విధాత: సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి, ఇంకా సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (NALLARI KIRAN KUMAR REDDY) బీజేపీలో (BJP)చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2014 ఆయన పదవీకాలం ముగిశాక ఈ పదేళ్లు టీడీపీతో అంటకాగుతూ కాలక్షేపం చేసారు. కానీ పెద్దగా ఫలితం లేకపోవడంతో మళ్ళీ డైరెక్ట్ పాలిటిక్స్ లోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయినా ఇప్పుడు ఆ పార్టీ ఆంధ్రాలో ఉనికిలో లేకపోవడం.. మున్ముందు కోలుకునే అవకాశం లేకపోవడంతో పార్టీ మారడం తప్ప ఇంకో మార్గం లేని పరిస్థితుల్లో ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పని చేసిన ఆయన విభజన సమయంలో సమైక్యవాదాన్ని ఎత్తుకున్నారు. తర్వాత జరిగిన కీలక పరిణామాలతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
ఎన్నికలకు ఏడాదికిపైగానే ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అప్పుడే రాజుకుంటున్నాయి. ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలతో తెలుగుదేశం, వైసీపీ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు బీజేపీ కూడా ఎత్తుగడలు వేస్తోంది. ప్రజల్లో ఉండేలా కార్నర్ మీటింగ్స్, ప్రజాసమస్యలపై పోరాటాల పేరుతో ఆ పార్టీ నేతలు చేస్తున్న పోరాటాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని చెబుతున్నారు. అయినా అందుకు సరిపడా బలం మాత్రం కనిపించడం లేదు.
అందుకే ఏపీలో బలోపేతం అయ్యేలా పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించేలా వ్యూహాలను బీజేపీ రచిస్తోంది. అందులో భాగంగా ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని (NALLARI KIRAN KUMAR REDDY)పార్టీలో చేర్చోకోవాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఆయన కూడా దీనికి అంగీకరించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(AMIT SHAW) ఆదివారం హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
ఈ సందర్భంగా కిరణ్ కుమార్‌రెడ్డి ఆయనతో సమావేశం అవుతారని, ఆయన బీజేపీలో చేరికపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరిగిపోయాయని.. ఇప్పుడు ఫైనల్‌గా అమిత్‌షాతో మాట్లాడబోతున్నారని తెలుస్తోంది.
ఎంత ప్రయత్నిస్తున్నా ఆంధ్రాలో ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేకపోతున్న బీజేపీ కిరణ్ కుమార్ సారధ్యంలో అయినా బలోపేతం అవుతుందేమో చూడాలి.