సంక్రాంతికి ఫుల్ మీల్స్ ప్యాకేజీ: బుర్రా సాయిమాధవ్

విధాత‌: ఈమధ్య తెలుగులో వరుసగా భారీ చిత్రాలకు తనదైన శైలిలో అద్భుతమైన సంభాషణలు సమకూర్చుతున్న రచయిత ఎవరంటే.. ఎవరైనా ఇట్టే సాయి మాధవ్ బుర్రా పేరు చెప్తారు. క‌థ‌ను, స‌న్నివేశాల‌ను బ‌ట్టి బుర్ర ఉప‌యోగించి బాగా రాస్తాడ‌నే పేరు ఈయ‌న‌కు చాలా త‌క్కువ కాలంలోనే వ‌చ్చింది. ఈయన రాసేవి పంచులు కాదు డైలాగులు. సందర్భోచితంగా, సన్నివేశాలకు, పాత్ర‌ల‌కు అనుగుణంగా ఆయ‌న డైలాగ్స్ ఉంటాయనే మంచి పేరు ఈయనకు ఎప్పుడో వచ్చింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘కృష్ణం వందే […]

సంక్రాంతికి ఫుల్ మీల్స్ ప్యాకేజీ: బుర్రా సాయిమాధవ్

విధాత‌: ఈమధ్య తెలుగులో వరుసగా భారీ చిత్రాలకు తనదైన శైలిలో అద్భుతమైన సంభాషణలు సమకూర్చుతున్న రచయిత ఎవరంటే.. ఎవరైనా ఇట్టే సాయి మాధవ్ బుర్రా పేరు చెప్తారు. క‌థ‌ను, స‌న్నివేశాల‌ను బ‌ట్టి బుర్ర ఉప‌యోగించి బాగా రాస్తాడ‌నే పేరు ఈయ‌న‌కు చాలా త‌క్కువ కాలంలోనే వ‌చ్చింది. ఈయన రాసేవి పంచులు కాదు డైలాగులు.

సందర్భోచితంగా, సన్నివేశాలకు, పాత్ర‌ల‌కు అనుగుణంగా ఆయ‌న డైలాగ్స్ ఉంటాయనే మంచి పేరు ఈయనకు ఎప్పుడో వచ్చింది. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ‘కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్‌’తో ర‌చ‌యిత‌గా ప‌రిచ‌య‌మైన ఈయ‌న ‘గోపాల గోపాల, ఖైదీ నెంబ‌ర్ 150, మ‌హాన‌టి, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, సైరా న‌ర‌సింహారెడ్డి, ఆర్ఆర్ఆర్’ వంటి విభిన్న త‌ర‌హా చిత్రాల‌కు త‌న‌దైన శైలిలో సంభాష‌ణ‌లు అందించి ఎలాంటి క‌థ‌ల‌నైనా త‌న క‌లంతో మంచి సంభాష‌ణ‌లు రాయ‌గ‌ల‌న‌ని నిరూపించాడు. ప్రస్తుతం ఆయన బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రానికి సంభాషణలు అందించారు.

ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. వీరసింహారెడ్డిలో ఇంతకుముందు చూడని ఓ అద్భుతమైన కొత్త అంశం ఉంది. బలమైన ఎమోషన్ దాగి ఉంది. అందుకే ఈ చిత్రానికి మాటలు రాయడానికి నాకు రెండు నెలలు పట్టింది అని చెప్పుకొచ్చారు. బాలయ్యతో నాకిది నాలుగో చిత్రం. చాలా కొత్తగా ఉంటుంది.

మాస్ క్లాస్ ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాలను అలరించే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. బాలయ్య నుంచి కోరుకునే అంశాలన్నీ అందించేలా సంక్రాంతికి ఫుల్ మీల్స్ ప్యాకేజీలా ఈ చిత్రం ఉంటుంది. పక్కా కమర్షియల్ చిత్రాలకు ఇలాంటి అరుదైన డెప్త్‌గా ఉండే కథ దొరకడం చాలా అరుదు. ఈ కథ విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది.

