘన విజయం సాధించారు. సమాజవాది పార్టీ అంటే తెలియని ఓటర్లు అరుణ పేరు చూసి ఓటు వేశారంటే గద్వాలలో ఆమె ఎంత ఎత్తుకు ఎదిగారో తెలుస్తుంది. ఈ పార్టీ నుంచి గెలిచి వైస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ వాదం ఉన్నా కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు.

2014లో బీఆరెస్‌ అధికారంలోకి వచ్చిన సమయంలో మంత్రి పదవి ఇస్తామని ప్రతిపాదించినా అరుణ కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నారు. బీఆరెస్‌ను ఆమె తిరస్కరించడంతో అధికార పార్టీ పలు ఇబ్బందులకు గురి చేసింది. అయినా భయపడకుండా బీఆరెస్ ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వచ్చారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమి చెందారు. ఇక్కడ బీఆరెస్‌ అభ్యర్థి గెలుపొందడంతో అరుణ జీర్ణించుకోలేదు.

2019లో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరుణ బీజేపీ లో చేరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి చవిచూశారు. ఇక్కడ బీఆరెస్‌ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. పోరాడి ఓడిన అరుణకు బీజేపీ నాయకత్వం జాతీయ స్థాయిలో చోటు కల్పించింది. వచ్చే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి బరిలో ఉంటారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి.

ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాల నియోజకవర్గంలో పోటీ చేస్తే మళ్ళీ పూర్వ రోజులు అరుణకు వస్తాయని అందరూ అంటున్నారు. ఆమె బీజేపీలో కొనసాగుతారా? లేక కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతారా? అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.