Free Electricity Fight | ఉచిత విద్యుత్‌పై మాటల మంటలు
Free Flectricity Fight రేవంత్ మాటలపై బీఆర్‌ఎస్ నిరసనలు వక్రీకరిస్తున్నారన్న టీ.కాంగ్రెస్ విధాత: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకం అనవసరమన్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సరికొత్త కిరికిరికి ఆజ్యం పోశాయి. రేవంత్ వ్యాఖ్యలను అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఆయుధంగా మలుచుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండగా, అటు రేవంత్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకోలేక సొంత పార్టీ నేతలు సైతం ఇబ్బంది పడాల్సివచ్చింది. రేవంత్ వ్యాఖ్యలు […]

Free Flectricity Fight
- రేవంత్ మాటలపై బీఆర్‌ఎస్ నిరసనలు
- వక్రీకరిస్తున్నారన్న టీ.కాంగ్రెస్
విధాత: వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ పథకం అనవసరమన్నట్లుగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య సరికొత్త కిరికిరికి ఆజ్యం పోశాయి. రేవంత్ వ్యాఖ్యలను అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఆయుధంగా మలుచుకుని కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తుండగా, అటు రేవంత్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పుకోలేక సొంత పార్టీ నేతలు సైతం ఇబ్బంది పడాల్సివచ్చింది.
రేవంత్ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో బి ఆర్ ఎస్ మంత్రులు వక్రీకరిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటు టీ.కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు చెబుతున్నారు. 24గంటల ఉచిత విద్యుత్ కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రధాన అంశాలలో ఒకటని గుర్తు చేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు బ్రేక్ లేసేందుకు ఎదురుచూస్తున్న బీఆర్‌ఎస్‌కు రేవంత్ వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి. ఇంకేముంది.. రేవంత్ వ్యాఖ్యలనే ఆయుధంగా మలుచుకుని కాంగ్రెస్‌ను ప్రజా క్షేత్రంలో నిలబెట్టేందుకు మంత్రులంతా రంగంలోకి దిగి కాంగ్రెస్‌పై ముప్పేట దాడి ఆరంభించారు.
కేటీఆర్, జి.జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ సహా బీఆర్‌ఎస్ మత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మూకుమ్మడిగా రేవంత్ వ్యాఖ్యలను పట్టుకుని కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు వ్యతిరేకమంటు, కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అంటు విమర్శనాస్త్రాలు సంధించారు.
రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఉచిత విద్యుత్ అంశం రచ్చ రేపుతుంది. అమెరికాలో తానా సభలో ఉచిత పథకాలపై తన అభిప్రాయం చెప్పే క్రమంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ అనవసరంగా 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారని, విద్యుత్ సంస్థల వద్ధ కమిషన్ కోసమే ఉచిత విద్యుత్ పథకం అని, ఎకరాకు గంట విద్యుత్ సరఫరా చాలని, మూడు ఎకరాలుంటే మూడు గంటల విద్యుత్ చాలంటు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆయన ఏ సమయంలో ఏ సందర్భంలో అలా అన్నప్పటికి తెలంగాణలో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ఎదురుచూస్తున్న బీఆర్‌ఎస్‌కు రేవంత్ వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి. చంద్రబాబునాయుడు కనుసన్నల్లో రాజకీయం చేసే రేవంత్ రెడ్డికి వ్యవసాయం, రైతుల కష్టాలు తెలువవంటు , రేవంత్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ విధానంగా భావించాలని, అందుకే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రైతులు తమ నిరసన తెలుపాలంటు మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పక్షంలో ఆ పార్టీ రైతులకు ఇచ్చే కానుక ఇదేనా అంటు నిలదీశారు.
కాంగ్రెస్ నిజస్వరూపం బయపడింది: మంత్రి జగదీష్‌రెడ్డి
రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటు మూడు గంటలే చాలంటు పీసీసీ చీఫ్ రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక అసలు స్వరూపాన్ని బయటపెట్టాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మళ్లీ 2004 నాటి విద్యుత్ పరిస్థితులను గుర్తు చేస్తున్నాయన్నారు. చంద్రబాబు నాయుడు వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు ఇక్కడే తిరుగుతున్నాయంటు రేవంత్‌రెడ్డి పై మండిపడ్డారు. చంద్రబాబు నుండి తెలంగాణ ప్రజలకు శాశ్వత విముక్తి లభించిందనుకుంటున్న సమయంలో రేవంత్ రూపంలో మళ్ళీ వచ్చాడన్నారు.