ఇందులో బలమైన భావోద్వేగాలు ఉన్నాయి. అనవసర సన్నివేశాలు ఉండవు. బాలయ్యను ఎలా చూడాలనుకుంటున్నారో ఆయన నుంచి ఎలాంటి డైలాగ్స్ వినాలనుకుంటున్నారో అన్ని ఇందులో ఉన్నాయి. ఇక నాకు గోపీచంద్ మలినేనితో మంచి అనుబంధమే ఉంది. మా ఇద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా.

గోపీచంద్ మ‌లినేని తీసిన క్రాక్ మూవీకి కూడా నేను ప‌నిచేశాను. గోపీచంద్ మలినేని త్వరలో అగ్ర దర్శకుడుగా మారిపోతున్నాడు. భవిష్యత్తులో ఆయన గురించి యావత్ ప్రపంచమే మాట్లాడుకునే స్థాయిలో ఉంటారు. ఆయనకు కన్విన్స్ చేయడం వచ్చు.. క‌న్విన్స్ అవ్వడము తెలుసు. ఈ రెండు దర్శకులలో ఉండాల్సిన అరుదైన లక్షణాలు.

ఇక బాలయ్య విషయానికి వస్తే.. ఆయనలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఒక్కసారి కథకు ఓకే చెప్తే ఇక అందులో వేలు పెట్టరు. రాజమౌళి చిత్రాలకు మరల మరల పనిచేయాలని నాకు ఉంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, సమంతా శాకుంత‌లం, రామ్ చరణ్- శంకర్ కాంబోలో చ‌ర‌ణ్ 15వ చిత్రానికి ప్రస్తుతం సంభాషణలు అందిస్తున్నాను.

అలాగే పాన్ వరల్డ్ రేంజ్‌లో రూపొందుతున్న ప్రభాస్- నాగఅశ్విన్ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట Kకు పనిచేస్తున్నాను. ఇది ట్రైమ్‌ ట్రావెల్ చిత్రమే కాదు. ఇంకా ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ఇంత‌కు ముందు నాగ్ అశ్విన్ చిత్రం మ‌హానటికి నేనే ప‌నిచేశాను. ఇక నేను ఫలానా క‌థ‌కు బాగా కష్టపడ్డాను అని చెప్పను. ప్రతి కథను సవాల్ గానే తీసుకుంటాను. అయితే ఒత్తిడి మాత్రం దరిచేర‌నివ్వను. ఒత్తిడి ఏర్పడితే ఔట్‌పుట్ సరిగా ఉండదు.

కథ‌, పాత్ర, సన్నివేశం, హీరో ఇమేజ్ ఇలా అన్నింటినీ ఒకేసారి దృష్టిలో ఉంచుకుంటాను. అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తాను. కథలో సీన్లు బాగా లేన‌ప్పుడు అందులో ప‌స‌లేన‌ప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు ఏం రాయాలో మనకే అసలు అర్థం కాదు. అలాంటప్పుడు కష్టపడాల్సి వస్తుంది గాని అన్ని బాగా ఉన్న చిత్రాలకు ఎలాంటి టెన్షన్ లేకుండా సంభాషణలు రాయవచ్చు.

నాకు కూడా పసలేని సందర్భాలు ఎన్నో ఎదురయ్యాయి. కాకపోతే వాటి పేరు చెప్పలేను. నాకు దర్శకులతో ఆరోగ్యకరమైన చర్చలే జరుగుతుంటాయి. కథలో ఏదైనా లోపం ఉంటే దర్శకునికి చెప్పేస్తాను. అలా చెప్పకపోతే అది తప్పు అవుతుంది.

మనం ఎదురు చెబితే మనల్ని దూరం పెట్టేస్తారేమోనని భయపడి చెప్పకపోతే అది ద్రోహం.. మోసం అవుతుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్టు దర్శకులతో చెప్పాలి. దానివల్ల ఆయన తాను ఎందుకు అలా చేయాల్సి వస్తున్నదో నాకు కూడా ఒక స్పష్టత ఇస్తాడు. దాంతో సంభాషణలు రాయడం సుల‌భ‌ం అవుతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు.