వాంటెడ్ క్రిమినల్ కాల్చివేత‌

యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, వాంటెడ్ క్రిమినల్ హతమయ్యాడు.

  • Publish Date - January 5, 2024 / 06:04 AM IST
  • యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఘ‌ట‌న‌
  • హ‌తుడి త‌ల‌పై ఒక ల‌క్ష రూపాయ‌ల రివార్డు



విధాత‌: యూపీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, వాంటెడ్ క్రిమినల్ హతమయ్యాడు. సుల్తాన్‌పూర్ జిల్లాలో శుక్రవారం ఉదయం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ జ‌రిపిన కాల్పుల్లో అత‌డు మ‌ర‌ణించాడు. హ‌తుడి తలపై రూ.లక్ష రివార్డు ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు. నేరస్థుడిని వినోద్ కుమార్ ఉపాధ్యాయ్‌గా గుర్తించినట్టు పేర్కొన్నారు.


సుల్తాన్‌పూర్‌లో ఉపాధ్యాయ్ ఉన్న‌ట్టు త‌మ‌కు సమాచారం అందిన‌ట్టు ఎస్టీఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమితాబ్ యష్ మీడియాకు వెల్ల‌డించారు. ఎస్టీఎఫ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింద‌ని పేర్కొన్నారు. పోలీసుల రాక‌ను గుర్తించి ఉపాధ్యాయ్‌ బ‌ల‌గాల‌పై కాల్పులు జరిపాడ‌ని వెల్ల‌డించారు.


లొంగిపోవాల‌ని హెచ్చ‌రించినా ఖాత‌రు చేయ‌క‌పోవ‌డంతో బ‌ల‌గాలు జ‌రిపిన ఎదురు కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌కు తీవ్ర గాయాలయ్యాయ‌ని తెలిపారు. క్ష‌త‌గాత్రుడిని సుల్తాన్‌పూర్ మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు వెల్ల‌డించారు. ఉపాధ్యాయ్‌పై గోరఖ్‌పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లక్నోలో 35 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప‌లు హ‌త్య‌ల‌తోపాటు క్రూరమైన నేరాల అభియోగాలు అత‌డిపై ఉన్న‌ట్టు పేర్కొన్నారు.