వ్యవసాయమే దండుగా, ఉచిత కరెంట్ ఎందుకు అని చంద్రబాబు నాయుడు ఆనాడు అన్నాడని, ఇప్పుడు రేవంత్ సైతం రైతులకు ఉచిత విద్యుత్ ఎందుకంటున్నాడన్నారు. రైతులకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కరెంట్ ఇవ్వడం లేదని చెప్పి మేము 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఆనాడు 9గంటల ఉచిత కరెంట్ హామీపై మాట తప్పిందన్నారు.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని ధర్నాలు చేసిన వాళ్లలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే కాంగ్రెస్ నాయకులకు ఎందుకు అంత ఏడుపు అంటూ నిలదీశారు.
లక్షల కోట్లు అప్పులు చేసి ఎగ్గొట్టిపోయిన వాళ్ళ పై ఉన్న ప్రేమ రైతులపై కాంగ్రెస్ కు ఎందుకు ఉండదన్నారు. ఇంకా ఎవరైనా రైతులు కాంగ్రెస్ జెండా పట్టుకోని తిరిగితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆలోచన చెయ్యాలన్నారు. గతంలో వైఎస్సార్ 8 గంటల కరెంట్ ఇవ్వడం లేదనే కదా ఆందోళన చేసిందని గుర్తు చేశారు.
బషీర్ బాగ్ కాల్పుల్లో రైతులు 3 గంటల కరెంట్ కోసమా? మరణించిందంటు ప్రశ్నించారు. కాంగ్రెస్ విద్యుత్ విధానంతో మళ్లీ ఎంతమంది రైతులు మరణించాలి రేవంత్ రెడ్డి? అంటు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ కావాలి కానీ… రైతులకు మాత్రం 24 గంటల కరెంట్ వద్దా?
అని జగదీష్‌రెడ్డి నిలదీశారు. పారిశ్రామిక వేత్తలకు, గృహాలకు 24గంటల విద్యుత్ ఇవ్వగా రైతులకు ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. రేవంత్ మాటలపై రైతాంగం తిరుగుబాటు చేయాలన్నారు.
రైతులపై కాంగ్రెస్ కు చిన్నచూపు: ఇంద్రకరణ్ రెడ్డి
మొదటి నుండి రైతులంటే కాంగ్రెస్‌కు చిన్నచూపు అని, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఎందుకంటున్న రేవంత్ రేపు రైతుబంధు, రైతు బీమా ఎందుకంటారని… అందుకే రైతు వ్యతిరేక కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలన్నారు.
రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు: పొన్నం
ఉచిత విద్యుత్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ మంత్రులు రాజకీయ కుట్రలో భాగంగానే వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల అక్రమాలపై మాట్లాడిన క్రమంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ మంత్రులు తప్పుదోవ పట్టిస్తున్నారనన్నారు. వారికి దమ్ముంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అసలు ఉచిత విద్యుత్ పథకం కాంగ్రెస్ పథకమని ఆ పథకానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.
రేవంత్ వ్యాఖ్యలు వ్యక్తిగతం: వెంకట్‌రెడ్డి
కాంగ్రెస్ 24 గంటల ఉచిత విద్యుత్ పథకంకు కట్టుబడి ఉందని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను పెట్టీ మరి రైతులకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తామన్నారు. రేవంత్ వ్యక్తిగత వ్యాఖ్యలను పార్టీ విధానంగా చూడరాదని, ఎన్నికల మేనఫెస్టోను పార్టీ హైకమండ్ చూసుకుంటుందని దానిపై రేవంత్ కు అవసరం లేదన్నారు.
ఉచిత విద్యుత్‌ను కాంగ్రెస్ కొనసాగిస్తుంది: కాంగ్రెస్ నేతలు
ఉచిత విద్యుత్ పథకంపై పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ నాయకులు వక్రీకరించి రైతులను రెచ్చగొట్టి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి కాంగ్రెస్‌ను బద్‌నామ్ చేసేందుకు దుష్పచారం చేపట్టారని టీ.కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రస్తావించే క్రమంలో రేవంత్‌రెడ్డి ఉచిత విద్యుత్ పథకం పై చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు రేపి ఎక్కడ తమ అవినీతి ప్రజల్లో చర్చనీయాంశమవుతుందన్న భయంతో రేవంత్ వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం చేస్తు, కాంగ్రెస్‌కు ఉచిత విద్యుత్‌కు వ్యతిరేకమంటు బీఆర్‌ఎస్ మంత్రులు దుష్పచారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ అధకారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఎత్తివేస్తామంటు రైతులను తప్పదోవ పట్టిస్తు అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీనే ఉచిత విద్యుత్ పథకం అమలు ప్రారంభించందని, తెలంగాణలో రైతాంగానికి 24గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కాంగ్రెస్ మరింత సమర్ధవంతంగా కొనసాగిస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, అధికార ప్రతినిధి మల్లు రవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రభృతులు బీఆర్‌ఎస్ విమర్శలపై ప్రతిస్పందించారు.
రైతు డిక్లరేషన్‌లో స్పష్టం చేశాం: మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తామో రైతు డిక్లరేషన్ లో చెప్పామని, 24గంటల ఉచిత విద్యుత్ పథకం కూడా అందులో ఉందని పీసీసీ అధికార ప్రతినిధి మల్లు రవి స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇచ్చిన సీఎం కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతున్నాడన్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బిఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారన్నారు. నాడు వైఎస్ఆర్ రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కేసీఆర్ ఎక్కడి నుండి ఇస్తారని అనలేదా అంటు ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో ప్రభుత్వం ప్రయివేటు సంస్ధలతో కుమ్మక్కు అయ్యి ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందన్నారు.
అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ విధానపరమైన నిర్ణయం కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశాలపై రాజకీయంగా లబ్ది పొందాలని బిఆర్ఎస్ చూస్తోందన్నారు. పేరుకు 24 గంటల ఉచిత విద్యుత్ అంటున్నారు కానీ అది క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదన్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ కాంగ్రెస్ విధానం: మధు యాష్కీ
రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందించడం కాంగ్రెస్ విధానమని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి స్పష్టం చేశారు. కేసీఆర్ 24 గంటల కరెంట్ పేరుతో రైతులను మోసం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి మాటలను వక్రీకరిస్తుందన్నారు. కేటీఆర్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
బషీర్ బాగ్ విద్యుత్ కాల్పులు జరిగినప్పుడు టీడీపీ లో ఉన్న కేసీఆర్ ఎందుకు నోరు మెదపలేదంటు ప్రశ్నించారు. ఆనాడు టిడిపి సర్కార్ విద్యుత్ కాల్పుల్లో కేసీఆర్ భాగస్వామిగా ఉన్నారన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీేనే అన్నారు. 24 గంటల కరెంట్ వెనుక ఎంత అవినీతి జరిగిందో మా దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.
విద్యుత్ కొనుగోలు అవినీతిలో కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందని ఆరోపించారు. 24 గంటల విద్యుత్ పేరుతో కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారన్నారు. మంత్రి కేటీఆర్ మిల్లర్ల తో కలిసి దోపిడీకి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతి వెలికి తీస్తామన్నారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు.. ఉచిత విద్యుత్ పథకంలో కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని నిరసిస్తు అన్ని విద్యుత్ సబ్ స్టేషన్ ల వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాలన్నారు. ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. కరెంట్ కోతలపై నిలదీయాలన్నారు.
ఉచిత విద్యుత్ పథకం కొనసాగిస్తాం: భట్టి
కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తుందని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ హాయంలో వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం అమలు చేసిందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని, బడ్జెట్ ఫలాలను రైతులకు అందించేలా ఉచిత విద్యుత్‌ను రైతులకు తగ్గించకుండా కొనసాగించి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు.
రేవంత్ రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలి: దాస్యం వినయ్ భాస్కర్
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటున్నందుకు నిరసనగా మంగళవారం హనుమకొండలోని కాళోజీ జుంక్షన్ వద్ద కాంగ్రెస్ దిష్టిబొమ్మ దగ్దం చేసి ధర్నా చేశారు.
ఈ సందర్బంగా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత24గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా, విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందిస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా రైతులకు అందివాలనే సంకల్పంతో “ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్” అనే నినాదంతో మా నాయకుడు ముందుకెళ్తున్నారని, దేశ ప్రజలు, దేశ వ్యాప్తంగా రైతులు అందరు సీఎం కేసీఆర్ వెంట వస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి రైతులకు 24గంటల ఉచిత కరెంట్ ను వద్దని చెప్పిన కాంగ్రెస్ మనుగడ ఉండదన్నారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని పాతర పెడతాం అని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిన అనేక మంది రైతుల బలిదానం చేసిందన్నారు. కేంద్ర మంత్రుల కొడుకులు వారి వాహనాలతో తొక్కించి రైతులను హత్య చేశారని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ , మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కేసిఆర్ అవినీతి బయట పెడితే తప్పుడు ప్రచారం: ఎమ్మెల్యే సీతక్క
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలను బిఆర్ఎస్ నాయకులు వక్రీకరించి మరో సారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ములుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సీతక్క తన వాయిస్ తో కూడుకున్న వీడియో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో కెసిఆర్ చేస్తున్న అవినీతిని బయట పెడితే తమ నాయకుడి పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులకు ఏక కాలంలో రైతు రుణమాఫీ చేస్తాం అని మోసం చేసింది కెసిఆర్ కాదా? ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనే దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రకటించారు.
బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కుక్కకు బొక్క దొరికినట్లు అమెరికాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించారని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం కాదు నాణ్యమైన 8 గంటల విద్యుత్ ఇస్తే సరిపోతుందని రేవంత్ రెడ్డి అంటే మా నాయకుడి వాఖ్యలను వక్రీకరిస్తు బిఆర్ఎస్ నాయకులు పబ్బం గడపాలని చూస్తున్నారని సీతక్క పండిపడ్డారు.